(దండుగుల శ్రీ‌నివాస్‌)

నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. చాలా ఏళ్ల త‌రువాత వ‌చ్చిన అవ‌కాశాన్ని జార విడుచుకోవ‌ద్ద‌ని అధికార పార్టీ గెలుపు కోసం అవ‌స్థ‌లు ప‌డుతుంటే.. బీజేపీ మాత్రం కాంగ్రెస్ గెలుపు అవ‌కాశాల‌ను గండి కొట్టే విధంగా విస్తృత ప్ర‌చారం చేసుకుంటున్న‌ది. ఇద్ద‌రి టార్గెట్ ఇప్ప‌డు మేయ‌ర్ క్యాండిడేటే. వాస్త‌వానికి ఈ రెండు పార్టీల మ‌ధ్యే హోరాహోరీ పోరు ఉంది. బీజేపీ ఈసారి భారీ ఆశ‌లు పెట్టుకున్న‌ది ఇందూరు మేయ‌ర్ పీఠంపై. గ‌తంలో కొద్దిలో త‌ప్పిపోయిన మేయ‌ర్ సీటును ఈసారి క‌చ్చితంగా ద‌క్కించుకోవాల‌ని అర్వింద్ ప్రెస్టీజియ‌స్‌గా తీసుకున్నాడు.

త‌న సొంత డ‌బ్బుల‌ను ఖ‌ర్చు పెడుతున్నాడు. కాంగ్రెస్ మేయ‌ర్ క్యాండిడేట్ శ‌మంతా న‌రేంద‌ర్‌రెడ్డి … ఆస్తిప‌న్ను 8 కోట్లు ఏక‌కాలంలో చెల్లించడాన్ని త‌న రాజ‌కీయాల‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నాడు అర్వింద్‌. ఇత‌నికి మేయ‌ర్ పీఠం అప్ప‌గిస్తే .. మొత్తం అవినీతి మ‌యం అవుతుంద‌ని, న‌గ‌రంలోని అన్ని డివిజ‌న్ల‌లో డిపాజిట్లు ఇవ్వండి..కానీ 19వ డివిజ‌న్‌లో పోటీ చేస్తున్న న‌రేంద‌ర్‌కు మాత్రం డిపాజిట్ ద‌క్కొద్ద‌ని ఓట‌ర్ల‌కు పిలుపునిస్తున్నాడు. దీంతో కాంగ్రెస్ కూడా అల‌ర్ట‌య్యింది. బీజేపీ మేయ‌ర్ క్యాండిడేట్ స్ర‌వంతిరెడ్డిని టార్గెట్ చేశారు.

ఆమె పోటీ చేస్తున్న 6వ డివిజ‌న్‌పై ప‌డ్డారు. అస‌లు ఆమెది ఈ డివిజ‌నే కాద‌ని, లోక‌ల్ కాద‌ని, నాన్ లోక‌ల్‌ను గెలిపించుకుంటే ఆమె ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌ద‌నీ ప్ర‌చారం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఈ రెండు పార్టీల ప్ర‌చార హోరు.. వాడిగా సాగుతోంది. రాజ‌కీయం వేడెక్కింది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్నంకావ‌డ‌మంతో ఎవ‌రి వారు ఆరోప‌ణాస్త్రాల‌ను సంధిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల‌కు టార్గెట్ మేయ‌ర్ క్యాండిడేటే అయ్యింది. గెలుపు అవ‌కాశాలు మాకున్నాయంటే మాకున్నాయ‌ని ఈ రెండు పార్టీలు లెక్క‌లు వేసుకుంటున్నాయి. కానీ లోలోప‌ల భ‌యం మాత్రం వెంటాడుతోంది. పైకి మాత్రం మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.