తెలంగాణోళ్లు బొంబాయి.. దుబాయ్ వెళ్తారు పొట్టచేతబట్టుకుని. రాయలసీమలో ఉన్న కూలీలు తెలంగాణ కొస్తరు కూలీ పనులకు. కరువు పరిస్థితులు ఎక్కడైనా ఒక్కటే. రాయలసీమోళ్లు మనదగ్గరికొచ్చిర్రు కదా అని మనోళ్లంతా ఓ వెలిగిపోతున్నారు.. ధనవంతులు అని మనం సంబరపడితే అంతకన్నా మూర్ఖత్వం ఏముండదు. దుబాయ్ దేశాల్లో కూలీ పనుల కోసం అప్పులు చేసుకుని అక్కడ కడతేరుతున్న బుతుకులెన్నో ఉన్నాయి.
బొంబాయికి వలస వెళ్లి అక్కడే స్థిర నివాసాలేర్పుటుచేసుకుని బతుకుతున్న వాళ్లెంతో మంది ఉన్నారు. పాలమూరు ఇప్పటికీ వలసల జిల్లానే. తెలంగాణ రాగానే అంతా పచ్చగై.. బతుకులన్నీ వెలిగిపోయి.. పేదరికమంతా పారిపోయి.. ధనవంతులమైపోయి.. పరపతి ఆమాంతం పెరిగిపోయి.. ఏదో అయిపోయామని ఎవరైనా అంటే అంతకు మించిన ప.. చ్చి అబద్దం ఇంకొకటుండదు. ఇక్కడ ఇంకా ఏమీ పరిస్థితులు మారలే. అట్లనే ఉన్నయి. జీవన ప్రమాణాలేమీ పెరగలే.. ఇంకా దారుణమయ్యాయి.
అమరావతి గ్రాఫిక్స్ లాగా ఇక్కడ మీడియా మాత్రం పాలకులను వేనోళ్ల పొడిగేందుకు అలవాటు పడి అలా పచ్చటి వార్తలు పరిచేసి అంతా బాగుబాగు అని దానికదే జబ్బలు చరుచుకుంటూ ఉంటుంది. జనాలను భ్రమల్లో ముంచుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పడమంటే..
షర్మిలా పాదయాత్రలో భాగంగా పనిచేసుకుంటున్న పొలంలోకి వెళ్లింది. అక్కడ కాసేపు కూలీలతో మాట్లాడింది. వాళ్లన్నారు.. మేము కర్నూలు నుంచి వచ్చాం.. అక్కడ వర్షాలు లేవు.. ఇక్కడ కూలీ గిట్టుబాటవుతుందని.. అంతే మన టీఆరెస్ మీడియా.. అభిమానగణం.. షర్మిలను టార్గెట్ చేశారు. మీ అన్న రాజ్యంలో ఎంతటి దుర్బిక్షమో కదా.. అక్కడ పరిస్థితులు వెలగబెట్టక ఇక్కడేం చేస్తున్నావని. కరెక్టే. కానీ అక్కడ అన్న రాజకీయం చేస్తడు.. ఇక్కడ చెల్లె ప్లేస్మెంట్ కోసం తండ్లాడుతుంది. కాదనేవారెవ్వరు. కానీ కూలీ పనులకు అక్కడివాళ్లిక్కడికి వచ్చినంత మాత్రానా.. మనం సిరిమంతులం.. వాళ్లు కూలీలు అని మాత్రం భ్రమించొద్దు. అంతా వలసకూలీలే. రాజకీయ నాయకులతో సహా. ఎవరి పొట్టతిప్పల వారిది.