(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణ జాగృతి ఇప్పుడు రాష్ట్ర రాజకీయల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆరెస్ ప్రజా సమస్యల పై పోరాడటంలో విఫలమైందా? ఇప్పుడు జనం కవిత వైపు ఆసక్తిగా ఎందుకు చూస్తున్నారు..? కేటీఆర్‌ను, కవితను పోల్చి ఎందుకు చూసుకోవాల్సి వస్తుంది? ఎవరేం చేస్తున్నారు? సర్కార్ మెడలు వంచే క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు ఎవరేం చేస్తున్నారు…? ఇప్పుడు ప్రశ్నలన్నీ ఆసక్తిగా మారాయి. చర్యలోకి వస్తున్నాయి. కారణం కవిత. అవును… ఆమె పార్టీ ఇంకా పురుడు పోసుకోనే లేదు. ఇంకా రెండు నెలలు సమయం పట్టేలా ఉంది. కానీ ఆలోపు ఆమె తీసుకున్న స్టాండ్, చేపడ్తున్న ఆందోళనలు, మెరుపు ధర్నాలు, ప్రజా ఉద్యమాలు.. ప్రధాన ప్రతిపక్షానికి మించి ఉంటున్నాయి. ఒక దశలో కవితే ప్రధానప్రతిపక్షమైందా? జాగృతి వేదిక మీదే ప్రజా గొంతుక బలంగా వినిపిస్తున్నదా? అనే చర్చ సాగుతోంది. వాస్తవానికి పరిస్థితులు, జరిగిన పరిణమాలు కూడా అలాగే ఉన్నాయి.
హైడ్రా బాధితులకు అండగా, సర్కార్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టే విషయంలో.. తాజాగా ఆమె చేస్తున్న ఖమ్మం పోరాటం వరకు.. అన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయల్లో చర్చకు తెరలేపుతున్నాయి. మొన్నటి ఖమ్మం సంఘటనే తీసుకుంటే.. కేటీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడనే విమర్శలున్నాయి. అంతకు మించి అతను అక్కడ ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కూల్చివేతలకు కాలు దువ్విన సంఘటనలు ఉండనే ఉన్నాయి. అందుకే కవిత అన్నారు… బీఆరెస్ తను చేసిన పాపాలు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నదని. కానీ అక్కడ నిరవధిక నిరాహార దీక్షకు దిగడం ప్రభుత్వానికే కాదు.. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న బీఆరెస్కూ ముచ్చమటలు పట్టించాయి. ఆమె జనం నాడి తెలుసుకుని ముందుకు వెళ్తున్న తీరు.. ఉద్యమాల రూపుకల్పన చేసుకుంటున్న పద్దతి, సందర్భానుసారంగా తీసుకుంటున్న వడి వడి నిర్ణయాలు ఆమెను జనానికి మరింత చేరువ చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పార్టీ పెట్టకముందే ఆమె రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నదనే భావన కలుగుతున్నది జనంలో.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
