మీడియా పట్ల మంత్రి కేటీఆర్ త‌న అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. మీడియా చాన‌ళ్ల‌కు సంచ‌నాలే కావాల‌ని, అభివృద్ధి ప‌ట్ట‌ద‌ని స్ప‌ష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం భహిరంగ సభలో మంత్రి మాట్లాడుతున్న స‌మ‌యంలో మీడియా ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. మంచి ప‌నులు చేస్తే మీడియాకు ప‌ట్ట‌ద‌ని, దాన్ని చూపించ‌ర‌ని, ఏదో ఒక ఆరోప‌ణ వ‌స్తే సంచ‌ల‌నం కోసం దాన్నే వంద‌సార్లు గిర్ర గిర్ర తిప్పుతార‌ని ఎద్దేవా చేశారు. ఎవ‌రో నాయ‌కుడు నాలుగు గుంట‌ల భూమి క‌బ్జా చేశాడ‌న‌గానే దాన్నే స్క్రోలింగుల‌తో రోజంతా గిర్ర గిర్ర తిప్పుతార‌ని, కానీ అందులో వాస్త‌వ‌మెంత‌..? అని మాత్రం చూడ‌ర‌ని విమ‌ర్శించాడు. మీడియా ప‌ట్ల త‌న‌కున్న వైఖ‌రిని ఇలా ఈ వేదిక‌గా మంత్రి మ‌రోసారి స్ప‌ష్టం చేయ‌డం అక్క‌డ చ‌ర్చ‌కు తెర తీసింది.