(దండుగుల శ్రీనివాస్)
ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని కట్టించిందో తెలవదు గానీ, ఈ సర్కార్‌లో కూల్చడం సర్వ సాధారణమైంది. అదీ పేదల గుడిసెలు, ఇండ్లనే. పెద్దల జోలికైతే పోవడం లేదు. రెండేండ్లుగా అది కనిపిస్తూనే ఉంది. మేము పెద్దల పక్షం కూడా కాదు అనడానికి శాంపిల్‌గా అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను బలిపెట్టి వదిలేశారు. ఇక అప్పట్నుంచి పేదల ఇళ్ల విధ్వంసం ఓ యుద్దంలా జరుగుతోంది. రాష్ట్రంలో సమస్యలే లేనట్టు.. జనం అంతా ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నట్టు.. ఇచ్చిన హామీలన్నీ వడివడిగా నెరవేరి సర్కార్‌ను వేనోళ్ల పొగిడినట్టు .. హైడ్రా పేరుతో సర్కార్ చేసిన చర్యలు ఎవరి మద్దతూ పొందలేదు. ఒక్క బతుకమ్మ కుంటకు జీవం పోయడం తప్ప. అయితే తాజాగా తెలంగాణ జాగృతి చేసిన ఆందోళన, ధర్నాతో ఈ హైడ్రా పేరుతో సర్కార్‌లో చేస్తున్న కార్యక్రమంలో మూడు వైఫల్యాలైతే ఇప్పుడు బయటపట్టాయి. వీటికి జనం ముందు సమాధానం చెప్పాల్సిన అనివార్యతను కవిత తెచ్చిపెట్టింది. లేకపోతే.. ఇక హైడ్రాను నమ్మే పరిస్థితి ఇసుమంత కూడా ఉండదు.
నార్సింగిలో వెంటేజ్ రీగల్ రెసిడెన్సెస్ పేరుతో భారీ వెంచర్‌ను నిర్మిస్తున్నారు. ఇది పక్కా మూసీ నదిలోనే ఉంది. సర్కార్ ఏవైతే నిబంధనలు పెట్టి పేదల ఇళ్లను కూల్చేస్తుందో.. ఆ నిబంధనలను కాలరాసి మూసీ రివర్ బెడ్‌లోనే నిర్మాణం జరుగుతున్నది. దీని ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం మెరుపు ధర్నా చేపట్టారు. మూసీలో పేదల ఇళ్లను కూల్చేసిన సర్కార్.. నిబంధనలకు విరుద్దంగా ఇక్కడ నిర్మితమవుతున్న ఈ భారీ వెంచర్‌ను వెంటనే కూల్చాలని, బుల్డోజర్తో రంగనాథ్ వెంటనే రావాలని, అప్పటి వరకు ఇక్కడే ధర్నాకు దిగుతామని ఆమె ప్రకటించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమెను అనంతరం అరెస్టు చేయడంతో మరింతగా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు, జాగృతి లీడర్లకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలలో కవిత కుడి మోచేతికి గాయమైంది. ఆమెను అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీఎస్ ముందు జాగృతి నాయకులు ధర్నాకు దిగారు.
కూల్చివేతల సర్కార్ ముందు జాగృతి మూడు సవాళ్లు..
ఖమ్మం వెలుగుమట్లలో 600 వరకు పేదల ఇండ్లను సర్కార్ కూల్చేసింది. ఇవి భూదాన్ భూములనే నెపంతో ఎలాంటి నోటీసులు లేకుండా రెండు వేల కుటుంబాలను రోడ్డు పడేసింది. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లిస్తామని చెప్పి ఈ విధ్వంసానికి ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం చేసినా.. అది సర్కార్‌కు మచ్చనే మిగిల్చింది. దీనిపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఆ పేదల ఆర్థనాదాలు ఆగలేదు. శాపనార్ధాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో కవిత ఈ భారీ వెంచర్ అక్రమ నిర్మాణంపై మెరుపు ధర్నా చేపట్టడంతో సర్కార్‌కు మరింత తలనొప్పిని తెచ్చిపెట్టడమే కాదు.. కొత్త సవాళ్లను కూడా ముందుంచింది. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చేసిన సర్కార్.. ఈ భారీ వెంచర్‌ను ఎందుకు వదిలేసింది? ఇది ప్రధాన డిమాండుగా జనం ముందుకు పోయింది. కూల్చుతారా? లేదా మీ హైడా పెద్దల పక్షమే.. పేదలకు శాపమేనని నిరూపించుకుంటారా? అని కవిత విసిరిన సవాలును ఉత్తగనే తీసిపారేయడానికి వీలులేదు. సర్కార్ స్పందించాల్సిందే.
#
పట్టించుకోకపోతే జనానికి మెసేజ్ వెళ్లిపోతుంది. పెద్దలను వదిలేశారు. పేదలను బలిపశువులను చేశారని. ఇక బీఆరెస్ హయాంలో అక్రమంగా మూసీ పరివాహకంలో ఇచ్చిన పర్మిషన్ల సంగతీ బయటపడింది. ఈ వెంటేజ్ వెంచర్‌కు బీఆరెస్ సర్కారే పర్మిషన్ ఇచ్చింది. దీన్ని కాంగ్రెస్ సర్కార్ రాగానే ఆపేసింది. ఆరు నెలల తరువాత మళ్లీ దీన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే ఈ సర్కార్‌ను ఆ భారీ వెంచర్ యాజమాన్యం మచ్చిక చేసుకుందన్నమాట. కవిత ఇవే ఆరోపణలు చేశారు. ఆమ్యామ్యాలు తీసుకుని మళ్లీ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని. ఇదే నిజమైతే మరి మీరు హైడ్రా పేరుతో కొండంత రాగం తీయడమెందుకు? పెద్దలనొదిలి.. పేదలను బలిపశులను చేయడమెందుకు? ఆ సర్కార్‌కు మీ సర్కార్‌కు పెద్ద తేడా ఏముంది? దీనిపై జనానికి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది సర్కార్‌కు.
