కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలను నిర్మించి.. అలుపెరగకుండా పోరాటం పటిమ చూపి.. విజయం సాధించిన రాకేశ్ టికాయత్‌పై ప్రశంసలు జల్లు కురుస్తున్నది. దేశ వ్యాప్తంగా ఇప్పుడాయన హీరో. జగమొండి మోదీ మెడలు వంచి.. మూడు చట్టాలను రద్దు చేస్తానని ప్రకటింప జేసే వరకు నిద్రపోకుండా.. పీఎంను నిద్రపోనీయకుండా చేసిన టికాయత్‌ను యావత్ దేశం కొనియాడుతుంది. సోషల్ మీడియా అతన్ని హీరోగా కీర్తిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నది.
మోడీ ఈ చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించినా.. టికాయత్ వినలేదు. నమ్మలేదు. ఈ వింటర్ సెషన్లో వీటిని పూర్తిగా రద్దు చేసేవరకు పోరాటం ఆపేది లేదని తనదైన ఉద్యమ పంథాలోనే ఆన్సరిచ్చాడు మోడీకి. ఏడాదికిపైగా ఉద్యమాన్ని చెక్కుచెదరకుండా నడపడంలో సక్సెసయ్యాడు. ఎంతో మంది బలిదానాలు తర్వాత మోడీ కళ్లు తెరిచాడు. రైతు ఉద్యమాన్ని అణిచేందుకు ఎన్ని ఆటంకాలు సృస్టించాలో, ఎంత నిర్బంధం విధించాలో అంతా చేసింది సర్కార్. కానీ ఎక్కడా వెనుకడుగు వేయలేదు రైతులు.
దాదాపు 800 మంది వరకు రైతులు అసువులు బాసిన తర్వాత రైతులకు క్షమాపణ చెబుతూ ఈ మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. అప్పటికే మోడీ ప్రభుత్వానికి రైతాంగ ఉద్యమ సెగ మామూలుగా తాకలేదు. ఇక ఇలాగే కంటిన్యూ అయితే రానున్నది గడ్డు కాలమేనని గ్రహించాడు మోడీ. అందుకే దిగి వచ్చాడు. బెట్టు వీడడు. క్షమాపణ చెప్పాడు. అది రైతు ఉద్యమ ఫలితమే. యావత్ దేశమే అచ్చెరువొందేలా.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉద్యమాలు నిర్మించిన రాకేశ్ టికాయత్.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సిసౌలిలో 4 జూన్ 1969 లో జన్మించాడు. ఈ 52 ఏళ్ల ఉద్యమ నేత భారతీయ్ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధిగా ఈ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రధాని మెడలు వంచాడు. చరిత్రలో నిలిచిపోయేలా విజయం సాధించాడు.