జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ ప‌ది వేల రూపాయ‌ల వ‌ర‌ద సాయాన్ని ఇస్తామ‌ని ఇవ్వ‌లేదెందుకు? అంటూ కాంగ్రెస్ నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాశాడు. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు.. అన్న చందంగా దాసోజు చాలా ఆల‌స్యంగా దీనిపై స్పందించాడు. ప్ర‌స్తుతం వ‌ర్షాలు కురుస్తున్న సంద‌ర్భంలో బ‌హుశా వ‌ర‌ద సాయం ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది. వాస్త‌వంగా దీనిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ముగియ‌గానే ప్ర‌భుత్వాన్ని నిల‌దీసి ఉండాల్సింది. దాదాపు 5ల‌క్ష‌ల మందికి ఈ వ‌ర‌ద సాయం అందాల్సి ఉంది. పోయిన ఏడాది అక్టోబ‌ర్‌లో అడ‌గాల్సిన ముచ్చ‌ట తాపీగా తొమ్మిది నెల‌ల తర్వాత దాసోజు బ‌హిరంగ లేఖ ద్వారా దీనిని గుర్తు చేశాడు. స్వ‌యంగా సీఎం కేసీఆర్ ఆ ఎన్నిక‌ల స‌భ‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న బాధితులంద‌రికీ వ‌ర‌ద సాయం ఇప్పించే బాధ్య‌త నాద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ ఎన్నిక‌ల ఫ‌లితాలు టీఆరెస్‌కు ప్ర‌తికూలంగా వ‌చ్చాయి. బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న‌ది. దీంతో వ‌ర‌ద సాయాన్ని ప్ర‌భుత్వం ఆట‌కెక్కించింది. ష‌రామ‌మూలుగా సీఎం ఆ హామీని కూడా తుంగలో తొక్కాడ‌ని సిటీ ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నారు. ప్ర‌తిప‌క్షాలు ఈ అంశాన్ని లేవ‌నెత్తి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే విష‌యంలో విఫ‌ల‌మ‌య్యాయి. ఇలా ఇన్ని రోజుల‌కు దీనిని గుర్తు చేసి ప్ర‌తిప‌క్షాల అస‌మ‌ర్ధ‌త‌ను, ప్ర‌భుత్వ ఉదాసీన వైఖ‌రిని తెలియ‌జెప్పిన‌ట్ల‌యింది.