స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత పదవి కాలం వచ్చే నెలతో ముగుస్తుంది. మళ్లీ అదే స్థానం నుంచి ఆమెను రెన్యూవల్ చేయాలని మొదట భావించారు. ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచన. కానీ ఈసారి లోకల్ బాడీ నుంచి కాకుండా ఎమ్మెల్యే కోటా నుంచి కవితను ఎమ్మెల్సీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఈ నెల 16 న నామినేషన్లకు చివరి తేదీ.. రెండు రోజుల ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. 29న ఎన్నికలు. ఎమ్మెల్యే కోటా నుంచి 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఆశావహులంతా కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తాడోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. తమకు తెలిసిన మార్గాల గుండా.. ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.
కేసీఆర్ ను నేరుగా కలిసే వీలు లేదు. ఫామ్ హౌజ్‌లోకి పర్మిషన్ లేకుండా అడుగు పెట్టే అవకాశం లేదు. ఆయన మదిలో ఏముందో తెలుసుకునే ఛాన్స్ అసలే లేదు. అందుకే చివరి వరకూ వేచిచూడాలి అంతే. కవితకు మాత్రం ఈసారి ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ ఫిక్స్ అయిపోయాడు. ఆమెను లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీగా చేసిన తర్వాత వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని భావించారు. కానీ కరోనా రావడం, ఈటల రాజేందర్ తిరుగుబావుటా ఎపిసోడ్ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఆ వైపుగా కేసీఆర్ దృష్టి పెట్టలేకపోయాడు.
ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది. కవితకు లోకల్ బాడీ నుంచి కాకుండా ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ ఖరారు కానుంది. ఆ తర్వాత మంత్రి పదవి వరించనుంది. ఉమ్మడి నిజామాబాద్ లోకల్ బాడీ నుంచి ఎవరికి అవకాశం ఇస్తారో తెలియదు. ఆకుల లలిత, ఈగ గంగరెడ్డి, అరికెల నర్సారెడ్డి, డాక్టర్ మధుశేఖర్, మోహన్‌రెడ్డి…. ఇలా కవిత, కేసీఆర్ ఇచ్చిన హామీల లిస్టులో చాలా మందే ఉన్నారు. వీరెవరికైనా అవకాశం రావొచ్చు.
