(దండుగుల శ్రీనివాస్)
జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం బీఆరెస్ చేయని కుటిల, కుంచిత ప్రయత్నాలు లేవు. ఇప్పటికే కేటీఆర్ నెలకు కోట్లకు కోట్లు గుమ్మరించి నడిపిస్తున్న బీఆరెస్ సోషల్ మీడియాతో ఫేక్ వార్తలను విచ్చలవిడిగా వదులుతూనే ఉన్నాడు. ఉత్తగనే క్రియేట్ చేసి వదలితే ఎవ్వరూ నమ్మరని అనుకున్నారు కాబోలు. జనానికి బాగా దగ్గరై ఉండి, బాగా కనెక్టయి.. పాపులరైన వీ6 టీవీని, వెలుగు పత్రికను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఇటు ఫేక్ వార్తల ప్రచారంతో పాటు వెలుగు, వీ6 ప్రతిష్టను దెబ్బతీయడం.. పనిలో పనిగా మంత్రి వివేక్‌ను కూడా మానసికంగా ఇబ్బంది పెట్టి కాంగ్రెస్‌తో అతనికి పొసగడం లేదని చెప్పడం కేటీఆర్ర కుటిలయత్నంగా ఈ ఎపిసోడ్ నడుస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తున్న పోస్టుల్లో వెలుగు పత్రికనే ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇక తాజాగా వీ6ను కూడా ఇందులోకి లాగారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కవరేజీ వివేక్‌టీవీ సరిగా చేయడం లేదని, సీఎం లైవ్ వస్తున్న సమయంలో ఏవో వార్తలు, స్టోరీలు ఇస్తున్నారని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చిన సర్వే ఫలితాలపై డిస్కషన్లు నడిపిస్తున్నారంటూ ఏవేవో గాలి కబర్లు, తప్పుడు వార్తలు వండి వార్చి సోషల్ మీడియా ప్లాట్‌ఫారంపై వడ్డిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో గెలవకపోతే ఇక పార్టీ ఉనికే లేకుండా పోతుందని కేటీఆర్ భయం పట్టుకుంది. ఇక్కడ గెలుపు ఆ పార్టీకే కాదు.. కేటీఆర్‌కూ జీవన్మరణ సమస్యగా మారింది. ఎలాగైన గెలిచి తీరాలనే ఏకైక లక్ష్యంగా దిగజారి, విలువలు వదిలేసి, పాతాళంలోకి జారి మరీ.. ఇలా ఫేక్‌వార్తలను వండి వారుస్తున్నాడు. దీనికి జనం వద్ద పరపతి, విలువ ఉన్న వీ6ను, వెలుగును వాడుకోవడంతో పాటు వివేక్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాడు.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు వీ6 తనదైన పాత్ర పోషించింది. ప్రజలకు ఏం కావాలో.. ఏం కోరుకుంటన్నారో ఆ వార్తలకే ఎక్కువగా ప్రయార్టీ ఇవ్వడంతో పాటు తెలంగాణం ఉట్టిపడేలా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే టెంపోను మెయిన్‌టేన్ చేస్తున్నదది. తనదైన శైలిలో వార్తలు, స్టోరీలు ఇస్తూ జనానికి ఎప్పుడు చేరువగా ఉండే ఈ మీడియా .. వివేక్‌ది కావడం.. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు ఈ మీడియా హౌజ్‌ను వాడుకునేందుకు కేటీఆర్ అండ్ టీం ఇలా ఫేక్ వార్తలతో నిత్యం ఏదో ఒక వార్తతో తప్పుడు ప్రచారం చేస్తున్నది.
Dandugula Srinivas
Senior Journalist
7661066999
