రాజకీయాల్లో రాజీనామాల ఛాలెంజ్ కామన్‌గా మారింది. ఒకప్పుడు ఇది ప్రతిపక్షాలకు ఓ ప్రధాన అస్త్రం. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు తొడలు చరిచి మరీ రాజీనామాల ఛాలెంజ్‌లను విసిరేవారు. దానికంత వెయిట్ ఉండేది. కానీ రాను రాను ఈ రాజీనామాల ఛాలెంజ్‌లు వెయిట్ లేక వెలవెలబోతున్నాయి. మంత్రి కేటీఆర్ తాజాగా విసిరిన ఓ రాజీనామా ఛాలెంజ్ రాజకీయ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నది. దీనికి ప్రతిస్పందించాల్సిన బీజేపీ తలతిక్కగా సమాధానం చెప్పి వ్యక్తిగత దూషణలకు దిగి టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. వాస్తవంగా కేటీఆర్ విసిరిన ఈ ఛాలెంజ్ పాత చింతకాయ పచ్చడి.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న పన్నుల మొత్తంలో సగం కూడా తిరిగి రాష్ట్రానికి చెల్లించడం లేదని, ఒకవేళ ఇది అవాస్తవమైతే తాను రాజీనామాకు సిద్ధమని, లేదంటే బండి సంజయ్ రాజీనామా చేయాలని సవాల్ విసిరాడు. దీనిపై బండి సంజయ్ సూటిగా సమాధానం చెప్పలేదు. తనకు అలవాటైన ధోరణిలో మాట్లాడుతూ డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉదంతాన్ని తీసుకుని కేటీఆర్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు.

అర్వింద్ కూడా ఈ రోజు దీనిపై స్పందించాడు. పరస్పరం పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఎనభై శాతం తెలంగాణకు హైదరాబాద్‌కు పన్నుల రూపంలో ఆదాయం వస్తుండగా.. ఆ మొత్తాన్ని ఒక్క హైదరాబాద్‌కే వినియోగిస్తున్నారా? అని ప్రశ్నించాడు. కేంద్రం వివిధ అవసరాలకు ఆ మొత్తాన్ని వాడుకుంటుందని చెబుతూనే.. తెలంగాణకు తీసుకున్న పన్నుల కన్నా ఎక్కువగా కేంద్రం చెల్లిస్తున్నదంటూ మళ్లీ మాట మార్చాడు. ఇక వ్యక్తిగత దూషణలకు దిగాడు. ‘ నీ అయ్యా’ అని కేసీఆర్‌ను ఉద్ధేశించి మాట్లాడుతూ ఏవేవో సబ్జెక్టు కానీ అంశాలను సందర్భం లేని విషయాలను ముందేసుకున్నాడు. అసలు విషయం పక్క దారి పట్టింది. తిట్లదండకం అందుకున్నాడు.

షరామామూలుగా తిట్లపురాణం వల్లెవేశాడు. అనవసరమైన రాజీనామాల ఛాలెంజ్‌లు ఒకరినొకరు తిట్టుకోవడానికి పనిచేస్తుందే తప్ప అసలు విషయం మాత్రం చర్చకు రావడం లేదు. కేటీఆర్ పదేపదే ఈ పసలేని రాజీనామా ఛాలెంజ్‌ల అస్త్రాలను ఇక వాడకపోవడమే బెటర్ అనిపిస్తోంది.

You missed