డీఎస్. వ్యూహ రచనలోదిట్ట.పీసీసీ చీఫ్‌గా రెండు పర్యాయాలు పనిచేసి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టడంతో కీలకపాత్ర పోషించినవాడు. టికెట్ల పంపకాల వ్యవహారాన్నీ దాదాపు తనే చూసుకునేవాడు. ఎక్కడ పార్టీ ఎలా ఉంది? ఎవరికి టికెట్ ఇస్తే పార్టీ అభ్యర్థి గెలుస్తాడు..? అనే సమాలోచనలు చేయడంలో మేటి. ఆయనకున్న అపార రాజకీయ అనుభవం అందుకు తోడైంది. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డితో విభేదాలుండేవి. కానీ పార్టీని సమన్వయం చేసి నడపడంలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉండేవి. అక్కడి పెద్దలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేశాడు.
ఎప్పటికప్పుడు రాజకీయ వ్యహాలు రచించడంతో డీఎస్ ఆరితేరాడు. అది సోనియాకు బాగా తెలుసు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులు డీఎస్‌ను ఢిల్లీ పెద్దలకు దూరమయ్యేలా చేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చింది డీఎస్‌కు. అప్పటికే టీఆర్ఎస్ బలపడింది. ఇక కనుచూపు మేరలో కాంగ్రెస్ అధికారంలోకి రాదనే విషయాన్ని డీఎస్ గ్రహించాడు. పరిస్థితులను అన్నింటినీ బేరీజు వేసుకుని కేసీఆర్ పిలుపునకు స్పందించాడు. కవిత ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో బలమైన ప్రతిపక్షం లేకుండా చేయాలనేది కేసీఆర్ వ్యూహం. అందులో భాగంగా డీఎస్‌ను పార్టీలోకి ఆహ్వానించాడు. సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చాడు.
డీఎస్ కు ఇక చేసేదేమీ లేదని, కేసీఆర్‌తో జత కట్టాడు. కానీ పరిస్థితులు అనుకున్నంత సజావుగా ఎక్కువ కాలం సాగలేవు. ఎప్పుడైతే డీఎస్ టీఆరెస్‌లోచేరాడో.. నిమత్తమాత్రుడిగా తయారయ్యాడు. జాతీయ పార్టీకి ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్‌గా ఉండి… ఎంతో మందిని తన చేతితో భీపారాలు ఇచ్చిన డీఎస్… రాజకీయ జీవితం కేవలం నాలుగు గోడలకే పరిమితమయ్యింది. వ్యూహాలు మూలకుపడ్డాయి. రాజకీయ అనుభవం పెద్దగా అక్కరలోకి రాలేదు. ఒంటరి జీవితమై పోయింది. కానీ లోపల ఆ రాటు దేలిన మనిషి అలాగే ఉన్నాడు. వ్యహాలు,అనుభవాలు సజీవంగానే ఉన్నాయి. ఇప్పడాయన కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు.
అక్కడ సోనియా కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే తలంపుతో ఉంది. అందుకే దూకుడు మీదున్న రేవంత్‌కు పగ్గాలప్పగించారు. రేవంత్ దూకుడుకు, డీఎస్ వ్యూహ చతురత తోడైతే.. కేసీఆర్ ఎత్తులను చిత్తు చేయవచ్చనే భావన కొంత మంది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. కానీ డీఎస్‌ను పార్టీలోని తీసుకున్నా.. అంతకు ముందున్న ప్రయార్టీ దొరకుతుందా? ఆ గౌవరాన్ని ఇస్తారా? సోనియా వద్ద టర్మ్ ఇంకా అలాగే ఉన్నాయా? ముదిరిపోయిన సీనియర్లందరినీ పక్కన పెట్టే యోచనలో ఉన్న అధిష్టానం.. డీఎస్‌కు పెద్ద పీట వేస్తుందా? డీఎస్ రాజకీయ అనుభవాన్ని పరిగణలోని తీసుకుంటుందా?
ఈ ప్రశ్నలకు సమాధానాల్లేవు. తొందరలోనే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు డీఎస్‌కు 74 ఏండ్లు. వచ్చే ఏడాది 75వ పడిలో జన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నాడట డీఎస్. అప్పటికే తను ఓనిర్ణయం తీసుకోనున్నాడు. తన రాజకీయ భవిష్యత్ పై ఓ క్లారిటీ రానున్నది. ఇప్పుడు స్తబ్దుగా నాలుగు గోడలకే పరిమితమైన డీఎస్.. వచ్చే ఏడాది జన్మదినం నాటికి ఏ పొజిషన్‌లో ఉంటాడో చూడాలి మరి.