(దండుగుల శ్రీనివాస్)
ఎవరు అధికారంలోకి వచ్చినా మాది రైతు సర్కార్ అనే అంటారు. రైతుల మనసు గెలిచేందుకు ప్రయత్నిస్తారు. కాంగ్రెస్ సర్కార్ కూడా అదే చెప్పింది. కానీ చేతల్లో అది కనిపించలేదు. ఇంత త్వరగా రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కుంటుందని ఎవరూ అనుకోలేదు. కొత్త సర్కార్.. ఏరికోరి తెచ్చుకున్నదాయె.. ఇంకా అంతకు మించి ఏమైనా చేస్తుందేమోనని భారీ అంచనాలు పెట్టుకుంటే.. ఉన్నదే చేయడం లేదు.. అది చేస్తే అంతే చాలు అనే కాడికి తెచ్చింది సర్కార్. ఎవుసం శాఖ మంత్రైతే ఏ పూటకు ఏం మాట్లాడుతున్నాడో.. అసలు ఆయన చెప్పేది నమ్మాలో వద్దో కూడా తెలియకుండా ఉంది రైతులకు.
రైతు భరోసా ఆపి, కొంత ఖాతాల్లో వేసి, ఇంకొంచెం ఆపి.. ఇగో ఇప్పుడు మళ్లా వేస్తామంటున్నారు. కానీ అవి ఆపినవా..? లేక వానాకాలం సీజన్ చాలైంది కాబట్టి… అవి వేస్తున్నారా…? పాతవి లేనట్టేనా..? ఉంటే అవి ఎప్పట్లోగా వేస్తారు…? మూడెకరాల వరకే వేశారు. వదలేశారు. ఇంత గందరగోళంలో రైతాంగం ఉంది. ఈ బాధల్లో వాళ్లంతా సంతోషం కరువై ఉంటే ఇవాళ సీఎం రేవంత్రెడ్డి రైతులతో ఇంటరాక్షన్ కానున్నాడు. అంతా బాగున్నారా..? ఎలా ఉంది ఎవుసం..? మన సర్కార్ మీకోసం ఇంత చేస్తుంది కదా మీరేమనుకుంటారు.? అని అడుగుతాడు కాబోలు.
అక్కడ చెప్పడానికేం ఉంది. అన్నీ బాధలే. అంతా ఎదురు చూపులే. అంతటా నైరాశ్యమే. ఇంతోటి దానికిఈ ముఖాముఖి గోల ఏల సీఎం సాబ్…? ఎవరిస్తున్నారయ్యా మీకు సలహాలు.. ఏదో ఒక ప్రెస్నోటో లేదా మీరే రైతాంగానికి ఓ వీడియో మెసేజో పంపి ఇకపై రైతు భరోసా టంచనుగా పడుతుంది. మీ బాధలు తీరుతాయి.. లోకల్ బాడీలో మనకే జై కొట్టాలని చెబితే సరిపోయేది. అంతే కదా.
