ఎస్…ఒక్కటి మాత్రం స్పష్టం…జగన్ మోహన్ రెడ్డి ఏ పనైనా చెయ్యనియ్యండి…దానిలో రంధ్రాన్వేషణ చెయ్యడం, చిలవలు పలవలుగా కట్టు కథలు అల్లడం, కులగజ్జి విశ్లేషకులను స్టూడియోలో కూర్చోబెట్టి జగన్ మీద నిప్పులు చిమ్మించడం, బోలెడంత విషాన్ని కుమ్మరించడం…తెలుగుదేశం పార్టీ బానిస మీడియా అజెండా ఇదే.
జగన్ ప్రభుత్వం వచ్చి ఇరవై ఏడు మాసాలు. దానిలో పద్దెనిమిది మాసాలు కరోనా భయంతో, నిబంధనలతోనే గడిచిపోయింది. చంద్రబాబు రెండున్నరేళ్ల లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్ళాడు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. పరిశ్రమలు లేవు. ఒకటో రెండో వచ్చినా వాటి రాకకు పునాదులు వేసింది మరొకరు. రోడ్లన్నీ పరమ అధ్వాన్నం. ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ జరిగింది. రాజధాని పేరుతో కుంభకోణాలు జరిగాయి. విపక్షాలు అన్నీ బద్ధ శత్రువులు. వ్యవస్థలు కత్తులు దూస్తున్నాయి. అన్నీ ప్రతికూల పరిస్థితులే. జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ కు వెళ్లినా, భోజనం ఒక అయిదు నిముషాలు ఆలస్యంగా చేసినా, కోర్టులో పిల్ పడుతుంది. అవినీతిపై ఎలాంటి విచారణలు చేద్దామన్నా ముందుకు పోనివ్వరు. ప్రభుత్వ అధికారులను దూషిస్తూ వారి మానసిక స్థైర్యం మీద సమ్మెట పోట్లు పొడుస్తున్నారు! ఈ ఆగడాల వెనుక ఎవరున్నారో తెలియని అమాయకులు కాదు జనం. అందుకే చంద్రబాబుకు ఎప్పటికప్పుడు ఘాటైన లోతైన వాతలు వేస్తూనే ఉన్నారు! ఇన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ జగన్ పాలన జరుగుతున్నది!
చిల్లిగవ్వ కు కొరగాని ఖజానా జగన్ చేతికి వచ్చింది. ఎల్లో మీడియా చేసేదంతా దుష్ప్రచారం అని అందరికీ తెలుసు. మేధావులకు కూడా గ్రహింపు ఉంది. అయినప్పటికీ చంద్రబాబు ఐదేళ్లలో నిర్మించలేని స్వర్లోక సృష్టిని జగన్ ఏడాదిలోపే చెయ్యలేదని మేతావులు యమబాధగా మూలుగుతుంటారు! ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రతిరోజూ గంటకోసారి వినిపిస్తుంటే మెల్లగా జనం నమ్మేస్తారనే సిద్ధాంతం చంద్రబాబు, ఆయన బానిస మీడియాది. “తినగా తినగా వేము తియ్యనుండు” అని వేమన చెప్పారు కదా! మొన్నే జరిగిన ఒక ఉదాహరణను చూడండి…చంద్రబాబు పాలనలో కోర్టు ధిక్కారానికి పాల్పడిన అధికారులకు మొన్న జైలు శిక్ష పడితే అది జగన్ పాలనలో జరిగినట్లు ఎల్లో మీడియా ప్రతిరోజూ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నదంటే వారి కుట్రలు అర్ధం కావడం లేదూ?
పరిపాలన అన్న తరువాత కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఒక్క జగన్ మాత్రమే తప్పులు చెయ్యరు. దాదాపు అన్ని ప్రభుత్వాలు తప్పులు చేస్తాయి. కానీ వాటిని సరిదిద్దుకోవడం కూడా జరుగుతుంది. ఇది చాల సహజం. కానీ, మన ఎల్లో మీడియాకు, మేధావులకు జగన్ చేసే తప్పులు భూతద్దంలో కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఎల్లో మీడియా ప్రభావం అంత గొప్పది మరి! మేము చెయ్యాల్సిన అప్పులన్నీ చేసేశాం. ఇక జగన్ కు నయాపైసా కూడా అప్పు పుట్టదు అని వదరుబోతుతనాన్ని ప్రదర్శించారు ఐదేళ్లు ఆర్దికమంత్రిగా ఏపీని దివాళా తీయించిన ఆర్ధికమంత్రి యనమల. అదే యనమల ఇప్పుడు జగన్ లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు అని ఊళలు వేస్తున్నారు! ఎపి దివాళా తీసింది…ఆర్ధిక ఎమర్జెన్సీ పెట్టాలి…జీతాలకు డబ్బులు, ఎవ్వరూ అప్పు ఇచ్చేవారు లేరు..అంటూ కొరడాతో కొట్టుకునే పోతరాజు మాదిరిగా చిందులు వేసిన ఎల్లో మీడియా మళ్ళీ జగన్ కు పదివేలకోట్లు అప్పు తెచ్చుకోవడానికి అనుమతి లభించిందని తెలియగానే కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు పాపం! రాష్ట్రం దివాళా తీస్తుందని, జగన్ జైలుకు వెళ్లాడని, భారతమ్మో విజయమ్మో ముఖ్యమంత్రి అవుతారని రకరకాల పుకార్లు అల్లుతున్నా, వాటిని నమ్మే మేధావులు ఉండటమే నిజమైన దౌర్భాగ్యం!
వాటి పుకార్లు నమ్ముతూ జగన్ ఏవో తప్పులు చేస్తున్నాడని, ప్రజావ్యతిరేక జీవోలు ఇస్తున్నాడని వాపోతుంటారు. అక్కడ పాలించేది, సలహాలు ఇచ్చేది సుదీర్ఘ అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారులు అని గ్రహించరు. వారికన్నా తమకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని భ్రమిస్తుంటారు. ఈత కొట్టేవాడికి తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో. ఒడ్డున కూర్చుని సలహా ఇచ్చేవాడికి ఎలా తెలుస్తుంది?
ఇక్కడ ఎల్లో మీడియా పాత్ర ఒక్కటే. జగన్ ఏమి చేసినా దుమ్మెత్తిపోయాలి. జగన్ ఏమి మాట్లాడినా నక్కలు బొక్కలు వెతుకును సామెతలా తప్పులు వెతకాలి. చిన్న పొరపాటును గోరంతలు కొండంతలు చేసి ప్రజల్లో అయోమయం సృష్టించాలి. చంద్రబాబు మహా అద్భుతమైన పాలకుడు అనే విషాన్ని ప్రజల బుర్రలోకి ఎక్కించాలి. జగన్ నైతికస్థయిర్యాన్ని దెబ్బ తియ్యడానికి ఎంతటి నీచానికైనా దిగజారాలి. జగన్ కన్నా లోకేష్ నాయుడు లక్ష రెట్లు మెరుగు అని జనం భావించేట్లు చెయ్యాలి. అందుకోసం ఎన్ని పార్టీలనైనా కొంటారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీలు చంద్రబాబుకు దాసోహం అని ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతున్నాయంటే “డబ్బులోనే ఉందిరా లోకమంతా” అనే పాత సినిమా పాట గుర్తుకు వస్తుంది! వెయ్యేళ్లకు సరిపడా అక్రమార్జన చంద్రబాబు దగ్గర పోగుపడి ఉంది. అందువలన పెట్టుబడికి ఢోకా లేదు!
కానీ, ఎల్లో మీడియా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే. “వేగంగా ప్రవహించే నదికి తుపాకీ చూపించి బెదిరిస్తే వెనక్కు వెళ్లిపోదు!”
మురళీమోహన రావు
ఇలపావులూరి
