దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

అర్వింద్‌పై ఒంటికాలుపై లేచాడు. నీ మీద పోటీ చేస్తా.. నిన్ను ఓడగొడుతానని ‘మీసాలు’ దువ్వాడు. ఢిల్లీ దాకా వెళ్లి ప్రెస్‌మీట్‌ పెట్టాడు. అర్వింద్‌ ఇప్పటి దాకా ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేదన్నాడు. అధిష్టానం గుర్తించి అతనికి టికెట్‌ ఇవ్వొద్దన్నాడు. నామినేషన్ల దాఖలు చివరి రోజున హడావుడిగా వచ్చి బీజేపీ తరుపున నామినేషన్‌ వేశాడు. తనకు సీ ఫాం ఇస్తారని పోటీలో బీజేపీ తరుపున ఉంటానని మీడియాకు చెప్పాడు.

ఇంత పాట పాడి.. మీసాలు దువ్విన బీజేపీ అసమ్మతి నేత మీసాల శ్రీనివాస రావు నామినేషనే తిరస్కరణకు గురి కావడం చర్చకు తెర తీసింది. ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తానని బీరాలు పలికిన నేత.. సిట్టింగు ఎంపీపై కారాలు మిరియాలు నూరిన నాయకుడు.. సొంత పార్టీలోనే అసమ్మతిని రాజేసిన ఈ లీడర్‌.. నామినేషన్‌ కూడా సరిగ్గా వేయలేకపోయాడని చర్చించుకుంటున్నారు.

పోటీ చేయాలనుకున్నోడు.. కచ్చితంగా పోటీలో నిలబడాలనుకున్న వాడు.. తనకు నామినేషన్‌ ఎలా నింపాలో తెలియనప్పుడు, ఆ నిబంధనలపై అవగాహన లేనప్పుడు ఎవరినైనా అడ్వకేట్‌ను పెట్టుకుని నామినేసన్‌ సంపూర్ణంగా పూర్తి చేసి సమర్పించాలి. కానీ ఇలా హడావుడిగా నామినేషన్‌ వేసి కొండంత రాగం తీస్తే.. ఇగో ఇలా మ్యాచ్‌ మొదలుకాకముందే పెవిలియన్‌కు తిరుగుముఖం పట్టినట్టే ఉంటుంది వ్యవహారం.

మొత్తం పది మందివి నామినేషన్లు ఇలా తిరస్కరణకు గురికాగా.. 32 మంది నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు.

You missed