(దండుగుల శ్రీ‌నివాస్‌)

రెండేండ్ల త‌రువాత స‌ర్కార్ జ‌నం వ‌ద్ద‌కు పోతున్న‌ది. జ‌నం ఏమ‌నుకుంటున్నారు? ఇంకా ఏం కావాల‌ని కోరుకుంటున్నారు? ఈ రెండేండ్ల పాల‌న‌లో ఇంకా మిగిలి ఉన్న వ్య‌తిరేక‌త ఏపాటిది? ఇవ‌న్నీ ఇవ‌న్నీ తెలుసుకోవాల‌నుకుంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అందుకే ఆయ‌న వంద రోజుల పాటు జ‌నంబాట‌కు శ్రీ‌కారం చుట్టారు. ప‌రిపాల‌న పై ప‌ట్టుకోసం సీఎం జ‌నంబాటలా ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్ట‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా వ‌చ్చిన ప్రోగ్రెస్ రిపోర్టు ఆధారంగా ఇంకా మిగిలి ఉన్న మూడేండ్ల ప‌రిపాల‌న‌ను జ‌నానికి మ‌రింత చేరువ‌గా తీసుకుపోవాల‌నేది ఆయ‌న ఉద్దేశంగా ఉంది. జిల్లాల క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్సులో దాదాపు సీఎం వారికి దిశానిర్ధేశం చేసింది ఇదే. కొత్త ప‌థ‌కాలు, కొత్త అభివృద్ధి మాట లేదు ఇందులో. ఇస్తున్న ప‌థ‌కాల ప్ర‌చారం మాత్రం ముమ్మ‌రంగా చేయాల‌నే పిలుపే ప్ర‌ధానంగా ఉంది. కానీ వీటికి జ‌నం జేజేలు కొట్టే స్థితిలో లేరు. ఎందుకంటే ఇంకా రావాల్సిన బాకీ వసూలు కాలేద‌నే మైండ్ సెట్‌తోనే వారింకా ఉన్నారు.

రైతుభ‌రోసా రాలేద‌నే అసంతృప్తైతే ప్ర‌తీ సీజ‌న్‌కు వారిని వెంటాడుతున్న‌ది. స‌ర్కార్‌పై ఈ విష‌యంలో ఆ సెక్ష‌న్ల నుంచి దుమ్మెత్తిపోయ‌డం ష‌రా మామూలుగా మారింది. క‌లెక్ట‌ర్ల‌కు, ఎస్పీల‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం.. ప‌రిపాల‌న‌పై ప‌ట్టుకోసం.. జ‌నం నాడి తెలుసుకుని త‌ప్పొప్పులు స‌రిదిద్దుకునేందుకు ముందుకు సాగే క్ర‌మంలో ఈ కార్య‌క్ర‌మం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. కానీ ఎన్ని చెప్పినా.. ఎన్ని రోజులు తిరిగినా.. అభివృద్ధి మంత్రం లేనిది, ఇచ్చిన హామీలు అంద‌నిదే జ‌నం సంతృప్తి చెంద‌రు.. జ‌య‌హో కాంగ్రెస్ అని అన‌రు.. ఇది ప్రాక్టిక‌ల్‌గా సీఎం ప‌రిపాల‌న‌పై దొరికే ఫైన‌ల్ రిపోర్టుగానే ఉండ‌నుంది.

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో, వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలని సీఎం సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

శాఖల వారీగా పది వారాల పాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించాలని ఆదేశించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలని సీఎం సూచించారు.