మంత్రుల కన్నా మన పీఆర్వోలు ఇంకా బిజీగా ఉంటున్నారు. తాము చేయాల్సిన పనుల కన్నా.. ఇంకా వేరే ఇతరత్రా పనులు బాగానే ఉంటున్నట్టున్నాయి. అందుకే అసలు పనికి ఎసరు పెట్టి.. ఇలా కానిచ్చేస్తున్నారు. మన మీడియా మిత్రులే కదా అర్థం చేసుకుంటారు మన కష్టాల్ని అని కూడా కవరింగిచ్చుకుంటున్నారు. కానీ ఒక్కోసారి ఈ పీఆర్వోల చిన్న చిన్న నిర్లక్ష్యాలు, ఏమరుపాట్లు మంత్రలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
మొన్నటికి మొన్న మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే.. అప్పుడే ఆయన్ను చంపేసి ఓ సంతాప ప్రకటన కూడా జారీ చేసేశాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ పీఆర్వో. తాజాగా మరో మంత్రి సత్య
వతి రాథోడ్ పీఆర్వో కూడా రెండు నెలల క్రితం తను రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్‌నే కొంచెం మార్పులు చేసి మళ్లీ తోసేశాడు మీడియా మీదకు. మీ చావు మీరు చావండని. ఇదేందీ..? సేమ్ ఇలాంటి ప్రెస్‌నోటే రెండు నెలల క్రితం కూడా వచ్చిందే.. అని చెక్ చేస్తే.. అచ్చు గుద్దినట్టు అదే. కొం…చెం.. మార్పులు అంతే.
మరి మీడియా కూడా దాన్ని అదే విధంగా దించేస్తే ఎవరైనా కనిపెడితే .. ఉద్యోగం ఊడినట్టే. అదే ప్రెస్‌నోట్ నువ్వెలా మక్కికి మక్కీ దించుతావు.. నీకెందుకు జీతమియ్యాలే.. అని నిలదీస్తరు. మనోళ్లు మార్చుకుని రాశారు లెండి.. ఉద్యోగం కాపాడుకోవాలె కదా మరి. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు పునః ప్రారంభంపై ఆ ప్రస్ రిలీజ్. సెప్టెంబర్ 1నే ప్రారంభించాల్సి ఉండే… కానీ కాలేదు. నిన్నటి నుంచి తెరిచారు.
అప్పడు పెట్టిన సమీక్షే.. అప్పటి ఆదేశాలే కదా ..అనుకున్నాడేమో.. అందులోనూ బా… గా…. బిజీగా కూడా ఉండి ఉంటాడు. ఇలా కాపీ పేస్ట్ చేసి వదిలాడు. ఈ పిచ్చి మీడియా అంత గమనిస్తుందా… ? అని కూడా ఓ వెర్రి నవ్వు నవ్వుకుని మరీ రిలీజ్ చేసి ఉంటాడు దీన్ని.