వాస్తవం ప్ర‌తినిధి – నిజామాబాద్‌:

బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా అధ్య‌క్షుడిగా మూడ్ బాబూరాం నాయ‌క్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ప్ర‌తి ఐదేండ్లకొక‌సారి జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో గ‌తంలో చంద్రునాయ‌క్ జిల్లా అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. త‌రువాత ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాబూరాం నాయ‌క్‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న‌ది సేవా సంఘం క‌మిటీ. ఈ సంద‌ర్బంగా బాబూరాం నాయ‌క్ మాట్లాడుతూ.. త‌న‌పై విశ్వాసంతో బంజారా బాగు కోసం త‌ప‌న ప‌డే త‌న‌ను న‌మ్మి ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నుందుకు నిజామాబాద్ జిల్లాలోని బంజారా ముద్దుబిడ్డ‌లంద‌రికీ పేరు పేరున ధ‌న్య‌వాదాలు తెలిపారు.

త‌న‌పై పెట్టిన విశ్వాసాన్ని కాపాడుకుని బంజారాల ప్రేమాభిమానాలను చూర‌గొనేలా ప‌నిచేస్తాన‌ని పేర్కొన్నారు. మ‌రో ఐదేండ్ల పాటు కొన‌సాగే త‌న అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను గుర‌త‌ర బాధ్య‌త‌గా తీసుకుని త‌ను చేయాల్సిన క‌ర్త‌వ్యాల‌ను కూడా ముందుగానే ప్ర‌ణాళిక చేసుకున్న‌ట్టు ఆయ‌న వివ‌రించారు. ప్ర‌ధానంగా బంజారాల పోడు భూముల సమ‌స్య‌ల బాగా జ‌ఠిల‌మైపోయింద‌ని, దీని ప‌రిష్కారానికి పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌తో మాట్లాడి ప‌రిష్క‌రిస్తాన‌న్నారు. ఆరోగ్య‌రీత్యా ప్ర‌తీ తండాకు ఒక ఏఎన్ఎం ను నియ‌మించేలా, బెస్ట్ అవైలేబుల్ ప‌థ‌కం కింద బంజారాల విద్య‌కు ఆటంకాలు లేకుండా చేస్తాన‌న్నారు. ఇంజినీరింగ్ కాలేజీలో ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా చేసి పేద బంజారాలు ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సించేలా చేస్తాన‌న్నారు.

ప్ర‌తీ తండాకు ఆర్టీసీ బ‌స్సు వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లిసి స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చేస్తాన‌న్నారు. మంచిప్ప ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా తండాల‌కు సాగునీరంద‌నుంద‌ని, దీనిపై స్థానిక ఎమ్మెల్యేతో క‌లిసి ఆటంకాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌న‌వంతు కృషి చేస్తాన‌న్నారు.

పేద కుటుంబంలో పుట్టి.. విద్యార్థి నేత‌గా ఎదిగి..

బాబూరాం నాయ‌క్ పేద బంజారా కుటుంబంలో పుట్టినా.. చిన్న‌ప్ప‌టి నుంచి క‌ష్టాల‌ను ఎదురించి నిలిచే మ‌న‌స్త‌త్వం, ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునే గుణంతో నాయ‌కుడి ల‌క్ష‌ణాల‌ను పుణికి పుచ్చుకున్నాడు. విద్యార్థి నేత‌గా ఎదిగారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లో డీఈఈగా ప‌నిచేసి రిటైర‌యిన బాబూరాం… అంత‌కు ముందు పంచాయ‌తీరాజ్ ఇంజినీరింగ్ అసోసియేష‌న్‌కు అధ్య‌క్షుడిగా, రాష్ట్ర కార్య‌దర్శిగా సేవ‌లందించారు. టీజీవో ప్రెసిడెంట్‌గా 12 సంవ‌త్స‌రాలు ప‌నిచేశారు. ఇప్పుడు బంజారా సేవా సంఘం జిల్లా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. పార్టీల‌క‌తీతంగా బంజారాల మేలు కోసం, వారి అభ్యున్న‌తి కోసం, తండాల బాగు కోసం అహర్నిష‌లు కృషి చేస్తాన‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.