జిల్లా అధ్యక్షుల నియమాకానికి పచ్చజెండా ఊపిన పార్టీ అధిష్ఠానం .. ఈ నెల 20న జిల్లా కమిటీల కూర్పు పూర్తి చేయనున్నది. నిజామాబాద్ జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరవుతారనే దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్ర రాజకీయాల్లో ఇందూరుకు ప్రత్యేక స్థానం. సీఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడంతో సహజంగానే అందరి దృష్టి ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. రెండు సార్లు నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అలాంటి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ బాస్ ఎవరనే విషయంలో కీలకంగా చర్చ జరుగుతోంది. కొత్తగా పార్టీ భవనాన్ని కూడా నిర్మించి రెడీగా ఉంచారు. నూతన కలెక్టరేట్‌తో పాటు సీఎం చేతుల మీదుగా ఈ పార్టీ భవనాన్ని ప్రారంభించనున్నారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత నిర్ణయాలు జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై కీలకంగా ఆధారపడి ఉంటాయి. అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. జిల్లా పరిధిలోని కారు స్టీరింగ్ ఎవరికి ఇవ్వాలనేది తేలితే ఓకే.. లేదంటే బంతిని కేటీఆర్ ముందుంచుతారు. కానీ జిల్లా లెవల్‌లోనే పార్టీ అధ్యక్ష పీఠం నియమాక నిర్ణయం జరిగిపోయే అవకాశం ఉంది. దీని కోసం మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ఈగ గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి తనయుడు జగన్‌ల పేర్లు ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి బీసీకి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన జగన్‌కు అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. కానీ బాజిరెడ్డికి జగన్‌ను ఎమ్మెల్యేను చేయాలని కోరిక.

గత ఎన్నికల్లోనే కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ కోసం బాజిరెడ్డి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాడు. కానీ కేసీఆర్ ఒప్పుకోలేదు. రానున్నది అంతా కేటీఆర్ శకం. యువతరానికి అవకాశాలు కల్పించేందుకు, తన టీమ్‌ను సపరేటుగా ఏర్పాటు చేసుకునేందుకు కేటీఆర్ ఇప్పటి నుంచే వ్యూహరచనలో ఉన్నాడు. దీంతో బాజిరెడ్డి కేటీఆర్ పై ఆశలు పెట్టుకున్నాడు. అధ్యక్ష పీఠం కంటే కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ వైపే బాజిరెడ్డి మెగ్గు చూపుతున్నాడు. ఈ క్రమంలో అరికెల, ఈగ గంగారెడ్డిలలో ఎవరికివ్వాలనే దాని పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

జిల్లా అధ్యక్షుడిగా టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగాలంటే అంతా ఆశామాషీ ఏంకాదు. కీలక నేతలు ఇక్కడ ఉండడంతో చీమ చిట్టుక్కుమన్నా పైకి తెలిసి పోతుంది. దీనికి తోడు అందరు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరి నియోజకవర్గంలో అనుమతి లేకుండా కాలు, వేలు పెట్టరాదు. పెడితే అంతే సంగతులు. పార్టీ ఆఫీసుకు పరిమితమై, సమన్వయ కర్తగా మెలగాల్సి ఉంటుంది.

మరోవైపు జిల్లాలో బీజేపీ పుంజుకుంటున్నది. ఘాటు విమర్శలనే అస్త్రాలుగా మలుచుకుని బీజేపీ టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. దీన్ని అంతే ధీటుగా ఎదుర్కొనే సత్తా అధ్యక్షుడికి ఉండాలి. సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇవన్నీ క్వాలిటీస్ ఎవరిలో కనిపిస్తాయో.. చివరికి ఎవరిని ఎంపిక చేస్తారో ? ఈ నెల 20న తేలనుంది.

ఎమ్మెల్యేలే కీలకంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా అధ్యక్ష పీఠం దక్కినా.. అది డమ్మీ పదవి గానే భావిస్తున్నారు నేతలు. దీంతో ఇప్పటి వరకు పరిశీలనలో ఉన్న నేతలు ఈ పదవి పై పెదవి విరుస్తున్నారే తప్ప పెద్దగా ఉత్సాహం చూపించడంలేదు. దీనికి బదులు ఎమ్మెల్సీ ఇస్తేనే మేలు అనే భావనలో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు.

You missed