మ్యాడం మ‌ధుసూద‌న్‌..
సీనియ‌ర్ పాత్రికేయులు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. వాస్త‌వానికి, ఫిబ్ర‌వ‌రిలో కార్పొరేష‌న్ గ‌డువు ముగుస్తున్నా.. మ‌రో ఏడాదికాలం వ‌ర‌కు స్పెషల్ ఆఫీస‌ర్ పాల‌న‌లోకే వెళ్లే ప‌రిస్థితి ఉంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ప‌ట్టు కోసం మూడు ముక్క‌లాట వ్యూహాన్ని అనుస‌రిస్తున్నారు. హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌ను మూడు భాగాల‌గా విభ‌జించి .. క‌నీసం రెండు కార్పొరేష‌న్ల‌ను కైవ‌సం చేసుకోవాల‌న్న దిశ‌లో పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగా ఔట‌ర్ రింగు రోడ్డు ఇవ‌త‌లి భాగం ఉన్న మున్సిపాలిటీల‌ను, కార్పొరేష‌న్ల‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో విలీనం చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనిపై హైద‌రాబాద్ కార్పొరేష‌న్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో హ‌డావుడిగా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టి.. నిర‌స‌న‌ల మ‌ధ్య ఆమోదం పొందారు. అంతే హ‌డావుడిగా కేబినెట్ ముందుకు ఈ ప్ర‌తిపాద‌న తీసుకువ‌చ్చి లైన్ క్లియ‌ర్ చేసుకున్నారు.

పెద్ద అంబ‌ర్ పేట్‌, జ‌ల్‌ప‌ల్లి, శంషాబాద్‌, తుర్క యంజాల్‌, మ‌ణికొండ‌, నార్సింగి, ఆదిభ‌ట్ల‌, తుక్కుగూడ‌, మేడ్చ‌ల్‌, ద‌మ్మాయిగూడ‌, నాగారం, పోచారం, ఘ‌ట్‌కేస‌ర్‌, గుండ్ల‌పోచంప‌ల్లి, తూముకుంట‌, కొంప‌ల్లి, దుండిగ‌ల్‌, బొల్లారం, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బ‌డంగ్‌పేట్, బండ్ల‌గూడ జాగీర్, మీర్‌పేట్‌, బోడుప్ప‌ల్, ఫిర్జాదిగూడ‌, జ‌వ‌హార్‌న‌గ‌ర్‌, నిజాంపేట్‌.. ఇలా 27 మున్సిపాలిటీలు (కార్పొరేషన్‌) హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌లో విలీనం చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీని ప్ర‌కారం ప్ర‌స్తుతం 150 ఉన్న డివిజ‌న్లు.. 200 కు పెర‌గ‌నున్నాయి.

దీనికి డివిజ‌న్ల‌ను పున‌ర్విభ‌జ‌న చేయాల్సి ఉంటుంది. పాత‌బ‌స్తీ శివార్ల‌లోని కొన్ని ప్రాంతాల‌ను.. రాజేంద్ర‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల‌ను పాత‌బ‌స్తీ కింద చేర్చి హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌గా మార్చే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. మ‌రోవైపు .. కొత్త న‌గ‌రం సికింద్రాబాద్‌ను ఆనుకోని ఉన్న శివారు ప్రాంతాల‌ను క‌లిపి సికింద్రాబాద్ కార్పొరేష‌న్‌గా మార్చ‌నున్నారు. రంగారెడ్డి అర్బ‌న్ ప్రాంతాల‌ను క‌లిపి సైబ‌రాబాద్ కార్పొరేష‌న్‌గా మార్చ‌డానికి పావులు క‌దుపుతున్నారు. ఈ కొత్త విలీన ప్ర‌తిపాద‌న‌ను మ‌జ్లిస్ పార్టీ వ్య‌తిరేకిస్తున్న‌ది. ఎందుకంటే.. గ‌తంలో శివారు ప్రాంతాల‌ను క‌ల‌ప‌డం వ‌ల్ల 50 డివిజ‌న్లు పెరిగి ఎంఐఎం మేయ‌ర్ స్థానాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ప‌రిధిని మ‌రింత విస్తృతం చేస్తూ త‌మ ఉనికి ప‌రిమితం అవుతుంద‌ని మొద‌ట ఎంఐఎం ఆందోళ‌న చెందింది. కానీ, హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ప్ర‌త్యేక భౌగోళిక ప‌రిస్థితుల కార‌ణంలో ఎంఐఎంకే మేయ‌ర్ పీఠం ద‌క్కుతుంద‌ని కాంగ్రెస్ ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.

రెండు మాకు, ఒక‌టి మీకు అన్న రాజీ సూత్రంతో ఎంఐఎం.. కొత్త విలీన ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రించే ప‌రిస్థితి క‌నిపిస్తున్న‌ది. ఎందుకంటే.. జూబ్లీహిల్స్ ఎన్నిక‌తో పాటు అంత‌కు ముందు చాలా అంశాల్లో కాంగ్రెస్‌కు ఎంఐఎం అండ‌గా నిలుస్తున్న‌ది. ఎంఐఎంతో కాంగ్రెస్ క‌లిసి న‌డ‌వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఎంఐఎం మిన‌హాయిస్తే బీజేపీ, బీఆరెస్ బ‌లంగా ఉంది. ఆ ప‌రిస్తితిని అధిగ‌మించ‌డానికి హైద‌రాబాద్‌పై ప‌ట్టు పెంచుకోవ‌డానికి కాంగ్రెస్ పావులు క‌దుపుతున్న‌ది. జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో విజ‌య ఢంకా మోగించిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికిప్పుడు య‌థాత‌థంగా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ప‌రిస్థితి అంత అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని కాంగ్రెస్ ఆందోళ‌న చెందుతున్న‌ది. ప‌రిస్థితులు అన్ని త‌మ‌కు అనుకూలంగా వ‌చ్చే వ‌ర‌కు ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని స్పెష‌ల్ ఆఫీస‌ర్ల ప‌రిపాల‌ను కొనసాగించ‌డానికి రంగం సిద్ధం చేస్తున్న‌ది.

ఇప్ప‌టికే కేవ‌లం స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌ను మాత్ర‌మే నిర్వ‌హించ‌డానికి ముందుకు వ‌చ్చిన ప్ర‌భుత్వం, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను పెండింగ్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్ డివిజ‌న్ల పున‌ర్విభ‌జ‌న పేరుతో కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను క‌నీసం ఏడాది పాటు వాయిదా వేయ‌డానికి ప్ర‌భుత్వానికి వెసులుబాటు ల‌భించ‌నుంది. ఎందుకంటే.. శివారు కొత్త మున్సిపాలిటీల‌ను విలీనం చేయ‌డం, కార్పొరేష‌న్ల‌ను విభ‌జించ‌డ‌ము, ఆయా కార్పొరేష‌న్ల ప‌రిధిలోకి కొత్త వాటిని చేర్చ‌డ‌ము ఇదంతా పెద్ద తంతు. ఇప్ప‌టికే ఈ విష‌యంపై రేవంత్ స‌ర్కార్ ఖైర‌తాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (హాస్కీ)తో గోప్యంగా స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. ఒక‌వైపు ఎంఐఎంను సంతృప్తి ప‌రుస్తూనే మ‌రోవైపు మూడు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన స‌న్నాహాలు మొద‌లు పెట్టింది. బీజేపీ, బీఆరెస్ పార్టీలు ఈ కొత్త ప్ర‌తిపాద‌న‌పై ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.