(దండుగుల శ్రీనివాస్)
ఉస్తాద్ భగత్‌సింగ్ లో పవన్ కళ్యాడ్ డైలాగ్ ఇది. తొక్కుకుంటు వచ్చిన.. మళ్లీ తొక్కుకుంటూ వస్తా..! ఇది అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్. ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతున్నది. అదేందీ సీఎం అలా మాట్లాడిండు. అది జాతీయ పార్టీ కదా? అంతా ఆయనొక్కడే గెలిపించేసినట్టు.. నేను, నా అనే పదాలను వాడుతూ ప్రాంతీయ పార్టీ లీడర్ మాట్లాడినట్టే మాట్లాడుతున్నడు..? అని కొందరు. ఎవరిని తొక్కుతుడంట. ఆ పార్టీలోని సీనియర్లందరినీ తొక్కి ఢిల్లీని మేనేజ్ చేసుకుని ఓ వెయ్యికోట్లిచ్చి సీఎం సీటును తీసుకున్నాడని కేటీఆర్.. ఇంకా ఆ పార్టీ నేతలు కొందరు.. ఇలా కామెంట్లు నడుస్తున్నాయి. నిజంగా రేవంత్‌రెడ్డి ఒక్కడే సింగిల్ హ్యాండ్‌తో పార్టీని గెలిపించిండా? లేదా జనాలే ఓసారి కాంగ్రెస్‌కు పట్టం కడుదామని చాన్స్ ఇచ్చారా? కేసీఆర్ అహంకార, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదామని తేల్చి.. కాంగ్రెస్‌కు అన్యపదేశంగా అధికారం ఇచ్చేశారా? ఇప్పుడివి చర్చ జరగాల్సిన అంశాలు.
పీసీసీ చీఫ్‌గా తను పార్టీలో తన స్థానం కైవసం చేసుకున్ననాడే ఆ పార్టీ సీనియర్లు కూడా అందుకు సమ్మతించారు. అధిష్టానం ఆశించింది. నమ్మకం పెట్టుకున్నది రేవంత్‌రెడ్డి మీద. అవును.. ఆనాటి పరిస్థితులు అలా ఉన్నాయి మరి. ఎంతంగా కేసీఆర్ అహంకారపూరిత పాలనైనా.. ఆయనను కొట్టేవాడు లేడనే ప్రచారం ఉంది. అంత బలంగా నాటుకు పోయాడు కేసీఆర్. జనాలు తనను కాదని ఇంకెవర్నీ చూడని పరిస్థితిని క్రియేట్ చేసి పెట్టాడు. ప్రతిపక్షాన్ని నామరూపాల్లేకుండా చేసి దానికి రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టాడు. తను ఏది చెబితే అది వేదం.. జనం కూడా అదే అనుకోవాలనేది కేసీఆర్ శాసనం. ఆ పరిస్థితుల్లో కేసీఆర్‌ను ఢీకొట్టి.. ఆ కోటలను బీటలు వార్చే దమ్ము ఒక్క రేవంత్‌రెడ్డికే ఉందనేది అధిష్టానం ప్రగాఢ నమ్మకం. మరి అప్పటిదాకా ఉన్న సీనియర్లకు అంత సీన్ లేదా? అంటే.. లేదనే చెప్పాలి. ఎందుకంటే వారికి ఎన్నో అవకాశాలొచ్చాయి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు. కానీ అది వారు వినియోగించుకోలేదు. ఎవరో వచ్చి అధికారం తెస్తే ఆ పల్లెంలో వడ్డించిన అన్నాన్ని మాత్రమే తినగలిగే పరాన్నజీవులుగానే ఉన్నారప్పటికీ వారంతా. ఇది నగ్నసత్యం. మరలాంటప్పుడు రేవంత్ రావడం తమకు మంచిదే క దా.. వచ్చి అధికారం తెస్తే ఇంకా మంచిదే కదా.. అధికారం వచ్చిన తరువాత కదా సీఎం పదవి… అప్పుడు చూసుకుందాం లే అనే దోరణి అప్పడు వారిది.
అంటే ఓ రకంగా .. పార్టీలో రేవంత్ ప్రాతినిద్యాన్ని అంతా ముక్తకంఠంతో అంగీకరించారు. సపోర్టు చేశారు. కేసీఆర్‌ను, ఆ పాలనను తుక్కు తుక్కు తిడుతుంటే అటు ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఇటు సీనియర్లు సంతోషంగా చూశారు. వారిలో కూడా ఆశలు చిగురించాయి. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు రేవంత్ చివరి నిమిషం దాకా శ్రమించాడు. అయినా ఏదో అనుమానం. వస్తామా? జనాలు తమను గెలిపిస్తున్నారా? కేసీఆర్ రాజకీయ చతురత, మాయాజాలం ముందు మనం గెలుస్తున్నామా? నిలుస్తున్నామా? ఎన్నో అనుమానాలు. అవన్నీ పటాపంచలు చేసి చివరకు గెలిచారు. అనూహ్యంగానే. అవును. ఆ అధికారం వచ్చింది అంత ఆషామాషీగా కాదు. అలవిమాలిన హామీలే గెలిపించలేదు. అన్నీ ఉన్నాయి అందులో.
ఇప్పుడు తాజా పరిస్తితికి వద్దాం. మొన్ననే అసెంబ్లీలో రేవంత్… గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిండు. ఏకంగా మూడు గంటలు ఎడతెరిపి లేకుండా ఏకిపారేశాడు కేటీఆర్ అండ్ టీమ్‌ను. బీఆరెస్ అండ్ లీడర్లను. ఒక్కసారి ఆ స్థానంలో ఇంకెవరినైనా.. అంటే ఆ పార్టీలోని సీనియర్లను అక్కడ ఊహించుకుందాం కాసేపు. అదే కేటీఆర్ అన్నట్టుగా ఓ ఉత్తమ్, ఓ … ఓ… ఇంకెవరినైనా. అంత సీన్ ఉందా? గుక్కతిప్పుకోకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా, పదేళ్ల లోపాలు పాపాలు ఏకబిగిన ఏకరువు పెట్టి.. నైతికంగా ఆ పార్టీ దివాళ తీసిన వైనాన్ని జనాల ముందుంచి… సవాల్ విసిరి.. మళ్లీ మేమే వస్తాం.. చూస్కో కాస్కో అని శపథం చేసి .. ఎవరి తరం అవుతుంది. అది రేవంత్ వల్లే అవుతుంది. ఇంకెవరి వళ్లా కాదు. అది వారికీ తెలుసు. సవాల్ విసిరి.. అధికారంలోకి మళ్లీ వస్తామనే ధీమాను వ్యక్తం చేసిన రేవంత్‌కు అదంతా ఈజీ కాదనీ తెలుసు. అదంతే రాజకీయం.
రేవంత్ కూడా కేసీఆర్ లాగే పోతున్నాడు కదా. ఇంకా ఈ పరిపాలనలో ఏముంది? ఆ తాను ముక్క లెక్కనే ఉంది ఈ పాలన..!అని పెదవి విరుస్తున్న వారెందరో. అవును.. కానీ, రేవంత్ ముందు ఇప్పుడు ఓ గుణపాఠం ఉంది. అది కేసీఆర్ పాలనా గుణపాఠం. జనాలు ఎందుకు అతన్ని, ఆ పాలనను, ఆ కుటుంబ నియంతృత్వాన్ని కాదనుకున్నారో.. ఎక్కడ కేసీఆర్ వైఫల్యంచెందుతూ వచ్చాడో.. ఎక్కడ తన అహంకారాన్ని ప్రదర్శించడం ద్వారా ఆయా వర్గాలకు దూరమయ్యాడో తెలుసు. ఆ పనులు చేయకుంటే చాలనుకుంటున్నాడు. కానీ అది ఆచరణలో అంత సాధ్యం కావడం లేదు. అది వేరే టాపిక్. ఇక సంక్షేమ ఫలాలు కేసీఆర్ ఇచ్చినట్టు కూడా ఇవ్వడం లేదు కదా..? అనే పెదవి విరుపూ ఉంది. అది రేవంత్‌కూ తెలుసు. కానీ ఇంకా ఎన్నికలకు మూడేండ్లు ఉంది .. రేవంత్ అంచనాలు వేస్తున్నట్టుగా 2029లోనే ఎన్నికలుంటాయి. అప్పటి వరకు ఇంకా చాలా సమయం ఉంది. జనం అసంతృప్తిని దూరం చేసేందుకు. వారిలో సర్కార్ పట్ల ఉన్న గ్యాప్‌ను పూడ్చేందుకు. బీఆరెస్‌ను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేందుకు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
