సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న బీసీ నేత బాజిరెడ్డి గోవర్దన్‌కు ఊరించి.. ఊరించి ఎట్టకేలకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. రెండు సంవత్సరాల కాల పరిమితి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి టీఆరెస్ టికెట్ పై రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అంతకు ముందు కాంగ్రెస్‌లో ఓటమెరగని నేతగా పేరు గడించాడు. ఆర్మూర్, బాన్సవాడ నియోజవకర్గాల్లో.. ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటుకున్నాడు. డీఎస్‌కు బద్ద శత్రువు. డీఎస్‌ను బహిరంగ వేదికల్లో విమర్శించినవాడు. మాస్ లీడర్‌గా తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో రూరల్ నుంచి భూపతిరెడ్డిని కాదని, బాజిరెడ్డికి టికెట్ ఇప్పించారు కవిత. రెండు సార్లు ఆయన ఇక్కడ నుంచి గెలిచాడు. ప్రతిసారీ తన అనుభవాన్ని, బీసీ నేతగా తనకు గుర్తింపు ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఆశించాడు.
పలు మార్లు అధిష్టానం వద్ద విన్నవించుకున్నాడు. కానీ కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. కేటీఆర్ మాటిచ్చాడే కానీ, ఏమీ చేయలేకపోయాడు. కవిత కూడా తన పరధిలో లేని అంశంగానే చూసింది.దీంతో ఓ దశలో బాజిరెడ్డి తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు. ఇటీవల తన సతీమణి చనిపోతే కేసీఆర్ రాలేదు. కేటీఆర్ రాలేదు. దీంతో ఆయన ఇంకా మనస్తాపం చెందాడు. ఓ దశలో కాంగ్రెస్‌లోకి వెళ్తాడనే ప్రచారమూ చేశారు. ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తాడనే ప్రచారం చేశారు. ఇవన్నింటికీ చెక్ పెట్టేలా కేసీఆర్ మొన్న బాజిరెడ్డిని పిలిపించుకుని మాట్లాడాడు. సముదాయించాడు.ముందుగా అనుకున్నట్టుగా ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇచ్చి .. అసంతృప్తిని దూరం చేశారు.