(దండుగుల శ్రీ‌నివాస్‌)

మోదం.. ఖేదం..! రెండూ కాంగ్రెస్ చ‌విచూసింది నిజామాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో. తృటిలో మేయ‌ర్ పీఠం జార‌విడుచుకునే ప‌రిస్థితి వ‌స్తుండే. కానీ ఎంఐఎం మ‌ద్ద‌తుతో మేయర్ పీఠం గెలుచుకున్న‌ది. కానీ మేయ‌ర్ క్యాండిడేట్‌గా 19వ డివిజ‌న్ నుంచి బ‌రిలోకి దిగిన కాట్ప‌ల్లి శ‌మంతా న‌రేంద‌ర్‌రెడ్డి ఓట‌మి చెంద‌డంతో ఆ పార్టీ నేత‌లు హ‌తాశుల‌య్యారు. మొత్తం అర‌వై డివిజ‌న్ల ప‌రిధిలో బీజేపీకి 28 కార్పొరేటర్ స్థానాలు గెలుపొంద‌గా, కాంగ్రెస్ 18 గెలుచుకున్న‌ది. ఎంఐఎం 13, బీఆరెస్ -1 గెలుచుకున్న‌ది. కో ఆప్ష‌న్ స‌భ్యులు బీజేపీకి ముగ్గురున్నారు. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ. కాంగ్రెస్‌కు ఇద్ద‌రు.. ఎమ్మెల్సీ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌, రూర‌ల్ ఎమ్మెల్యే భూప‌తిరెడ్డి ఉన్నారు.

మేయ‌ర్ సీటు కైవ‌సం చేసుకునేందుకు 31 మ్యాజిక్ ఫిగ‌ర్ కావాలె. ఎంఐఎంతో క‌లిపి సరిగ్గా మేయ‌ర్ కోసం కావాల్సిన స్థానాలు కాంగ్రెస్ ద‌క్కించుకున్న‌ది. దీంతో మేయ‌ర్ సీటుకు కో ఆప్ష‌న్ల అవ‌స‌రం లేకుండానే కాంగ్రెస్ పీఠం ద‌క్కించుకున్న‌ది. మ‌ళ్లీ బీజేపీకి అదృష్టం ముఖం చాటేసింది. చాలా ఏండ్ల త‌రువాత మ‌ళ్లీ ఇందూరు బ‌ల్దియా మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది. మేయ‌ర్ పీఠం ద‌క్కించుకున్న‌ది. నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌గా ఏర్ప‌డిన తరువాత తొలి మేయ‌ర్ ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ పెద్ద కుమారుడు ధ‌ర్మ‌పురి సంజ‌య్ మేయ‌ర్‌గా ఎన్నిక‌య్యారు. ఆ త‌రువాత ఈ మేయ‌ర్ పీఠం కాంగ్రెస్‌కు ద‌క్క‌లేదు. ఇన్నాళ్ల త‌రువాత మ‌ళ్లీ మేయ‌ర్ సీటుపై కాంగ్రెస్ కూర్చున్న‌ది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు గౌర‌వం ద‌క్కింది. ఆయ‌న ఊపిరి పీల్చుకున్నాడు.

Dandugula Srinivas

Senior journalist