Dandugula Srinivas

Senior Journalist

7661066999

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో బీఆరెస్‌కు చెందిన ఓ ఉద్య‌మ‌కారుడు అన్న మాటిది. కేసీఆర్ అంటే ప్రాణం. ఆ పార్టీ అంటే ఎంతో ఇష్టం. పార్టీ పుట్టిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అందులోనే ఉన్నాడు. పార్టీ మార‌లేదు. కేసులు ఎదుర్కున్నాడు. జైలు పాల‌య్యాడు. లాఠీ దెబ్బ‌లు తిన్నాడు. తెలంగాణ వ‌స్తే.. త‌మ బ‌తుకులు మారుతాయ‌నుకున్నాడు. కుటుంబం రోడ్డున ప‌డ్డా.. పెండ్లాం పిల్ల‌లు తిట్టిపోస్తున్నా.. ప‌ట్టించుకోలేదు. త‌నకు తాను ఓ కేసీఆర్‌లా ఫీల‌య్యాడు. ఉద్య‌మ‌కారుడిగా త‌న‌కు క‌ష్ట‌ప‌డిన దానికి త‌గ్గ గుర్తింపు ఉంటుంద‌నుకున్నాడు. కానీ అనుకున్న‌వేవీ కాలేదు. కోరుకున్న కోరిక‌లేవీ నెర‌వేర‌లేదు. తెలంగాణ వ‌చ్చింది. కొత్త ముఖాలొచ్చిప‌డ్డాయి. ఉద్య‌మంలో ముందుండి పోరాడి, దెబ్బ‌లు తిని జైళ్ల పాల‌యిన వాళ్లంతా లాస్ట్ బెంచ‌ర్స్ అయిపోయారు. గుర్తింపు కాదు క‌దా.. ప‌ట్టింపు లేదు. ఆత్మ‌గౌర‌వం కోసం పోరాడిన పార్టీ… ఆ ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసేలా వారిని తీవ్రంగా అవమానించి వ‌దిలేసింది.

మాది ఇక‌పై ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ స్వ‌యంగా ఉద్య‌మ ద‌ళ‌ప‌తే ప్ర‌క‌టించిన త‌రువాత ఇక ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. అచ్చంగా అలాగే జ‌రిగింది. ఉద్య‌మ‌కారులంతా క‌ల్లులో ఈగ క‌న్నా అధ్వాన్న‌మైనారు. కానీ మ‌న‌సు చంపుకుని ఇంకో పార్టీలోకి పోలేదు. ఆత్మ‌గౌర‌వం లేని పార్టీలో రాసుకుని పుసుకుని తిర‌గ‌నూ లేదు. అలా ఉండిపోయారు. న్యూట్ర‌ల్‌గా. అయినా కేసీఆర్ ఏదో ఒక రోజు మార‌క‌పోతాడా? కేటీఆర్ మ‌మ్మ‌ల్ని గుర్తించ‌క‌పోతాడా? మాకు త‌గిన గుర్తింపు ఇక‌నైనా రాక‌పోతుందా?? అనుకుంటూ రోజులు గ‌డిపారు. ఏళ్లు గ‌డిచాయి. కానీ మ‌న‌షి మార‌లేదు. మ‌న‌సులు క‌ర‌గ‌లేదు. అందుకే ఇవాళ వాళ్లంతా కేసీఆర్ అండ్ ఫ్యామిలీని, ఆ పార్టీని బాహాటంగానే శ‌పిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో చిత్తుగా చిత్తుగా ఓడిపోవాల‌ని. అవును .. ఆ ఉద్య‌మ‌కారుడు ఎంతో ఆవేద‌నతో, ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తిన్న బెబ్బులిలా గ‌ర్జించాడు. నో కేసీఆర్‌, నో కేటీఆర్‌.. జాన్తానై. చాలు వీరికి ఇచ్చిన గౌర‌వం. ఓడాల్సింది. వీళ్ల అహంకారం ఇంకా దిగ‌లేదు. దిగాల్సిందే. నేల‌కు రావాల్సిందే. ఓడినా ఇంకా బుద్దిరాలేదు. రాదు కూడా. ఓడాల‌న్నా.. క‌చ్చితంగా ఓడత‌రు చూడు… అన్నాడు.