(దండుగుల శ్రీ‌నివాస్‌)

నిజామాబాద్ బీఆరెస్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నిన్న ఓ మీటింగు పెట్టిండు.. ఓడిన కార్పొరేట‌ర్ అభ్య‌ర్థుల‌తో. మ‌నం బాగానే ప్ర‌చారం చేసినం.. కానీ మందు, మ‌నీ ప్ర‌భావం వ‌ల్ల ఓడిపోయినం అన్న‌డు. అంటే ఓట‌రు దానికి అమ్ముడుపోయిండు..అనే అర్థం వ‌చ్చేలా. కొన్ని రోజులుగా ఇదే అంశం చాలా చోట్ల చ‌ర్చ‌కు కూడా వ‌చ్చింది. ఓట‌రు మ‌రీ నిల‌దీసి అడుగుతున్న‌డు.. మాకియ్య‌వా? మా ఓట్లు మీకు వ‌ద్దా? అని కూడా బెదిరిస్తున్నారు.. అని కూడా ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఓట‌ర్ల‌ను దొంగలుగా, బ్లాక్‌మెయిల‌ర్లుగా, చివ‌ర‌కు బిచ్చ‌గాళ్లుగా కూడా నామ‌క‌ర‌ణాలు చేసేస్తున్నారు. బిరుదులిచ్చేస్తున్నారు.ఎన్నిక‌ల్లో ఈ మందు, మ‌నీ పంప‌కాలు ఇప్ప‌టివి కావు. ఏలిక‌లు ఏళ్ల త‌ర‌బ‌డి పాటిస్తున్న విధానాలే. మ‌రి ఇప్పుడే ఎందుకీ టాపిక్ జ‌న‌బాహుళ్యంలో ఎక్కువ‌గా వినిపిస్తున్న‌ది? ఓట‌ర్లు మ‌రీ లంచ‌గొడులైపోయారా నిజంగానే? ఇప్పుడు దీని గురించే నేనే చెప్ప‌బోయేది. ఇది అంద‌రికీ న‌చ్చ‌క‌పోవ‌చ్చు. మెచ్చుకోక‌పోవ‌చ్చు. వాస్త‌వాలు చేదుగానే ఉంటాయి. నేను రాసేవి కూడా అట్ల‌నే ఉంట‌యి.. షుగ‌ర్ కోటెడ్ మాత్ర‌లాగా కూడా ఉండ‌వు.

ఎన్నిక‌ల్లో ఓట‌రు ఇంత‌లా డ‌బ్బు కోసం ఎదురుచూపులు, ప‌డిగాపులు కాసే ప‌రిస్థితిని ప‌రాకాష్ట‌కు చేర్చింది…బాపు కేసీయారే. ఓర్నీ.. అటూ ఇటూ పోయి మ‌ళ్లా కేసీఆర్ మీద‌నే ప‌డ్డావు..? ఏం ప‌నిలేదా? నీ…..! స‌రే అంతా చ‌దివిన త‌రువాత తీరిగ్గా తిట్టుకుందువు గానీ. మొత్త‌మైతే చ‌దువు. ఓ సినిమా ఉంది. వంశీ ద‌ర్శ‌కుడు. ఓ అధికారి (ఎమ్మెస్ నారాయ‌ణ‌) నిజాయితీప‌రుడిగా ఉంటాడు. ఎట్లైనా ఆ అధికారిని లంచ‌గొండి అధికారిగా మార్చి.. త‌మ ప‌నులు చేపించుకోవాల‌ని కింద ఉన్న మ‌రో అధికారి ( కృష్ణ భ‌గ‌వాన్) ప్ర‌తీ ఫైలులో కొంత డ‌బ్బు పెట్టి సంత‌కాలు చేయించుకుంటాడు. త‌ర్వాత ఫైలులో పేజీకొక నోటు పెడ‌తాడు. ప్ర‌తీ పేజీ మీద సంత‌కం తీసుకుంటాడు. ఇప్పుడు ఆ అధికారి ఎలా త‌యార‌య్యాడంటే.. త‌న ముందుకు వ‌చ్చిన ఫైలులో విష‌యం ఏముందో చూసుకోడు. ఆ నోటు కోసం వెతుకుతాడు. ఏదీ ఇందులో కావాల్సిన డాక్యుమెంట్లు లేవు..? అని ఆ ఫైలును గిరాటేస్తాడు. అక్క‌డి వ‌ర‌కు తీసుకొస్తారు ఆ నిజాయితీ ఆఫీస‌రును. ఇక్క‌డ దాదాపుగా ఓట‌రు ప‌రిస్థితి అలాగే త‌యార‌య్యింది. అంద‌రూ అని కాదు. మాస్ పీపుల్‌ను ఇలా టార్గెట్ చేసి ఓటుకు రేటు పెంచుతూ పోయారు.

తెలంగాణ వ‌చ్చిన త‌రువాత‌… కేసీఆర్ దీన్ని బాగా అల‌వాటు చేశాడు ఓట‌ర్ల‌కు. ఎమ్మెల్యేల‌ను గెలిపించుకోవాలంటే… ఆయ‌నే వారికి ఆర్థికంగా తోడుంటాడు. వారితో పెట్టిస్తాడు. ఓట‌రును ఎంత‌లా నోటు కాగితాల‌తో క‌మ్మేయాలో అంత‌గా క‌మ్మేసి కుమ్మేయాల‌నేది ఆ రాజ‌కీయ నీతిజ్ఞుడి పాల‌సీ. అదే పాటించారు సిట్టింగులు. కేసీఆర్ వీళ్ల‌ను పెంచి పోషించాడు. ఆ పంపిన సూటుకేసుల‌లో కొన్ని సిట్టింగుల కారు డిక్కీలోనే ఉంటాయి. మిగిలినవి పంచుతారు. ఆ పంచిన పైస‌లే ఇప్పుడు డిమాండ్‌ను పెంచేసింది. ఎన్నిక‌ల ప్ర‌చార ఖ‌ర్చును ఖ‌రీదు చేసేసి పారేసింది. ఓట‌రును నోటు మ‌త్తులో ముంచేసింది. నోటు కోసం వేచిచూసే బిచ్చ‌గాడిలా చేసేసింది. ఇక్క‌డ కండిష‌న్ అప్లై. నేను అంటున్న‌ది అంద‌రినీ కాదు. కానీ మేజ‌ర్‌గా మ‌న సొసైటీలో ఉన్న‌ది పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలే క‌దా. వీళ్ల నోట్ల కోసం ఎదురు చూసేది కూడా వాళ్లే క‌దా.

అప్పుడు అల‌వాటు చేసిన నేత‌లు .. ఇప్పుడు ఓట‌రును త‌ప్పుబ‌డుతున్నారు. త‌మ‌కు పోటీగా ఇప్పుడు పంచుతున్న అధికార పార్టీ లీడ‌ర్ల‌ను త‌ప్పుబడుతున్నారు. ఈ రెండూ ఒక్క‌తాను ముక్క‌లే. వారిని చూసి వీరు.. వీరిని చూసి వారు.. ఇలా మార్కెట్ డిమాండ్ పెరిగిపోయింది. క‌త ఎక్క‌డిదాకా వ‌చ్చిదంటే.. నువ్వు ఎంత ఖ‌ర్చు పెడ‌తావు? ఏదీ పైస‌లు చూపియ్యు.. అని క‌ళ్లారా చూసిగానీ టికెట్ ఇవ్వ‌ని ప‌రిస్థితికి. వాడు పంచుతుండు… మ‌నం వాడితో స‌మానంగానైనా పంచాలె. లేదంటే.. ఇంకా ఎక్కువే పంచాలె … దాకా వ‌చ్చింది దుస్థితి. మ‌రి పేదోడు, డ‌బ్బులేనోడు.. ఇక రాజ‌కీయాల్లో ఉండ‌కూడ‌దు. పోటీ చేయ‌కూడ‌దు. చివ‌రాఖ‌కు అక్క‌డ‌కు తెచ్చారు వాతావ‌ర‌ణం. దీనికీ జాతిపిత‌, బాపు, పెద్ద‌సారు ఓ తరుణోపాయం క‌నుక్కున్నాడు. మీ పేద వ‌ర్గాలు ఏడ పోటీ చేస్త‌రు? వాళ్ల‌తో త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారా? రా మా పార్టీలోకి నీకు ఎమ్మెల్సీ ఇస్తా.. నామినేటెడ్ ప‌ద‌వులిస్తా…? అని ఆశ చూప‌డం మొద‌లుపెట్టిండు. అట్ల వంద‌లు, వేల మంది పేర్లు లిస్టులో చేరి ఉన్నాయి. మ‌రి ఎవ‌రికిస్తాడు? ఎంత మందికి న్యాయం చేస్తాడు? ఎన్నిసార్లు ఇలాంటి అబ‌ద్దాలు చెప్పి మోసం చేస్తారు? మీ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం.. అధికారం కోసం కాస్ట్లీ ఎల‌క్ష‌న్లుగా మార్చేశారు. డ‌బ్బున్నోడు, కుల‌బ‌ల‌మున్నోడు మాత్ర‌మే పోటీ చేయాల‌నే కాడికి ప‌రిస్థితి తెచ్చిండ్రు, బీసీల‌లో ఏ ఒక్క కుల‌మో.. రెండు మూడు కులాల‌కు త‌ప్ప అవ‌కాశం ఇవ్వ‌రు. మిగిలిన వారంతా మా బీసీ బిడ్డ అని చెప్పుకోవాలంతే. ఆ కులాల‌న్నీ రాజ‌కీయ ప్రాతినిథ్యం లేక నానాటికి క‌నుమ‌రుగైపోతూ ఉండాలె. ఇదే క‌దా స్వ‌రాష్ట్రంలో కూడా జ‌రుగుతున్న‌ది. దీనికి ఎవ‌రు ఆద్యుడు? ఎవ‌డు బాధ్యుడు? కార‌ణ‌జ‌న్ముడు కాదా? ఒప్పుకోక‌పోతే మీ ఖ‌ర్మ‌. కానీ వాస్త‌వం అదే. మీరు అంగీక‌రించినా.. న‌న్ను ఆడిపోసుకున్నా!

ఓట‌రు బిచ్చ‌గాడు కాదు. విజ్ఞ‌త ఉంది. చైత‌న్య‌మూ ఉంది. ఎవ‌రిని ఎక్క‌డ పెట్టాలో? ఏ స‌మ‌యంలో అంద‌లం ఎక్కించాలో తెలిసినోడు. చ‌దువులేక‌పోవ‌చ్చు. కానీ రాజీక‌యం మీద అవగాహ‌న లేకుండా లేడు. లీడ‌ర్ల తీరు క‌నిపెట్ట‌కుండా గుడ్డిగా ముందుకు పోడు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా. అవ‌కాశం అంద‌రికీ ఇస్తున్నాడు. కానీ దాన్నికాపాడుకోవాల్సింది ఈ కన్నింగు కంత్రీగాళ్లే. అధికారం రాగానే క‌ళ్లునెత్తికెక్కి.. రాజ‌కీయాన్ని వ్యాపారంలా చేసి.. ఓట‌రును పిచ్చోడిలా చూసి చివ‌రాప‌ఖ‌రుకు అనామ‌కుడిగా మిగులుతాడు. కాలం క‌లిసిరాలేద‌నుకుంటాడు. కానీ త‌ను భూత‌కాలాన్ని త‌ర‌చిచూసుకోడు. వ‌ర్త‌మానంలో ప‌శ్చాత్త‌ప‌డ‌డు. భ‌విష్య‌త్తు కాలం కోసం ఎదురుచూస్తాడు. ఇంకెంత‌గా ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టి మ‌ళ్లీ అధికారంలోకి రావొచ్చా..? అని. కానీ అంతా క‌లిసి ఓట‌రును మాత్రం బిచ్చ‌గాడిలానే చూస్తున్నారు. బిచ్చ‌గాడిలానే మిగిల్చారు. ఇది ప‌చ్చినిజం. వాళ్ల బ‌తుకులు మార‌లే. స్వ‌రాష్ట్రం వ‌చ్చినా. వాళ్ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌డ‌లే. కుళ్లిన రాజ‌కీయాలు మ‌రింత కుళ్లి.. దేశానికి కొత్త నిర్వ‌చ‌నం నేర్పుతున్న మ‌న తెలంగాణ సంప‌న్న రాష్ట్రం. కానీ సంప‌న్నులు మాత్రం ఈ బ‌డా రాజ‌కీయ నాయ‌కులు మాత్ర‌మే. బ‌లి ప‌శువులు ఈ బ‌క్క జీవులే. అప్పుడు. ఇప్పుడు. ఎప్పుడూ…….

Dandugula Srinivas

Senior Journalist

7661066999