దళితబంధు ఓ మహా ఉద్యమం. దీన్ని దేశమే ఆదర్శంగా తీసుకుంటుంది… అన్నాడు కేసీఆర్. ఆర్భాటంగా హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టాడు. కానీ దాన్ని దళితులే నమ్మడం లేదు. ఆ పథకమంతా లోపభూయిష్టంగా ఉంది. తమ అవసరాలకు అనుగుణంగా దాన్ని మార్చేస్తూ చిత్రవధ చేసేస్తున్నారు. హుజురాబాద్లో ఈ పథకం అందరికీ అందుతుందేమో గానీ.. అన్ని జిల్లాల్లో డౌటే. తాజాగా కేసీఆర్ చేసిన ఓ కామెంట్ దళితబంధుపై మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నది.
ఈ రోజు జరిగిన రాష్ట్ర పార్టీ కమిటీ మీటింగులో కేసీఆర్… మరో 20 ఏండ్లు మనమే అధికారంలో ఉంటాం.. ఒక్క దళితబంధే కాదు.. బీసీ బంధు, అన్ని కులాల బంధులను కూడా ప్రవేశపెడతాం అని ప్రకటించాడు. కానీ ఇక్కడే కండిషన్స్ అప్లై అనే విధంగా కేసీఆర్ మాట్లాడిన తీరును ఎవ్వరూ పసిగట్టలేదు. కనిపెట్టలేదు. మరో 20 ఏండ్లు మేమే అనే నినాదం.. మీ ఆత్మవిశ్వాసానికి అది ప్రతీకేమో గానీ.. మరో 20 ఏండ్లు మిమ్మల్ని భరించే స్థాయిలో ఉన్నారా ప్రజలు. అసలు ప్రజల మనోభావాలు, వారి అభీష్టాలు తెలియకుండానే , గుర్తించకుండానే.. మరో 20ఏండ్లు మేమే అనే నీ నినాదమే.. అహంకారపూరితం. దొరతనం. అప్రజాస్వామికం.
ఇప్పుడున్న అధికారం ఎన్ని రోజులు.. అప్పట్లోనే దళితబంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా? ముందు అది చెప్పాలి. ఆ తర్వాత వచ్చే జనరల్ ఎన్నికల్లో మళ్లీ టీఆరెస్కు ప్రజలు పట్టం గడితే .. అప్పుడు బీసీ బంధు.. ఇంకో బంధు గురించిమాట్లాడి.. దానికీ ఓ టైం పెట్టుకుని ముందుకు పోవాలె. కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు.. మాదే పాలన, మాదే అధికారం అన్నట్టు, గంప గుత్తా మేమేతీసుకున్నాం.. మేమే పాలిస్తామన్నట్టు మాట్లాడే తీరు ప్రజలకు జుగుప్స కలిగిస్తుంది. ఓ హామీని నిలబెట్టుకునేందుకు.. మరో హామీ. ఆ హామీని నిలబెట్టుకునేందుకు మరింత కాలం అధికారం.. ఆ అధికారం ఇస్తేనే ఈ హామీలు నెరవేరేది? అన్నట్టుగా సీఎం మట్లాడే తీరు పక్కా బ్లాక్మెయిల్ రాజకీయాలే అనుకోవచ్చు.