(దండుగుల శ్రీనివాస్)
అవినీతి నిజమే. అరెస్టే తరువాయి. కానీ అరెస్టు కానీయకుండా అడ్డుకుంటున్నదెవరు? మోడీ కాదా? బీజేపీ సపోర్టు లేకుండానే కేటీఆర్ అరెస్టు కాకుండా తిరుగతున్నాడా? అందుకే గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ఇంకా నిర్ణయం పెండింగ్‌లో పెట్టలేదా? ఇవన్నీ నిన్నటి వరకు కేంద్రం మీద రేవంత్ సర్కార్ చేసిన ఆరోపణలు. వాస్తవాలు కూడా. కానీ ఇప్పుడు సీన్ మారింది. మోడీ ఈ కేటీఆర్ అరెస్టు రాజకీయ వ్యహంలో తనదైన పంథాను మరోసారి బహిర్గతం చేసుకున్నాడు. ఎత్తుకు పైఎత్తు వేశాడు. అనూహ్యంగా గవర్నర్‌తో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిప్పించాడు. ఇప్పుడు అరెస్టు చేయండి మిత్రో..! అని ఉల్టా రేవంత్ సర్కార్‌నే మోడీ సర్కార్ ప్రశ్నిస్తోంది. ఈ పరిణామం ఒకింత రాజకీయల్లో అందరికీ ఆశ్చర్యానికి గురి చేసిందంటే అతిశయోక్తి కాదు.
ఎందుకంటే… బీఆరెస్‌కు బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఇవి ఇప్పుడు కాకున్నా రేపు రేపు ఒక్కటవబోతున్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. కానీ రాష్ట్ర రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో క్రమ క్రమంగా బీజేపీ కూడా తన స్టాండ్‌ను మార్చుకుంటూ వస్తోంది. అంతిమంగా ఆ పార్టీ లక్ష్యం రానున్న కాలంలో ఇక్కడ అధికారంలోకి రావడం. కాంగ్రెస్ ఓడించడం. ఒక్క బీజేపీ వల్ల అది నెరవేరే విషయం కాదు కాబట్టి .. ప్రాంతీయ పార్టీగా బలంగా ఉన్న బీఆరెస్ సపోర్టు కచ్చితంగా ఉండాలనేది ఆ పార్టీ డిసిషన్ నిన్నటి వరకు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తరువాత… మారుతున్న, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మోడీ సర్కార్ బీఆరెస్‌తో దోస్తానా విషయంలో యూ టర్న్ తీసుకుందా? అంటే అవుననే అనిపిస్తోంది. క్రమంగా ప్రజల వద్ద తన ఉనికి కోల్పోతూ వస్తున్న బీఆరెస్ పార్టీ… ఫామ్‌హౌజ్ కే పరిమితమైన కేసీఆర్.. తన అహంకారంతో మరింతగా పార్టీని భ్రష్టు పట్టించే పనిలో బిజీ బిజీ యాగం చేస్తున్న కేటీఆర్.. ఇవన్నీ చూసిన తరువాత బీజేపీ తన స్టాండ్ మార్చుకుందని అనిపిస్తున్నది.ఇంకా జనరల్ ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఇప్పట్నుంచి వీరిని మోయడం అవసరమా? వీరికి సపోర్టుగా నిలిచి శ్రీ రామ రక్షగా ఉంటూ కాపాడటం అనివార్యమా? అని ఆలోచించినట్టుంది. నో నథింగ్.. అని చివరగా నిర్ణయానికి వచ్చినట్టుంది.
అందుకే కేటీఆర్‌ను అరెస్టు చేసుకుంటారా? ఇగో చేసుకోండి.. మీరు మీరు చూసుకోండి. మధ్యలో మాకేందయ్యా..? మాకేంటీ దాంతో లాభం..? కేటీఆర్ జైలుకు పోతే మాకొచ్చే నష్టమేందివయా? అని ఉల్టా దబాయించే పనిని నెత్తుకుంది బీజేపీ. అందుకే పనిలో పని ఈడీని కూడా ఈ కార్ రేస్ కేసులో రంగంలోకి దింపింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఇంకా బీజేపీని ఈ విషయంలో కార్నర్ చేస్తూ వస్తోంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను కూడా ప్రాసిక్యూషన్ చేసేందుకు డీవోపీటీ నుంచి అనుమతి కావాలని, దీనికి కేంద్రం అడ్డు పడుతున్నదని ఆరోపిస్తున్నది. కానీ వాస్తవానికి ఈ విషయంలో కూడా కేంద్రం పెద్దగా ఇంట్రస్టు చూపడం లేదు. అర్వింద్ కుమార్ సర్వీసు ఇంకా ఏడాదిలో ముగుస్తుంది. ఇప్పుడు ఈయనను కాపాడే విషయంలో కేంద్రానికి ఏ మాత్రం ఇంట్రస్టు లేదు.
పైగా తన వ్యూహంలో భాగంగా ముందుకు పోతున్న మోడీ సర్కార్.. అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కూడా త్వరలో అనుమతి ఇవ్వనుంది. ఇక రేవంత్ సర్కార్ కోర్టులో కేటీఆర్ అరెస్టు అంశం పడనుంది. తాడో పేడో తేల్చుకుని తన కసి, పగ తీర్చుకునే అవకాశం రేవంత్ సర్కార్ ముందరకు వచ్చింది. ఇక ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం కూడా సర్కార్‌కు మంచిది కాదు. ఆ చాన్స్ ఇక లేదు. కానీ దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే మైలేజీ రాజకీయంగా ఎలా ఉంటుందోననేదే పెద్ద ప్రశ్నగా మారింది. తదనంతర పరిణామాలు చూడాల్సి ఉంది.
Dandugula Srinivas
Senior Journalist
7661066999
