నిజామాబాద్:

పసుపు బోర్డు ఆశతో రైతులు ఓటేస్తే ఒకడు మోసం చేశాడని, వాడికి రైతుల ఉసురు, శాపం త‌గులుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌నుద్దేశించి ధ్వ‌జ‌మెత్తాడు. పసుపు సాగును ఇక్కడి రైతులు లక్ష్మిగా భావిస్తారని, అది సాగు చేయకుంటే ఒక వెలితిగా భావిస్తార‌న్నారు. పసుపు సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గేలా, పసుపు దిగుబడి పెరిగేలా శాస్త్రవేత్తలు సాయం అందించాలని మంత్రి సూచించారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మామిడిపల్లిలో శుక్రవారం నాడు “వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతు అవగాహన సదస్సులో మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, హన్మంతు షిండే, జాజాల సురేందర్,ఎమ్మెల్సి వి.జి గౌడ్, ఎం.పిలు సురేష్ రెడ్డి,బి.బి పాటిల్,నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు,మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి,మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఆకుల లలిత,డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి,కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్,జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఏ మొకం పెట్టుకుని వరంగల్ లో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నారని, తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేళ్లు కాంగ్రెస్ పాలననే ఉన్నదని మంత్రి గుర్తు చేశారు. అప్పుడు వ్యవసాయానికి ఏడు గంటల కరంటు మూడు విడతలు ఇచ్చేద‌ని, అప్పుడు వ్యవసాయానికి భరోసా లేక పలకరించే నాధుడు లేడని విమ‌ర్శించాడు. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పులు పెట్టి లైన్లో నిలబడేవార‌న్నారు. నేడు కాలుమీద కాలు వేసుకుని ఇష్టం వచ్చినప్పుడు నీళ్లను పారిస్తున్నాం.. నాడు కరంటు కోసం , సాగునీటి కోసం తండ్లాడినం..నేడు 24 గంటల కరంటు, కాళేశ్వరంతో సాగునీళ్లిచ్చి వ్యవసాయాన్ని నిలిపాం… అని అన్నారు.

తెలంగాణ వడ్లు కొనాలని కేంద్ర మంత్రిని కోరితే తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని అవమానించారని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ వడ్ల కొనుగోలుకు అంగీకరించారని మంత్రి అన్నారు. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే మార్కెట్ ఆదరణ ఉంటుంని, రైతులు పంటలు అమ్ముకోవడానికి ఎవరినీ యాచించాల్సిన అవసరం లేదన్నారు.