టెక్నాలజీ ఎంత పెరిగిందంటే .. దాని వల్ల ఉపయోగం కన్నా.. నష్టమే ఎక్కువ. లాభం కన్నా.. అనర్థాలే మిక్కిలి. దాన్ని ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంత వరకు వాడుకుంటే సరిపోతుంది. ఇంకా లోతుల్లోకి పోవాలి.. తెలుసుకోవాలి… జ్ఞానం పెంచుకోవాలనుకునే జిజ్ఞాస అప్పుడప్పుడు మానసిక ప్రకోపాలకు కూడా పురిగొల్పుతుంది. క్రిమనల్ మైండ్ సెట్ ను తెచ్చిపెడుతుంది. పైశాచికానందం రుచి చూపించి ఇదేదో బాగుందే అని దానికే అలవాటు పడి సైకో గా మారుస్తుంది.
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యాప్‌లు.. ఎవరి దరికి చేరుతాయో.. దాని వల్ల ప్రయోజాలేంటో తెలియదు కానీ..అవన్నీ డౌన్లోడ్ అవుతా వుంటాయి. ఆటకు, తమాషాకు మొదలైన ఈ ఆట జీవితాల ముగింపు.. విషాదాంతాల కొనసాగింపు వరకూ సాగుతుంది. ఈ యాప్‌లను నిలవరించే శక్తి ఎవరికీ లేదు. కొత్తగా పుట్టుకొచ్చే వాటినీ ఆపే తరమూ ఎవరికీ రాదు. సైబర్ క్రైమ్ పెరగడానికి ఇగో ఇలాంటి విజ్ఞాన, జిజ్ఞాస ప్రదర్శనలే కారణమవుతున్నాయి. నిత్యం సెల్‌ఫోనే ప్రపంచంగా, ఆండ్రాయిడే లోకంగా.. టెక్నాలజీయే జీవితంగా బతికే యువతకు తమ బతుకులు ఇందులో బందీ అయిపోయాయని తెలియదు. బందీ అయి.. జీవితంలో అనుబంధాలు, మమతానురాగాలు దూరమయ్యాయని గ్రహించలేని దుస్థితికి చేరుతాయి. అనుమానం నీడ బతికి అందులో చిక్కి శల్యమై చితికి చేరుతారు.
రికార్డ్ మై కాల్.. అనేది ఓ యాప్. దీన్ని ఇతరులు మాట్లాడే మాటలను తాము రహస్యంగా వినేందుకు ఉపయోగించుకునే యాప్. భార్య భర్త మీద, భర్త భార్య మీద.. ఓ ప్రేమికుడు ప్రియురాలి మీద.. ఓ ప్రియురాలు.. తన ప్రేమికుడి మీద.. ఇలా అనుమానంతో ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుని ఒకరి మాటలు మరొకరు రహస్యంగా విని .. అనుమానంతో రగిలి.. బంధాలను తెంచేసుకుని… శ్రుతి మించితే ఒకరి ప్రాణాలు మరొకరు తీసేసి.. ఇలా నేరగాళ్లుగా, మానసిక రోగులుగా సైకోలుగా మారేందుకు ఉపయోగపడే యాప్ ఇది.
దీని వల్ల ఏమన్నా ఉపయోగమా..? ఎందుకు ఇలాంటి యాప్‌లు వస్తున్నాయి.? అంటే జనాలు వేలం వెర్రిలా వాడుతున్నారు కాబట్టి అలాంటివి వస్తూనే ఉంటాయి. మరి వీటిని నియత్రించడం సాధ్యం కాదా..? ఇది మాత్రం అడగొద్దు. ఇది ఎవరి చేతిలో లేదు. అవి వస్తూనే ఉంటాయి. మార్కట్లో కోట్లు కొల్లగొడుతూ ఉంటాయి. మనషుల మనుసులను విషంతో నింపిజీవితాలను అంధకారం చస్తూనే ఉంటాయి. ఫిర్యాదొస్తే సైబర్ క్రైమ్ కింద బయట ప్రపంచానికి తెలుస్తుంది. లేదంటే నాలుగు గోడల మధ్యే జీవితాలు విషాదాంతాలుగా మిగిలిపోతాయి…
రికార్డ్ మై కాల్ .. గురించి ఎందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిదంటే.. తాజాగా కరీంనగర్లో ఓ కోడలు ఆస్తి గురించి తన మామ పై దీన్ని ప్రయోగించింది. ఆమె ఫోన్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసి మాట్లాడే ప్రతీకాల్ తన మెయిల్‌కు అనుసంధానం చేసుకున్నది. ప్రతీ మాట వినాలి.. వారిని సాధించాలి. నరకం చూపాలి. ఇది ఇంకో కొడుకు కనిపెట్టాడు. పోలీసులకు ఫిర్యాదివ్వడంతో వెలుగులోకి వచ్చింది. ఈ కోడలు ఆస్తి కోసం దీన్ని ప్రయోగించింది.
ఇదే కోడలు తన భర్తపై అనుమానంతో ఎందుకు ప్రయోగించి ఉండదు..? కచ్చితంగా ప్రయోగించి ఉంటుంది. వారు తెలుసుకునే వరకు ఆ మాటలన్నీ రహస్యంగా ఈమె చెవిన పడుతూనే ఉంటాయన్నమాట. ఇలా మానిసక రోగులుగా మారి… భర్త ఎవరితో మాట్లాడుతున్నాడు..? భార్య ఎవరితో మాట్లాడుతుంది..? అనే అపనమ్మక, అనుమానపు సంసారాలుగా మార్చేందుకు రికార్డ్ మై కాల్ ఎంతో ఉపయోగపడుతుంది. బంధాలు, అనుబంధాల స్థానంలో అనుమానాలను మొలకెత్తిస్తుంది. జీవితాలతో ఆడుకుంటుంది. వారిని అంతు చూసేదాకా నిద్రపోదు.. వీరిని నిద్రపోనివ్వదు.