కుండకు చిల్లు పెట్టినట్లుగా రాత్రంతా ఒకటే వర్షం. నగరం ఎప్పుడో మగత నిద్రలోకి జారుకున్నది. అందరూ ఆదమరిచి నిద్దరోతున్న వేళ.. కుండపోత వాన మొదలైంది. అర్థరాత్రికో మొదలైన వాన.. ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కప్పల బెకబెక శబ్దాలు దూరంగా వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో కుక్కల అరుపులు జోరువాన సూరులో కలిసిపోతున్నాయి. ఒళ్లు జలధరించేలా అప్పుడప్పుడు ఉరుముల శబ్ధం ఉలిక్కిపడేలా చేస్తున్నది. అప్పుడెంత సమయమవుతుందో తెలియదు

ఎంత ప్రయత్నించినా రాజారెడ్డికి నిద్ర దేవత కనుకరించడం లేదు. అటూ ఇటూ బెడ్ పై అతను దొర్లుతున్నాడు. కళ్లు మూసుకునే ఉన్నా మస్తిష్కం మాత్రం పరిపరి విధాల ఆలోచిస్తూనే ఉంది.

ఆలోచనల సుడిగుండం అతన్ని నిద్రపోనీయడం లేదు. దీనికి తోడు బయట జోరువాన.. సూరు శబ్దం. గదిలో చిక్కటి చీకటి పరుచుకుని ఉంది.

అతని భార్య, ఇద్దరు కూతళ్లు, ఒక కొడుకు నిద్రపోతున్నారు. నిండా దుప్పటి కప్పుకొని కళ్లు మూసుకొని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా అతన్ని ఆలోచనలు వెంటాడుతున్నాయి.

భవిష్యత్తు గదిలో పరుచుకున్న కారుచీకటికన్నా భయంకరంగా కనిపిస్తున్నది అతనికి. తన జీవిత గమనం ఎటు వెళ్తుందో కూడా అతనికి గోచరించడం లేదు.

రాజారాడ్డి ప్రధాన పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. దాదాపు పదిహేనేళ్లుగా అతను వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేస్తూ వస్తున్నాడు. అతని భార్య వనజ ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్నది. దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతర్లు, ఒక కొడకు.

డిగ్రీ, ఇంటర్, పదో తరగతి చదవుతున్నారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన చిన్న ఇళ్లు. అదే అతని ఆస్తి. ఊహ తెలిసిన నాటి నుంచి ఏదో సమాజ సేవ పేరుతో .. స్వచ్చంధ సంస్థ నిర్వహణ చేస్తుండేవాడు. అందులోని సంతోషాన్ని వెతుక్కునేవాడు.

కానీ దమ్మిడి ఆదాయం ఉండేది కాదు. పెళైన తర్వాత కొన్నేండ్లకు జర్నలిస్టుగా అవతారమెత్తాడు. పెద్దగా ఆదాయం లేకపోవడంతో కొత్త ఆస్తులేమి కూడబెట్టుకోలేదు.

కానీ వృత్తిలో వచ్చే గౌరవ మర్యాదలు రాజారెడ్డికి ఎంతో నచ్చాయి. కష్టమొచ్చినా , నష్టమొచ్చినా రంగాన్ని వదలలేదు. భార్య ఎన్నో సార్లు ఈసడించుకున్నా దాన్నే అంటిపెట్టుకొని ఉన్నాడు. రాసిన వార్తలకు

మేనేజ్ మెంట్ ఇచ్చేలైన్ అకౌంట్మొత్తం మూలకు సరిపోయేది కాదు. నెలకు ఎంత రాస్తే అంత. రాసిన వార్తలను లైన్ల చొప్పున లెక్కేసి లైన్ కింత అని ఇస్తారు. ఎంత రాసినా నాలుగైదు వేలకు మించదు. వీటితో పెట్రోల్ ఖర్చులు, కనీస అవసరాలు కూడా తీరేయి కావు. మధ్యకాలంలో టైమ్ కు లైన్ అకౌంట్డబ్బులు కూడా మేనేజ్ మెంట్ ఇవ్వడం లేదు. ఇది సరిపోదంటూ కరోనా అతన్ని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు చేసింది. ప్రెస్ మీట్ కు వెళ్లినా, ఏదైనా షోరూంలు, షాపుల ప్రారంభోత్సవాలకు కవరేజీకి వెళ్లినా రెండొందలు, ఐదొందలు వచ్చేవి. ఇపుడవీ లేవు. ఎవరూ ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. అసలు బయటకు వచ్చేందుకే జంకుతున్నారు. కరోనా కాలం తీవ్ర కరువు కాలాన్ని చవిచూపుతున్నది రాజారెడ్డికి. ఒక్కడు ప్రెస్ మీట్ పెడితే పోలోమంటూ ఇరవై ముప్పై

మంది రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫోటో గ్రాఫర్లువచ్చి వాడి వంక దీనంగా చూస్తారు. తలో ఇంత అని అందరికీ ఇచ్చే దాక అక్కడ్నుంచి కదలరు. దీంతో ప్రెస్ మీట్ పెట్టాలంటేనే జంకే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు కరోనా. ఎవడూ బయటకు రావడం లేదు.

బతుకుదెరువు కోసం వీరంతా బయటకు వచ్చి పడిగాపులు కాసినా.. అటు వైపు చూసే దిక్కు లేకుండా పోయింది. ఇది సరిపోదంటూ రాజిరెడ్డికి మరో కొత్త ఉపద్రవం ముంచుకొచ్చింది.

తన జీవితాన్నే టార్గెట్ చేసే విధంగా మేనేజ్ మెంట్ అతనికి కొత్త టార్గెట్ విధించింది.

కరోనా కాలంలో బతుకే కష్టమైపోయిందని కుంగిపోతున్న అతనికి ఇసుకలోంచి నూనె తీసేలాంటి టార్గెట్లు పెట్టారు. పత్రికకు సంవత్సరం చందాలు కట్టించాలని, ప్రకటనలు (అడ్వర్టైజ్ మెంట్లు) తీసుసుకురావాలని కచ్చితమైన నిబంధనలు విధించింది. అందులో వచ్చే కమిషన్లో ఇక మీకిచ్చే వేతనం అని తెగేసి చెప్పింది. కరోనా కష్టకాలంలో పత్రిక నడవడం కష్టమని చెప్తూనే ఇచ్చిన టార్గెట్లు చేయకపోతే ఇక ఉద్యోగం మానుకోని ఇంట్లో కూర్చోండని, ఇంకొకడని చూసుకుంటామని బెదిరింపులకు దిగింది. గతంలో కూడా టార్గెట్లు ఉండేవి. కానీ ఇప్పడీ టార్గెట్లు తమ అంతు చూసేవిగా ఉన్నాయని రాజారెడ్డికి అర్థమయ్యింది.

(సశేషం)

You missed