వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
బీఆరెస్ సర్కార్ నాడు పదేళ్లలో తనను ప్రశ్నించేవాళ్లే లేకుండా చేయాలనుకున్నది. అందుకే ప్రతిపక్షం లేకుండా చేసే పనిని నిర్విగ్నంగా పూర్తి చేసింది. గెలిచిన వారిని గెలిచినట్టు అందరినీ బీఆరెస్‌లో చేర్చుకున్నది. అందుకే ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. ఇట్ల ప్రతిపక్షాలు ఉండకుండా చేసే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది…. అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జాగృతి కార్యాలయంలో సేవాలాల్ 287వ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. ఏ పార్టీలో గెలిచిన సరే బీఆర్ఎస్ లోకి చేర్చుకొని వెగటు పుట్టేలా చేశారని కేసీఆర్‌నుద్దేశించి ఆమె అన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేస్తోందని, దీన్ని ప్రజలకు సహించరని, తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ప్రతిపక్షాలను, అడిగే వారిని ఉండనివ్వాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్ లో కూడా సేవాలాల్ గారి విగ్రహం పెట్టాల్సిందేనన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బంజారాలు లేని మంత్రివర్గం ఉండేది కాదన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో దారుణంగా లంబాడీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. వెంటనే వారికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చాలా సీట్లు వస్తే, బీఆర్ఎస్ కు కొన్ని సీట్లు వచ్చాయని, జాగృతి తరఫున మేము ఒక్క సీటు గెలుచుకుంటే.. ఆ సీటును కూడా లాక్కునేలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇన్ని సీట్లు వచ్చాక కూడా ఇంకా అగడు ఎందుకు ముఖ్యమంత్రి గారు? అని ప్రశ్నించారు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
