కేసీఆర్‌.. ఢ‌క్కాముక్కీలు తిని.. తినీ ఇక్క‌డిదాకా వ‌చ్చాడు. ఎన్నో ఒడిదుడుకులు.. ఎన్నో అవ‌మానాలు, ఛీత్కారాలు…. రాజ‌కీయ ఎత్తుప‌ల్లాలు, ఎత్తుగ‌డ‌లు. ఓట‌ములు, హేళ‌న‌లు. అవ‌మానాలు, ఆప్యాయ‌త‌లు.. ఇవ‌న్నీ ఏ రాజ‌కీయ నాయ‌కుడి జీవితంలోనూ సంభ‌వించి ఉండ‌వు. కేసీఆర్ క్షేత్ర‌స్థాయి నుంచి వ‌చ్చాడు. జ‌నం నాడి తెలిసిన‌వాడు. రాజ‌కీయాల్లో ఎద‌గాల‌నుకున్న వాడు. ఎదిగేక్ర‌మంలోదాన్ని కాపాడుకోవ‌డం కూడా తెలిసివాడు. కాపాడుకున్న‌దాని ప‌దికాలాల పాటు భ‌ద్ర‌ప‌ర్చుకునేందుకు కావాల్సిన ప‌న్నాగాలూ తెలిసివాడు. అది తెలంగాణ అభివృద్ది కోస‌మే అన‌వచ్చు. దాని వెనుక రాజ్యాధికారం ప్ర‌ముఖ పాత్ర పోషించ‌వ‌చ్చు. అధికారం ఎక్కువ కాలం ఉండాల‌నే అత్యాశ కావ‌చ్చు. న‌న్ను మించిన రాజ‌కీయ దురంద‌రుడు ఇక లేడ‌నే మితిమీరిన ఆత్మ‌విశ్వాసం కావొచ్చు.. ఏదైన అవ‌నివ్వండి. కేసీఆర్ అంతే.

హుజురాబాద్ ఉప ఎన్నిక ముఖ చిత్రం ఆయ‌న్ను మ‌రింత రాటుదేల్చింది. ఎంత‌లా అంటే.. త‌న స‌ర్వ‌శ‌క్తులూ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంపైనే కేంద్రీక‌రించేంత‌గా. ఎట్టి ప‌రిస్థితిల్లో గెలిచి తీరాల‌న్నా ప్ర‌గాఢ‌మైన కాంక్ష‌ను బ‌ల‌ప‌ర్చేందుకు కావాల్సిన శ‌క్త‌ల‌ను స‌మ‌కూర్చుకునేందుకు త‌ను పాతాళానికి దిగ‌జారేంత‌లా. డోంట్ కేర..! మ‌స్తు అంట‌రు బై. శాత‌కానోళ్లు. అవ‌న్నీ ప‌ట్టించుకోను. గెలుచి తీరాలి గంతే. ఇదీ కేసీఆర్ మంత్రం. తంత్రం. హుజురాబాద్‌లో దీన్నే ప్ర‌యోగిస్తున్నాడు. అభ్య‌ర్థిగా బీసీయైన గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ పేరును ఖ‌రారు చేశాడు. బీసీకి బీసీ పోటీ… స‌మీక‌ర‌ణ బాగుంది. ఈట‌ల‌కు చెక్ పెట్టాలంటే బీసీ మంత్రం ఈట‌ల‌కు ఒక్క‌డికే ఉప‌యోగ‌ప‌డొద్దు. దాన్ని దెబ్బ‌కొట్టాలి. చీల్చాలి. చెండాడాలి. ఇదెంత వ‌ర‌కు స‌క్సెసవుతుందో.. స‌రే ఇది ఓకే. మ‌రి ఎస్సీలు. ఎస్సీల‌కు ద‌ళిత‌బంధు ఉండ‌నే ఉంది క‌దా. గంప‌గుత్త‌గా టీఆర్ఎస్‌కే. డౌటా..? కేసీఆర్ అలాంటి క‌ల‌లే కంటున్నాడు మ‌రి. ఇంకా.. రెడ్లు.. ఓసీల ఓట్లు ఎలా? కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ. ఆ త‌ర్వాత మంత్రి అంట‌. ఏమో తెల్వ‌దు. కానీ ప్ర‌చార‌మైతే అప్పుడే జోరుగా సాగుతోంది.

ప్ర‌ధాన కులాల‌న్ని కుత్తుక‌లు కేసీఆర్ చేతిలో ఇప్పుడు ఇమిడి ఉన్నాయి. గెలిపించక చ‌స్తారా? గెల్లును గెలిపించ‌క‌పోతే నిజంగానే ఛ‌స్తారు. మీ ఇష్టం.

చిన్న‌చిత‌కా లీడ‌ర్ల నుంచి మొద‌లుకొని పెద్దిరెడ్డి, ఎల్ ర‌మ‌ణ‌.. ఇలా ఎవ‌రెవ‌రో జ‌నం మ‌రిచిపోయిన నేత‌లంద‌రికీ కేసీఆర్ హుజురాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పున‌రావాసం క‌ల్పించాడు. రాజ‌కీయ నిరుద్యోగుల‌కు ఉద్యోగ ఉపాధి క‌ల్ప‌న చేశాడు. కొత్త పింఛ‌న్లు వ‌చ్చాయి. కొత్త రేష‌న్ కార్డులకు అవ‌కాశం వ‌చ్చింది. మున్ముందు మ‌రిన్ని ఆగిపోయిన ప‌థ‌కాలు హుజురాబాద్ ప్ర‌జ‌ల ఒళ్లో ప‌డ‌తాయి. కొత్త ప‌థ‌కాలు వ‌చ్చి ద‌ర్వాజా త‌డుతాయి. డ‌బ్బులు విచ్చ‌ల‌విడిగా పంప‌కం జ‌రుగుంది. దేనికీ లోటుండ‌దు. ఇంత చేసినా గెల‌వ‌లేమా? ఎనీ డౌట్‌???

You missed