కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి…. అన్నట్టుగా ఉంటుదాయన వ్యవహారం. మొన్నటి వరకు టీఆరెస్ జిల్లా కమిటీలే లేకుండా చేశాడు. ఇప్పుడు జిల్లా కమిటీలు వేసుకోండన్నాడు. జిల్లా అధ్యక్షుడు కావలెను.. అని అర్జెంటుగా అవసరం పడ్డట్టుగా ప్రకటించేశాడు. అవునూ .. అప్పడొద్దన్న అధ్యక్షుడు ఇప్పుడెందుకు?
జిల్లా పార్టీ అధ్యక్షుడు లేక పార్టీకి దిక్కు లేకుండా పోయింది. వాస్తవంగా ఈ అధ్యక్ష పదవిని కేసీఆర్ వద్దన్నది ఎమ్మెల్యేల మాటలు విని. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు. కష్టపడి మేం గెలిస్తే.. మా పై అప్పనంగా ఈ జిల్లా ప్రెసిడెంట్లు పెత్తనం చేస్తున్నారు… తీసేయండి సార్ వీళ్లను అని అడిగారు. ఎమ్మెల్యేలే సుప్రీం.. వాళ్లు చెప్పిందే వేదం.. అనే నినాదానికి సీఎం కట్టుబడి ఉంటాడు కదా. మొన్నటి మధ్యంతర ఎన్నికల్లోనూ వాళ్లకు భయపడి రెండోసారి కూడా టికెట్ ఇచ్చేసి అలా లాక్కొచ్చి.. ఇలా గట్టెక్కించి మళ్లీ ఎమ్మెల్యేలను చేస్తే .. ఇప్పుడు పరిస్థితేందో తెలుసు కదా. కొంచెం కేసీఆర్‌కు తత్వం లేట్‌గా బోధపడినట్టుంది. ఎందుకంటే నమ్మి నానబోస్తే పుచ్చులైనట్టు… ఎమ్మెల్యేలను కేసీఆర్ నమ్ముకుంటే పార్టీని నట్టేట ముంచేలా వ్యవహరించారు. దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీ అనాథే అయ్యింది. కార్యకర్తలను పట్టించుకునేవారు లేరు. ఎమ్మల్యేల దగ్గరకు పోతే.. ఛీత్కారాలు, అవమానాలు. ఈ పరిస్థితుల్లో మళ్లీ జిల్లాలకు అధ్యక్షులు అవసరమనే విషయం కేసీఆర్‌కు అర్జెంటుగా గుర్తొచ్చింది. అందుకే జిల్లా కమిటీలు వేసుకోమన్నాడు.