(దండుగుల శ్రీనివాస్)
బాపు జర పైలమంటున్నది అక్క. ఇది మరీ విడ్డూరం. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేలా? అన్నట్టు. డెబ్బై వేల పుస్తకాలు చదవి, రాజకీయాల్లో ఆరి తేరి.. ఢిల్లీ లెవల్లో చక్రాలు తిప్పగల చాణక్యత ఉన్న బాపుకు.. తాతకు దగ్గులు నేర్పినట్టు నీ సూచనలేందక్కా అర్థం కాలే. మీరు తెలుసుకోండి.. తేరుకోండి.. మునిగిపోతారు… ఏవేవే అంటున్నారు. ఆల్రెడీ మునిగిపోయే ఉన్నారు కదా. ఆయన చేసిన పాపాలకే. ఆయన చేసిన తప్పిదాలకే. అన్న అహంకారపు చేష్టలకే. వాటి గురించి మాట్లాడే సీన్ లేదని తెలుసు కానీ. పదే పదే అన్నా.. బాపు జర పైలమని నువ్వు చెప్తుంటే జనాలు నవ్వుకుంటున్నరక్కా..! నీకేం కావాలో అది చూస్కోరాదు. వాళ్ల దగ్గర నుంచి ఇక నీకేం రాదని తెలిసిపోయింది. మరింకా ముసుగులో గుద్దులాటెందుకు..? ప్రాణం పోయినా.. అన్నకు, బాపుకు చెడు చేసే పనులే చేయననే నక్క వినయాలెందుకు? వాళ్లు నిన్నొద్దనుకున్నారు. మెడలు పట్టి గెంటేశారు. అర్థమైతుందా అక్కా..! అర్థం కానట్టు నటిస్తున్నావా? ఏదైనా ఉంటే రోజుకో ముచ్చట బయటపెట్టు.. నిండా మునిగిన ఆ నావను మరింత ముంచేయ్.. మరి నీకు చేసిన అన్యాయానికి వారికి ఆ శాస్తి జరగాల్సిందే అక్కా. కాదంటారా?
అక్కా.. నువ్వు చెప్పిన ముచ్చట్లలో చాలా వరకు నవ్వు తెప్పించాయనుకో. విస్తుపోయమం కూడా తెలుసా? మాట్లాడాల్నా వద్దా అని నువ్వు తడబడటం ఫస్ట్ సారి చూసిన అక్క. స్క్రిప్ట్ రాసుకొచ్చి మరీ చదవి వినిపించడం కూడా అబ్బా.. చెప్పొద్దు అది నీకు సూట్ కాలేదక్కా. కవితక్కంటే ఫైర్ బ్రాండ్ అంతే. నువ్వు నీ లెక్కనే ఉండాలక్కా.
ఈ సందర్బంగా నీ శైలిని కాదని భిన్నంగా మట్లాడిన తీరు.. అడిగిన ప్రశ్నలను, చెప్పిన ఉదాహరణలపై ఇక్కడ ప్రస్తావించాలనుకున్నా అక్కా. పాలకు పాలు.. నీళ్లకు నీళ్ల లెక్క. ఏమనుకోవద్దు!
– సామాజిక తెలంగాణ కు బాపు కట్టుబడి ఉన్నాడు కాబట్టే.. ఆయన నుంచి ఆ నినాదం తీసుకున్నానన్నావు. ఏనాడక్కా.. బాపు బీసీల కోసం తండ్లాడింది. ఆయనకు రెడ్లు కావాలె. అధికారం కావాలె. అందుకే రెడ్లను చంకన బెట్టుకుని తిరుగుతడు. ఇది అందరీకీ తెలుసు.
– దళితులకు మూడెకరాలు అన్నావు… ఎవరికిచ్చిండు? ఏడిచ్చిండు? ఇంకా నయం దళిత సీఎంను చేస్తానని వీరోచిత ప్రకటన చేశాడని పుసుక్కున అనలేదు. ఇజ్జత్ పోతుండే.
-బంగారు తెలంగాణ అంటే.. హరీశ్, సంతోష్ ఇంటి నిండా బంగారముంటే బంగారు తెలంగాణ అయినట్టేనా? అన్నరు. మరి నువ్వు, కేటీఆర్, మీ బంధువుల ఇంటి నిండా పైసలు, బంగార ముంటే కూడా కాదు కదా అక్కా. నీకు నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలంలోని 150 ఎకరాల దాకా ఉన్నాయంట భూములు.. ఇంకా ఎక్కడెన్ని ఉన్నయో నాకైతే తెల్వదు. అన్న ముచ్చట సరేసరి, అంతా బాగుపడ్డారక్కా.. కోట్లకు కోట్లు వెనుకేసుకున్నారు. కానీ మిమ్మల్నే నమ్ముకున్న ఉద్యమకారులు, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి లీడర్లు మాత్రం బిచ్చగాళ్లైండ్రు. కాదంటావా అక్కా?
– హరీశ్‌రావు .. అడిషనల్ ఫండ్ ఇచ్చిండని అన్నవు. బాపుకు తెల్వకుంట పైసలిచ్చేంత సీన్ హరీశ్‌కుందా అక్కా. ఇస్తే ఆ రోజే అది తెల్సిపోదా? అయినా తీసుకునే దమ్ము , దైర్యం ఎవడైనా చేస్తడా? ఈ ముచ్చట ఉత్తదే అనిపిస్తుందక్కా.
-విజయశాంతి..ఆ శాంతి, ఆ రావు, ఈ రావు, ఈటల,… ఇంకా ఎవరెవరి పేరో చెప్పి.. వాళ్లంతా హరీశ్ చేసుట్లనే బయటకు పోయిండ్రన్నవ్ కదా… బాపుకుతెల్వకుంట.. బాపు తల్చుకోకుంట.. బాపు పగబట్టకుంట… జరిగిందా అక్కా. అసలు హరీశ్‌ను కూడా బాపు చాలా సందర్బాల్లో ఒంటరినే చేశాడు కదక్క. కేటీఆర్‌ను నెంబర్ 2 చేయాలని హరీశ్‌ను ప్రగతిభవన్ ఛాయలకు కూడా రానీయలే… కాదంటవా?
-అప్పుడు రాజశేఖర్‌రెడ్డిని కల్సింది కూడా బాపుకు తెల్వకుంట జరగలే అక్క.. ఎవల్నైనా సీనియర్లను అడిగితే తెలుస్తతి. అప్పటి టీఆరెస్ ముచ్చట వేరే ఉండే. ఆయన గారు చచ్చిపోయి.. మనం బతికిపోయినం గానీ.. లేదంటే టీఆరెస్ భవన్‌కు తాళం వేసుడు ఇంకొన్ని రోజుల్లో జరిగిపోయేదే. ఆడనే నిత్యం వందల మంది పోలీసుల పహారా గుర్తున్నదా అక్కా!
నిన్నోడగొట్టేందుకు కుట్రలన్నవు. ఏ బుద్దున్నోడైనా.. కేసీఆర్ బిడ్డె అని తెలిసినంక.. ఓడగొట్టుర్రా అని తెర వెనుక ఏదైనా చేస్తే వాడి గురించి బాపుకు తెల్వదా..? తెలిస్తే ఆడు బతికి బట్టకడతడా? తప్పులు, పాపలు, లోపాలు, శాపాలన్నీ మన చుట్టే పెట్టుకుని.. ఆడిని ఈడిని బద్నాం చేస్తే జనాలు నమ్ముతరంటవా అక్క.
కాళేశ్వరం అవినీతి సొమ్ము అన్నావు. నిజమే. ఇండ్ల ఒక్క హరీశుడు, సంతోషుడే తీసుకున్నరా..? వాటాలెవరికీ అందలేదా? తెల్వక అడుగుతున్న అక్కో.. ఏమనుకోవద్దు. ఇంజినీర్లే వందలు, వేల కోట్లకు ఎదిగారు. మరి మన ఫ్యామిలీకి కూడా వచ్చి ఉండాలె కదా. సరే మనకెందుకు ఆ లెక్కలు.. సీబీఐ తేలుస్తే తేలుస్తది. ముంచితే నిండా పార్టీని ముంచుతది.
ఏదేమైనా .. ఇట్ల డొంకతిర్గుడు మాటలు జనానికి ఎక్కడం లేదనిపిస్తుందా అక్కా. కొంచెం ఫైర్ పెంచు. ఎట్లాగు నీకు ఫ్రీడం ఇచ్చేసిర్రు కదా. భయమెందుకు? మీమంతా లేమా? బాధితులం.
ఉంటా అక్క. మళ్లా పార్టీ పేరు అనౌన్స్ చేసిన నాడు కలుద్దాం. ఇట్లనైనా సంపాదించిన పైసల్లో పేదలకు, పార్టీ కార్యకర్తలకు, ఉద్యమకారులకు ఎంతో కొంత చిన్నాపాటి వాటా దొర్కుతనది ఆశిస్తూ…!
సదా నీ మేలు కోరే
నీ తమ్ముడు
Dandugula Srinivas
Senior Journalist
8096677451