అయ్యయ్యో వద్దమ్మా… అని ఓ యాడ్ కంటెంట్‌ను తీసుకుని డ్యాన్సుచేశాడు ఓ కుర్రాడు. పేరు శరత్. బ్యాండ్ కొట్టుకుంటూ బతుకుతాడు. అనుకోకుండా చేసిన ఈ డ్యాన్సు వైరల్ అయ్యింది. అందరూ దీనికే ఎగబడ్డారు. మన మీడియా వేలం వెర్రి కదా.. అదీ ఎగబడింది.. దీన్ని బాగానే చూపెట్టింది.
కొద్ది రోజులకు ఈ శరత్ ఎవరి చేతిలోనో తన్నులు తిన్నాడు. మీడియాకు మరింత పనిదొరికింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ చానల్ వాళ్లకైతే రికాం లేదు. ఇదే పని పెట్టుకున్నారు. హిజ్రాలను కించపరుస్తూ చేసిన ఈ డ్యాన్సు తో వాళ్లే శరత్‌ను తన్నారని విస్త్రృత ప్రచారం చేశారు. అప్పటి వరకు ఈ మీడియా శరత్‌ను హీరో చేసింది. తన్నుల తిన్నాడని విలన్నూ చేసింది. శరత్ బిక్కమొకమేసుకున్నారు. తన వీడియోను వైరల్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పినఆ నోటి నుంచే ఒక అమ్మకు అబ్బకు పుట్టినవారైతే ఇలా తప్పుడు వార్తలు రాయరు.. అంటూ నోరు చేసుకున్నాడు. అక్కడిదాకా వచ్చింది పరిస్థితి.
మళ్లీ మీడియాకు వార్త దొరికింది. అయ్యయ్యో… తన్నింది హిజ్రాలు కాదా.. మరెవరు..? తెలుసుకోవాలి కదా.. అంతకన్నా మనకున్న పనేంది..? మనం ఇంత కన్నా సమాజాన్ని ఉద్దరించేదేముంది..? అని అనుకున్నారు. పోలోమని బయలుదేరారు. శరత్ అడ్రస్‌ను దొరకబట్టుకున్నారు. శరత్ దొరికినందుకు ఆ చానళ్ల వారి ఆనందం చూడాలి. అతను ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు వారి ముఖంలో కనిపించే సంతోషం చూడాలి. వాళ్లడిగే పిచ్చి పచ్చి తలాతోకా లేని ప్రశ్నలకు తన్నులు తిన్న శరత్ ఇస్తున్న ఆన్సర్లు చూడాలి.. అబ్బబ్బ రెండు కళ్లూ చాలవనుకో. శరత్ ఇంటర్వ్యూతో మన మీడియా మరింత ఎత్తుకు ఎదిగి ఎక్కడికో వెళ్లిపోయిందనుకో. అదే కదా మననమంతా కోరుకున్నది.
అసలు తను తన్నులు తిన్నది హిజ్రాలతో కాదని తన గొప్ప ఫ్లాష్ బ్యాక్ చెప్పుకున్నాడు ఎంతో గర్వంగా.. గొప్ప పనిచేసినట్టు శరత్. ఆ స్థాయి ఆలోచనలతో ఉన్నవాడికి అదే గొప్పపని మరి. తన ఫ్రెండ్ భార్యతో ఎవడో అసభ్యంగా మాట్లాడినందుకు రూమ్‌లో వేసి తన్నాడంట.. దాన్ని వీడియో తీసి వైరల్ కూడా చేసుకున్నారంట.. తనే చెప్పాడు. వాళ్లు తను ఫేమ్ అవుతున్నానని ఇలా అదును చూసి దాడి చేశాడని చెప్పాడు. ఇదీ కథ. దీనికి మీడియా హిజ్రాలతో తన్నులు తిన్నాడు.. సుఖీభవ.. సుఖీభవ అని శరత్‌లాగే తన పైశాచికానందం చూపే సరికి….పాపం మనవాడు ఓ దశలో ఉరేసుకుని చనిపోవాలని కూడా అనుకున్నాడట. మన తెగులు.. సారీ,.. తెలుగు మీడియానా మజాకా.. లేపడమూ తెలుసు.. చంపి బొంద పెట్టడమూ తెలుసు.
చివరగా….
ఈ శరత్ చేసి అయ్యయ్యో వద్దమ్మా.. అనే డ్యాన్స్ ఎప్పట్నుంచైతే వైరల్ అయ్యిందో.. ఆనాటి నుంచి ఆ రెడ్‌లేబల్ వాడు ఆ యాడ్‌ను టీవీలో ఇయ్యడం బంద్ చేసేశాడు. ఎందుకంటే.. ఈ యాడ్ తీసిన ఉద్దేశాన్ని మనోడు తన డ్యాన్సుల స్టెప్పుల కింద వేసి పరపరా నలిపేశాడు. దీని కంటెంట్ నవ్వులపాలైంది. అందుకే వాడు ఒకటనుకుంటే ఇంకోటైందిరో..అని దీన్ని చూపడమే మానేసుకున్నాడు.