సైదాబాద్‌లో ఆరెళ్ల చిన్నారి పై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతుంది. రాష్ట్రంలో ఇది రాజకీయ రంగు పులుముకుంటున్నది. మొదట దీన్ని మీడియా పెద్దగా చూపలేదనే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో టీవీ ఛానళ్లు అటు వైపు దృష్టి పెట్టాయి. అందరి మద్దతు బాధితులకు వెల్లువలా లభించడం మొదలు పెట్టింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ అండగా ఉంటామని భరోసా నింపుతున్నారు.
మరోవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు దీన్ని అస్త్రాంగా వినియోగించుకుంటున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షర్మిల, రేవంత్ రెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ సంఘటనను ఆధారం చేసుకుని విమర్శల దాడులకు దిగారు. కేటీఆర్ వెంటనే ఎందుకు స్పందించలేదని ఒకరు.. తను దత్తత తీసుకున్న బస్తీలోనే ఈ పరిస్థితి అయితే రాష్ట్రంలో మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని మరొకరు.. ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలకు దిగుతున్నారు.
షర్మిల ఏకంగా పది కోట్లు పరిహారం ఇవ్వాలని, నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తప్పకుండా నేరస్థుడిని పట్టుకుని ఎన్ కౌంటర్ చేస్తామని చెప్పడం కలకలం రేపింది. పోలీసుల అదుపు లోనే నిందితుడు రాజు ఉన్నాడని అర్ధం వచ్చేలా మంత్రి మాట్లాడాడు. దీంతో నెటిజన్లు నిన్న రాత్రి నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తారనే ఉహాగానాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కానీ ఇప్పటికి నిందితుడి ఆచూకీ లేదు. ఎంత ఆతస్యమేతే అంతా ఇది రాజకీయ రంగు పులుముకుంటూ వస్తున్నది. దిశ సంఘటనలో సత్వరం స్పందించి నిందితులను ఎన్ కౌంటర్ చేయించిన ప్రభుత్వం.. చైత్ర విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందనేది అంతుచిక్కకుండా ఉంది.
అయితే కేటీఆర్ ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నాడు. దీనికి త్వరలోనే పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వం ఉంది. కానీ పోలీస్ వ్యవస్థ విఫలమవుతున్నది. గతంలో సజ్జనార్ స్పందించినట్లుగా వెనువెంటనే స్పందన ప్రస్తుతం కరువైంది. దీంతో ఇది ప్రభుత్వానికి తలవంపులను తెచ్చి పెట్టే విధంగా తయారవుతూ వస్తున్నది. చినికి చినికి గాలి వానలా మారుతున్నది.