నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ కి అన్ని రెడీ చేసుకుంటున్నాడు. కదనరంగం ఎంచుకున్నాడు. దానికి అనుకూలంగా ఇప్పట్నుంచే పరిస్థితులను మలుచుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఆర్మూర్‌లోని పెర్కిట్ వద్ద ఓ నివాస సముదాయాన్ని కిరాయికి తీసుకున్నాడు. అందులో పార్టీ ఆఫీసును ప్రారంభించాడు. ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ లీడర్లు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వస్తున్నాడు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అక్కడ వ్యతిరేకత పెరిగిందనే సంకేతాలు బీజేపీకి ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అర్వింద్ ప్రత్యేకంగా సర్వే చేయించుకున్నాడు. అన్నింటికన్నా.. ఆర్మూర్ నుంచి బరిలో నిలబడితే గెలుపు సునాయసంగా ఉంటుందనే భావనలో ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే కార్యక్షేత్రాన్ని ఎన్నుకున్నాడు. భవిష్యత్ కార్యాచరణలో నిమగ్నమయ్యాడు.
పసుపుబోర్డు తెస్తానని బాండుపేపర్ రాసిచ్చి ఆ తర్వాత ముఖం చాటేశాడు అర్వింద్. స్పైస్ బోర్డు అని ఏదేదో చెప్తున్నా.. పసుపు రైతుల్లో మాత్రం అర్వింద్ అంటే పీకల్లోతు కోపం ఉంది. మాట తప్పి మోసం చేశాడనే భావనలో వాళ్లున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలని అర్వింద్ నిర్ణయించుకున్నాడు. ఆర్మూర్‌ను ఎంచుకున్నాడు. ఆర్మూర్ లో పోటీ చేస్తే రెండు మూడు అంశాలు తనకు బాగా కలిసి వస్తాయని అర్వింద్ అంచనాలు వేసుకున్నాడు. ఇక్కడ పసపు పండించే రైతులు లేరు. చిన్న నియోజకవర్గం. ఆర్మూర్ టౌన్‌లో అంతా వ్యాపారులే. పసుపుకు .. వీరికి ఏమాత్రం సంబంధం లేదు. పసుపు బోర్డు వ్యతిరేకత ఓటు తనకు ఇక్కడ దెబ్బకొట్టదు. దీంతో పాటు మున్నూరుకాపు ఓట్లు చాలా ఉన్నాయి. ఇవి తనకు లాభిస్తాయని భావిస్తున్నాడు.