మొన్న వరుసగా రెండు పత్రికాసమావేశాల్లో చాలా రోజుల తరువాత గుహలోంచి బయటకొచ్చిన కేసరిలా కేంద్ర ప్రభుతం మీద విరుచుకునిపడిన కేసీఆర్ ఆగ్రహావేశాలు, ఆ క్షణం నుంచే బీజేపీ మీద యుద్ధం ప్రకటిస్తూ టీఆరెస్ ప్రభుత్వ భాగస్వాములు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు ధర్నాలు నిర్వహించడం చూశాక కొన్ని సర్కిళ్లలో జోరుగా వినిపిస్తున్న మాట ఇది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీయేతర. కాంగ్రెసేతర పక్షాలను ఒక గూటిలోకి చేర్చి మరొక ఫ్రంట్ నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేసిన మాట అందరికి తెలిసిందే. అయితే సమయాభావం వలన ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

మొన్నటి కేసీఆర్ ప్రకటనలను బట్టి చూస్తూనే కేసీఆర్ తన ప్రయత్నాలను మానుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారని పరిశీలకుల అభిప్రాయం.

ఈ సందర్భంగా ఒక విషయాన్నీ చర్చించుకోవాలి. ప్రధాని పదవి అనేది ఎవరి జేబులో సొమ్మూ కాదు. ప్రజాబలం ఉన్న నాయకుడు ఎవరైనా ఆ పదవికోసం పోటీ పడొచ్చు. దక్షిణభారతదేశంలో కేసీఆర్, జగన్, స్టాలిన్ ముగ్గురూ ప్రజాకర్షక నేతలే. అయితే వీరిలో సీనియర్ గా కేసీఆర్ ప్రధాని పదవికి అన్నివిధాలుగా అర్హులే.

అయితే కేవలం అర్హత ఉంటే చాలదు. ముందుగా కనీసం వందమంది ఎంపీల బలం కావాలి. మరి వీరు ఎక్కడినుంచి వస్తారు?

జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ సఖ్యతతో పనిచేస్తే తెలుగు రాష్ట్రాల్లో ముప్ఫయి అయిదు మంది ఎంపీలను అదుపులో పెట్టుకుంటే, కర్ణాటక, తమిళనాడు ఎంపీలను ఒప్పించడం కేసీఆర్ కు కష్టం కాబోదు. ఆ రకంగా కనీసం వందమంది ఎంపీలు కేసీఆర్ కు మద్దతు ఇస్తారు.

కేసీఆర్ దక్షిణభారత దేశానికి చెందినవారు కావడం, ఆంగ్లం, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో మంచి పట్టు ఉండటం మరొక అర్హతగా ఆయనకు నిలుస్తున్నది. బీజేపీ నానాటికీ బలహీనపడుతుండటం, కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పుంజుకోలేకపోవడం, బీజేపీకి ప్రత్యర్థిగా ఎదగలేకపోవడం బాధాకరం. ఒకప్పటిలా జాతీయపార్టీలకు భజన చేస్తూ బ్రతకాల్సిన అవసరం ఈ రోజుల్లో ఏ ప్రముఖ నాయకుడికీ లేదు. ప్రజాకర్షణ కలిగిన నేతలైన కేసీఆర్, జగన్, స్టాలిన్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్, కుమారస్వామీ మొదలైనవారు జాతీయపార్టీలను ధిక్కరించి సొంతంగా పార్టీలు పెట్టుకుని అధికారాన్ని సాధించారు. అందువలన వీరు ప్రాణాలు పోయినా సరే, ఇతరుల దౌష్ట్యానికి తలవంచరు. జగన్, కేసీఆర్, కేజ్రీవాల్, మమతా మొదలైనవారు ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కేసీఆర్ జాతీయరాజకీయాల్లో పనిచేయడానికి మరొక బలం ఏమిటంటే ఆయన కొడుకు కేటీఆర్ పూర్తి పరిణితి, అనుభవాన్ని సాధించారు. కనుక కేసీఆర్ 2024 నాటికి ఒక బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమిని నిర్మించడానికి అన్ని సమర్ధతలు కలిగినవాడు.

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము… ఇరవై మంది ఎంపీలు కూడా లేని దేవెగౌడ ప్రధానమంత్రి కాగా లేనిది ఒక కేసీఆర్ కు, ఒక మమతా బెనర్జీకి, ఒక నితీష్ కుమార్ కు ఎందుకు సాధ్యం కాదు? రాజ్యం వీరభోజ్యం.

ముర‌ళీమోహ‌న రావు ఇల‌పావులూరి

You missed