నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఆరెప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక నైట్ సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసుకుంటున్న ఉదంతం మీడియాలో రావ‌డంతో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. జిల్లా పంచాయ‌తీ అధికారి పేరు మీద మీడియాకు ఓ ప్రెస్‌నోట్ విడుద‌ల చేసింది. అందులో స‌ర్పంచ్ వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌నే బాగా హైలెట్ చేసి అత‌నికి ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయ‌ని చెబుతునే, ఇటీవల అత‌ని సోద‌రి చ‌నిపోవ‌డంతో మ‌న‌స్తాపానికి గుర‌య్యాడ‌ని కూడా పేర్కొన్నారు.

నిధుల లేమి లేద‌ని, ఇంకా జీపీ అకౌంట్‌లో డ‌బ్బులు ఉన్నాయ‌నే విష‌యాన్ని వెల్ల‌డించ‌డంతో స‌ర్పంచ్ ఎసురు మ‌ల్లేష్ అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యాడు. వెంట‌నే డీపీవోను క‌లిశాడు. నిధులెక్క‌డున్నాయో చెప్ప‌మ‌ని నిల‌దీశాడు. త‌న డ‌బ్బులు రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన వివ‌రాల‌ను ముందు ఉంచాడు. ప్ర‌భుత్వం ఇజ్జ‌త్ పోతుంద‌ని త‌న‌ను పిచ్చోడ‌నే ముద్రేసుందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు వెల్ల‌డించేందుకు మీకెవ‌రు అధికారం ఇచ్చార‌ని నిల‌దీశాడు. స‌ర్పంచ్ ప్ర‌శ్న‌ల వ‌ర్షానికి డీపీవో నీళ్లు న‌మ‌లాల్సి వ‌చ్చింది.

ఆరు నెల‌లుగా త‌న‌కు రావాల్సిన గౌర‌వ వేత‌నం కూడా రావ‌డం లేద‌ని స‌ర్పంచ్ మ‌ల్లేష్ ఈ సంద‌ర్భంగా ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌ను సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసుకోవ‌డం ఎవ‌రిని త‌క్కువ చేసి చూపేందుకు కాద‌ని, త‌న ఆర్థిక అవ‌స‌రాల రీత్యానే ప‌ని చేసుకుంటున్నాన‌ని అన్నాడు. త‌ను ప‌ని చేసుకోవ‌డ‌మే ప్ర‌భుత్వానికి న‌మోషీగా అనిపిస్తున్న‌ద‌ని, అందుకే త‌న మాన‌సిక స్థితి బాగాలేద‌నే విధంగా ప్రెస్‌నోట్ విడుద‌ల చేయ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న జిల్లా క‌లెక్ట‌ర్ మీద మండిప‌డ్డాడు.

You missed