తనకు విద్యాబుద్దులు చెప్పిన బడి అది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాడాయన. పెద్దవాడయ్యాడు. వ్యాపారంలో రాణించాడు. రాజకీయ నాయకుడయ్యాడు. ఎమ్మెల్యేగా గెలిచాడు. తను ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగినా.. చిన్నప్పటి స్కూల్ మాత్రం శిథిలావస్థకు చేరుకుని దీనంగా మారింది. ఇంకా ఎన్నో రోజులు అది పిల్లలకు నీడనిచ్చేలా లేదు. అది కూల్చేసి కొత్తది కట్టాలంటే.. 5.7 కోట్లు కావాలి. ప్రభుత్వం 4.7 కోట్లు మంజూరు చేసింది. ఇంకా కోటి కావాలి. తనే ఇస్తానని ముందుకొచ్చాడు ఆ నేత. తన తండ్రి ఇటీవల కాలం చేశాడు. తన తండ్రి జ్ఞాపకార్థం కోటి విరాళంగా ఇస్తానన్నాడు. ఆ నేత పేరు బిగాల గణేశ్‌గుప్తా. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే. ఆయన తండ్రి బిగాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం… చిన్నప్పటి నుంచి చదువుకున్న మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కోటి విరాళంగా ఇస్తానని ప్రకటించి ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఓ ఏడాదిలో ఇది కొత్త భవనంగా సకల సౌకర్యాలతో ఇది రూపుదిద్దుకోనుంది.
