(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఓవైపు భారీ వ‌ర్షాలు, వ‌ర‌దలు. ప‌లక‌రింపులు లేని ఇంచార్జిలు. హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైన మాజీలు. జ‌నాలకు తీవ్ర ఇక్క‌ట్లు. ర‌వాణా అత‌లాకుత‌లం. ఆగ‌మాగం. ప్రాణాల‌కు మీద‌కు తెచ్చిన భారీ వ‌ర్షాలు. ఆస్తి న‌ష్టం అపారం.. ఇవ‌న్నీ వార్త‌లున్నా.. ఒక్క వార్త‌ను ప‌ట్టుకుని మాత్రం సోష‌ల్ మీడియాలో ఆ రెండు పార్టీలు ఊగిస‌లాగుతున్నాయి. బండి సంజ‌య్‌, కేటీఆర్ క‌లుసుకున్నారు. ఇద్ద‌రు ప‌ర్యాట‌న‌కు వ‌చ్చారు. ప‌రామార్శించేందుకు అలా య‌థాలాపంగా క‌లిశారు. ఇప్పుడు ఈ క‌లియ‌క ఎన్నో చ‌ర్చ‌ల‌కు, ఎన్నో వాద‌న‌ల‌కు, ఎన్నో పోస్టింగుల‌కు వేదికైంది. మా బండ‌న్నా ముందు న‌మ‌స్కారం పెడితే.. కేటీఆర్‌కు క‌నీసం సంస్కారం కూడా లేదు. తిరిగి న‌మ‌స్కారం పెట్ట‌లేద‌ని కొంద‌రు.

కేటీఆర్‌కు అహంకార పోలేదురోయ్‌.. ఆ దొర ఇంకా అట్ల‌నే ఉన్న‌డు.. అని మ‌రికొంద‌రు. ముందు మా కేటీయారే న‌మ‌స్కారం చేశాడురా.. కావాలంటే ఇగో గీ వీడియో చూడు..! అని ఇంకొంద‌రు. ఇలా.. వ‌ర‌ద‌లు, వాన‌లు ప‌క్క‌కు పోయాయి. ఇప్పుడు కేటీఆర్, బండి సంజ‌య్ కల‌యిక‌.. గుస‌గుస‌ల గురించే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎవ‌రికి తోచింది వారు అల్లుకుంటున్నారు. త‌మ టాలెంట్ చూపించేసుకుంటున్నారు. అయినా వాళ్లిద్ద‌రూ ఎప్ప‌టికైనా క‌ల‌వాల్సందేగా బ్ర‌ద‌రు. ఒక‌రు ఎక్కువైతే ఏం.. ఇంకొక‌రు త‌క్కువైతేం.. ఏం..! మ‌నం అన‌వ‌స‌రంగా త‌న్నుకుంటున్నాం.. అని ఇంకొంద‌రు. ఇలా వాదులాడుకుంటున్నారు. ఏమాట‌కామాటే చెప్పుకోవాలె ఇక్క‌డ‌. బండి కొంచె హుందాగానే ప్ర‌వ‌ర్తించాడు.

కేటీఆర్ క‌లిసినప్పుడు కాదు నేచెప్పేది. వాన‌లు, వ‌ర‌ద‌లు, స‌ర్కార్ చర్య‌లు, సాయం.. గురించి. ఈ క‌ష్ట‌కాలంలో ఓ నేత ఎలా ఉండాలో అలాగే ఉన్నాడో. ఏం చేయాలో అది చేశాడు. ఏం చెప్పాలో మీడియాకు అదే చెప్పాడు. మీడియా కొంచెం గెలికే ప్ర‌య‌త్నం చేసినా.. ఆయ‌న ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ కేటీఆర్ మాత్రం త‌న‌క‌ల‌వాటైన దోర‌ణిలో రోమ్ న‌గ‌రం.. పిడేలు.. నీరో చ‌క్ర‌వ‌ర్తి ..అంటూ ఏదేదో చెప్పేశాడు. కానీ ఇక్క‌డ కేటీఆర్ ఒక్క‌టి గ‌మ‌నించ‌లేదు. తాము రెండు సార్లు టికెట్లిచ్చి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు.. మూడో సారి ఓడిన అభ్య‌ర్థులు.. ఇప్పుడు ఇంచార్జిలుగా ఉన్న తాజా మాజీలు.. ప‌త్తాలేరు. వారంతా హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మ‌ళ్లీ మాకు టికెట్లిస్తారా..? ఇయ్య‌ర‌..? లోకల్‌బాడీ ఎన్నిక‌ల భారం మ‌న‌మీదే వేస్తారా…? ష‌రా మామూలుగా పార్టీ నుంచి ఫండ్ పంపిస్తారా..? ఇప్పుడు ఈ టెన్ష‌న్‌లో వ‌ర‌ద‌బాధితుల కంటే ఎక్కువగా బాధ‌ప‌డుతున్నారీ ఇంచార్జిలు.