బోధ‌న్‌- వాస్త‌వం ప్ర‌తినిధి:

బోధ‌న్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు పెద్ద మ‌నిషికి పెద్ద త‌ల‌నొప్పినే తెచ్చిపెట్టాయి. అంత‌టా ఒక లెక్కైతే ఇక్క‌డ ఒక లెక్క‌గా మారింది ప‌రిస్థితి. ఇక్క‌డ అధికార పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, మాజీ మంత్రి సుద‌ర్శ‌న్‌రెడ్డి గ‌ట్టి పోటీనిస్తున్నాడు మాజీ ఎమ్మెల్యే ష‌కీల్‌. ముస్లింల‌తో మంచి సంబంధాలుండి.. బోధ‌న్ టౌన్‌లో త‌న‌కు ఎప్పుడూ మెజారిటీని తెచ్చుకునే ష‌కీల్‌.. అదే ధీమాతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాడు. మాజీ మంత్రి ప‌ట్ల ఆ పార్టీలోని నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కే తీవ్ర అసంతృప్తి ఉంది. ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు రానీయ‌కుండా, ఎవ‌రి ప‌నులు చేసిపెట్ట‌కుండా.. ఓ నియంత పాల‌న‌లా అక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌కు,నాయ‌కుల‌కు స‌రైన స్వేచ్చ లేకుండా , ప‌ద‌వులు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టే పెద్ద మ‌నిషికి అన్ని వ‌ర్గాలు స‌రిగ్గా ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌డం లేదు.

ఇది ష‌కీల్‌కు మ‌రింత‌గా క‌లిసి వ‌స్తుంది. జిల్లాకు పెద్ద మ‌నిషిలా వ్య‌వ‌హ‌రించాల్సిన సుద‌ర్శ‌న్‌రెడ్డి ఇప్పుడు బోధ‌న్‌లో ఓట‌మి ఎక్క‌డ చ‌వి చూడాల్సి వ‌స్తుందోన‌నే బెంగ‌ప‌ట్టుకున్న‌ది. ఇంత బ‌తుకు బ‌తికి.. అన్న‌ట్టుగా ఓట‌మే క‌నుక చ‌విచూస్తే ఇజ్జ‌త్ ఖ‌చ్చా అవుతుంద‌నే భ‌య‌మూ వెంటాడుతోంది. మ‌రోవైపు ష‌కీల్ త‌న రాజ‌కీయ వ్యూహాల్లో దూకుడుగా పోతున్నాడు. ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్‌లో దిట్టైన ష‌కీల్‌.. ఎలాగైనా గెలిచి తీరాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఇదిప్పుడు పెద్ద మ‌నిషికి పెద్ద త‌ల‌నొప్పిని తెచ్చిపెట్టింది.