రేవంత్‌రెడ్డి ఎంత ఎదుగుదామన్నా… స్వయంకృతాపరాధం అతన్ని వెంటాడుతున్నది. ఓవర్ కాన్ఫిడెన్సు కాళ్లు పట్టుకుని కిందికి లాగుతున్నది. అతని దారి మొదటి నుంచి ముళ్లదారే. కానీ కాలం కలిసివచ్చి.. చంద్రబాబు తదితరుల సపోర్టుతో పీసీసీ చీఫ్‌గా అవకాశం వచ్చింది. ఇక తిరుగులేదనుకున్నాడు. తన భాష వాడిని పెంచాడు. తిట్లు రెట్టించాడు. తిరుగులేదనుకున్నాడు. అంతా పొడుగుతున్నారు కదా.. బలుపే అనుకున్నాడు. కానీ చాలా సందర్భాల్లో అది వాపుగా తేలిపోతుంది. ఓటుకు నోటు కేసులో దొరికి పోయిన వీడియో .. అతని రాజకీయ జీవితంలో ఇదెప్పుడూ మాయని మచ్చలా మిగిలిపోనున్నది. సందర్భం వచ్చిన ప్రతీసారి .. రేవంత్‌ను కట్టడి చేసేందుకు , ఆత్మ సంరక్షణలో పడేసేందుకు అధికార పార్టీ దీన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నది.
ఇప్పుడు ఆ వీడియోతో పాటు కొత్తగా ఇంకో వీడియో కూడా తోడైంది. కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై రేవంత్ ఆఫ్‌ది రికార్డులో విలేకరుల వద్ద నోరు జారాడు. మన విలేకరులే కదా.. ఎక్కడ చెప్పరు లే అనుకున్నాడు. ఇంకేముంది..? అదే ఓవర్ కాన్ఫిడెన్సు, అదే నోటి దరుసు… గాడిద అని తిట్టాడు. అలా తిట్టేంతగా కోపం రావడంలోనూ కారణం ఉంది లెండి. మన పెద్దలు జానారెడ్డి .. ఐదు రూపాయల భోజనం తిని ఎంతో బాగుంది.. భేష్.. కేసీఆర్ గుడ్.. అని కితాబిచ్చినట్టు… శశిథరూర్ ఇక్కడికి వచ్చి ఐటీ రంగంపై సర్కార్‌కు కితాబివ్వడంతో రేవంత్‌కు కాలింది. ఇక్కడ సందర్భం వచ్చిన ప్రతీ సారి సర్కార్‌ను అమ్మనాబూతులు తిడుతూ.. పార్టీకి జీవం పోస్తుంటే.. ఇలా వచ్చి మా నోట్లో దుమ్ముకొడతాడా? అనే రేంజ్‌లో విరుచుకుపడ్డాట. దీంతో ఈ ఆఫ్‌ది రికార్డు కాస్తా..
కేటీఆర్‌కు చేరడం.. కోతికి కొబ్బరిచిప్ప దొరికట్టై.. ఆయన దాన్ని తన ట్విట్టర్ పిట్ట గూట్లో పెట్టే షరా మాములుగా. ఇంకేముంది.. ? అంతా రచ్చ రచ్చయ్యింది. రేవంత్ ఏదో బుకాయించబోయాడు. దొరికిపోయాడు. క్షమాపణ చెప్పాడు. అంతా సద్దుమణిగిందనుకున్నాడు. కానీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లాంటోళ్లు.. రేవంత్ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూస్తున్నారు కదా. అందుకే ఆయన స్పందించాడు. రేవంత్‌ను ఇరుకున పెట్టేలా మాట్లాడాడు. పీసీస చీఫ్ చేతికొచ్చింది కదా అని తనను మించినవాడులేడనుకుంటే.. తన స్వయంకృతాపరాధమే అప్పడప్పుడు నిండా ముంచుతుంది చూసుకో రేవంత్..!