కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తాం

పీయూష్ గోయల్ అహంకారాన్ని తెలంగాణ సమాజం సహించదు

తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పించాలంటావా?

కేంద్రంపై విరుచుకుపడ్డ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్:

తెలంగాణ రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన ధాన్యాన్ని కేంద్రం మెడలు వంచి అయినా సరే కొనుగోలు చేయిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాది పండుగ తర్వాత కేంద్రంపై పోరుబాటకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. మంగళవారం కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన లు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండి వైఖరిని అవలంభిస్తోందని దుయ్యబట్టారు. పంట సాగు కోసం రైతులకు అవసరమైన సాగు నీరు, 24 గంటల విద్యుత్, రైతు బంధు రూపంలో పెట్టుబడి ఇత్యాది అన్ని వసతులను కేసీఆర్ ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో అన్నదాతలు సాగుచేసిన వరి పంటను కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉండగా, లేనిపోని కొర్రీలు పెడుతూ మొండి వైఖరిని అవలంభిస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తన గురుతర బాధ్యతను విస్మరిస్తూ కేవలం ఓ వ్యాపారి తరహాలో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సహచర మంత్రులతో కలిసి తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలువగా, తెలంగాణ ప్రజలను అవహేళన చేసే రీతిలో మాట్లాడారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆక్షేపించారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణలో రైతులు సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తాము కోరితే, అందుకు కేంద్రం నిరాకరిస్తూ తెలంగాణ సమాజం పట్ల వివక్ష పూరిత ధోరణి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. యాసంగిలో సాగుచేసిన ధాన్యాన్ని పట్టిస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, ఇదే విషయాన్ని పీయూష్ గోయల్ కు వివరించామన్నారు. దీనిపై సదరు కేంద్ర మంత్రి తెలంగాణ సమాజాన్ని అవహేళన చేసే విధంగా మాట్లాడారని, ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయించాలని చెప్పడం ఆయన అహంకారాన్ని చాటిందన్నారు.

తెలంగాణ ప్రజలతో పెట్టుకున్నవాళ్లు ఎవరు మనుగడ సాగించలేదని అన్నారు. తెలంగాణకు పైసా ఇవ్వనని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఆరు నూరైనా కేంద్రంతోనే ధాన్యం కొనుగోలు చేయించి తీరుతామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాడుతామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి తన వాగ్దానాన్ని నింపుకోవాలని సూచించారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయిస్తే బండి సంజయ్ కు తాము సహకరిస్తామన్నారు. అప్పటివరకు బీజేపీని, ఆ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితి ఎంత మాత్రం లేదని, వారి నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు చేసే అసంబద్ధ ఆరోపణలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరు అబద్ధాలు చెబుతున్నారు, ఎవరి హయాంలో అభివృద్ధి జరుగుతుందో గమనించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు.