వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్:
వచ్చిన రిజర్వేషన్‌ను చేజేతులా పోగొట్టుకున్నారు ఇందూరు రెడ్లు. ఇప్పుడు అయ్యో ఇప్పుడెట్లా? దేవుడు వరమిచ్చినా మనమే కాలదన్నుకున్నామే అని బాధపడుతున్నారట. జరిగిన నష్టానికి నివారణ చర్యలు తీసుకోవాలని రెడ్లంతా ఏకమయ్యారు. జిల్లాలో ఏ నామినేటెడ్ పదవి ఖాళీగా ఉందా? అని వాకుబు చేయగా చేయగా.. వారికి నుడా పదవి కనిపించింది. మున్సిపల్ కార్పొరేషన్‌కు రిలేటెడ్ పదవే కావడం.. విస్తరించిన నగరాభివృద్ధిలో నుడాది కీలక భూమిక ఉంటుందనే ఆలోచనతో 19వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిన మేయర్ క్యాండిడేట్ శమంతా నరేందర్‌రెడ్డికి ఈ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను అధిష్టానం ముందుంచినట్టు తెలిసింది.
నుడా చైర్మన్ గా ప్రస్తుతం కేశవేణు కొనసాగుతున్నాడు. అతని పదవీకాలం తొందర్లోనే ముగియనుంది. ఇక అతనికి పొడిగించే అవకాశం లేదు. దీంతో రెడ్లు మేయర్ సీటు కోల్పోయినందున దీనికి నష్ట నివారణగా నుడా చైర్మన్ పదవిని కాట్పల్లి శమంతా నరేందర్‌రెడ్డికి ఇవ్వాలని అధిష్టానం కూడా సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆరెస్ టైమ్‌లో కూడా ఈ పదవి రెడ్లే నిర్వహించారు. ప్రభాకర్‌రెడ్డి రెండు పర్యాయాలు, ఆ తరువాత ఈగ సంజీవరెడ్డి కూడా నుడా చైర్మన్‌గా చేశారు. ఇప్పుడు మళ్లీ రెడ్డికే ఈ పీఠం దక్కేలా ఉంది.
