ఉప ఎన్నిక వస్తే.. ఎన్నో వస్తాయి. ఎక్కడా జరగని అభివృద్ధి అక్కడ జరుగుతుంది. కొత్త పథకాలన్నీ అక్కడే పైలట్ ప్రాజెక్టులవుతాయి. ఏళ్ల తరబడి నరకం చూపించే గుంతల రోడ్లు డాంబర్ రోడ్లవుతాయి. డబుల్ బెడ్ రూం ఇండ్లు వేలకు వేలు సాంక్షన్ అవుతాయి. పాత పథకాలన్నీ అంతటా పెండింగ్‌లో ఉంటే ఇక్కడే చకచకా అమలవుతాయి. ఇలా ఎన్నో రకాల లాభాలు ఆ నియోజకవర్గానికి. ఇలా ప్రజలు, ప్రతిపక్షాలు అనుకోవడానికి కారణం హుజురాబాదే. సీఎం కేసీఆరే.
ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడగొట్టాలని పరిపాలన మొత్తం ఆయన ఇక్కడి నుంచే కేంద్రీకరించాడు. మంత్రులను మోహరింపజేశాడు నెలల తరబడి. శక్తులన్నీ ఇక్కడే కాపుకాసి వున్నాయి. నిధులు వరదలా పారాయి. ఎవరేమనుకున్నా డోంట్ కేర్.. ఈటలకు రాజకీయ సమాధి కట్టాలె. నోరు తెరిచి ఎదురు తిరిగినోడిని లేవకుండా దెబ్బ కొడితే.. ఇంకెవడూ నోరు తెరవడు.. ఎదురు తిరగాలనే ఆలోచన వస్తేనే చచ్చిపోతారు. ఇలా ఆలోచించాడు కేసీఆర్ తన స్థాయి మరిచిపోయి. అన్నింటిలో దిగజారారు. అన్నింటికీ దిగజారారు. అయినా గెలవలేదు.
ఈ ఎన్నిక రాకముందు.. ఈటల రాజీనామా చేసిన కొత్తలో ఎమ్మెల్యేల రాజీనామాలకు ఒత్తిడి పెరగింది. తర్వాత కొంత సద్దుమణిగింది. కానీ ఇప్పుడు మళ్లీ మొదలైంది ఈ రచ్చ. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు .. హుజురాబాద్ ప్రచారంలో.. గెల్లు ఓడిపోతే తను రాజీనామా చేస్తానని చెప్పడమే దీనికి ఊతమిచ్చింది. గవ్వలు బాలరాజు గువ్వలు పగిలిపోయేలా సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు. ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. బాలరాజు సహనం కోల్పోయి పోరా.. ఫోన్ పెట్టెయ్ రా అని బూతులకు కూడా దిగుతున్నాడు. మీ బీజేపీ లీడర్లను ముందు రాజీనామా చేపించు.. తర్వాత నేను చేస్తా.. అయినా నా రాజీనామా నా ఇష్టం.. నాకు ఇష్టమైనప్పుడ చేస్తా… అని కూడా గదమాయిస్తున్నాడు. అదీ సంగతి..!!