వాస్తవం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫామ్స్ (ఏడీఆర్‌) అనే సంస్థ ప్రాంతీయ పార్టీల సంపాద‌న‌ల‌పై నిజాలు బ‌య‌ట‌పెట్టింది. దేశ్ కీ నేత కావాల్సిన మ‌న బాపు జ‌ర్రంత‌లో కాలం క‌లిసి రాక ఫామ్ హౌజ్‌కు ప‌రిమితం అయిండు కానీ… లేక‌పోతే తెలంగాణ రాష్ట్రం, బీఆరెస్ పార్టీ ఏడ‌నో ఉంటుండే. ఎందుకంటే.. అన్ని ప్రాంతీయ పార్టీల సంపాద‌న‌తో పోల్చితే మ‌నం నెంబ‌ర్‌వ‌న్‌లో ఉన్నాం. అదే.. బీఆరెస్ పార్టీ ఏకంగా 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి ఏకంగా 686 కోట్ల సంపాద‌న‌తో అన్ని పార్టీల‌ను త‌ల‌ద‌న్ని రాష్ట్రం పేరును, బీఆరెస్ స‌త్తాను చాటింది. ఇన్ని ఆదాయ వ‌న‌రులున్నాయ‌ని కాబ‌ట్టే… ఇంత సంసాద‌న ఇబ్బ‌డిముబ్బ‌డిగా వ‌స్తున్న‌ది కాబ‌ట్టే… బాపు కేసీఆర్ దేశం మొత్తం కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతా అని పోలో మ‌ని బీఆరెస్ పేరుతో బ‌య‌లుదేరిండు. వంద‌ల కార్లేసుకుని మ‌హారాష్ట్రంలో మ‌న రాష్ట్రం స‌త్తా చాటిండు. అక్క‌డెక్క‌డో రైతుల చ‌స్తే.. మేమున్నాం… మాది ధ‌నిక రాష్ట్రం తెలుసా.. అని చేతికి ఎముల లేనట్టుగా అలా అలా దానం చేసేశాడు.

ఇక్క‌డ కేసీఆర్ అన్న‌ది రాష్ట్రం ధ‌నికది కాదు…తాము ధ‌నికుల‌మ‌ని. అదే బీఆరెస్ పార్టీ ధ‌నిక పార్టీ అని. కానీ జ‌నం త‌ప్పుగా అర్థం చేసుకుని మ‌నం అమీర్లం రా బై.. అని మురుసుక స‌చ్చిండ్రు. కానీ ఆ ప‌దేండ్ల పాల‌న‌లో జనాల జీవ‌న ప్ర‌మాణాలు ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డ‌నే అన్న‌ట్టు ఉన్న‌ది. అది అంద‌రికీ తెలుసు. రియ‌ల్ ఎస్టేట్‌ను పండ‌బెట్టి.. తాయిళాల్లాంటి ఉచిత ప‌థ‌కాల‌తో కీర్తి కండూతి కోసం పాకులాడి రాష్ట్రాన్నే అప్పులు పాలు చేసి పోయాడు. ఈ విష‌యంపై జ‌నాల‌కు ఆయ‌న దిగిపోయేదాకా తెల్వ‌దు. తెలిసినంక ఏం చేస్త‌రు.. ముక్కున వేలేసుకుని.. ఔరా..! బాపు ఎంత ప‌నిజేస్తివి..? అని నోరెళ్ల‌బెట్ట‌డం త‌ప్ప‌. ఎన్నో ఏండ్లుగా జ‌నాల‌తో మేమేక‌మైన ప్రాంతీయ పార్టీలు కూడా ఇంత సంపాదించ‌డం లేదు. మ‌రి మ‌న బాపా మ‌జాకా..? ఆయ‌న ఆర్థిక రంగంలో ఆరితేరిన‌వాడాయే. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబ‌ర్ వ‌న్ చేసి చూపుతా… నెంబ‌ర్ వ‌న్ చేసి చూపుతా..! అని ఏ మీటింగు పోయినా… వేదిక ఏద‌యినా.. ఒక్క‌టే ఊద‌ర‌గొట్టేవాడు.

కానీ రాష్ట్రం నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది దివాళ తీసి. బీఆరెస్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. అంద‌రి కంటే.. అత్య‌ధికంగా సంపాదించి. ఇదీ ప‌దేండ్ల చ‌రిత్ర ఆన‌వాళ్లు. త‌వ్విన కొద్దీ బ‌య‌ట ప‌డుతున్నారు. పెంట మీది పేకాసుల్లెక్క‌. ఇంకా ఎన్ని ఎన్ని వినాల్సి వ‌స్తదో.. ఎన్ని చూడాల్సి వ‌స్త‌దో.. వెయిట్ చేయాలె. పార్టీ ఫండే దాదాపు 1500 కోట్లు దాటింది. ఇదంతా వైట్ మ‌నీనే. దీని కోస‌మే అన్నా చెళ్లెండ్లు త‌గువులాడుకున్నార‌నే ప్ర‌చార‌మూ ఆ పార్టీలో న‌డిచింది. మ‌రి ఇంత‌లా సంపాదించి పెట్టిన బాపు.. ఇప్పుడు మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి ఎంత‌కైనా తెగిస్తాడు. ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తాడు. ఏమైనా చేస్తాడు. ప‌క్క‌నున్న మ‌హారాష్ట్రలోకి ఎంట్రీ ఇచ్చి నాకంటే మాయ‌ల మరాఠీ ఎవ‌డూ లేడ‌ని నిరూపించుకున్నాడు. ఇక్క‌డ జ‌నాలు దెబ్బ కొట్టారు గానీ లేక‌పోతే.. అక్క‌డ వంద‌ల కోట్లు గుమ్మ‌రించి మ‌రాఠీల‌ను ఎడాపెడా చెడామ‌డా కొని పెట్టుసుకున్నాడు కూడా. ఇగ ఇప్పుడు ఫోక‌స్ ప‌క్క రాష్ట్రాల మీద కాదు. మ‌న రాష్ట్రం మీదే. సంపాదించింది సెంటిమెంట్ పెట్టుబ‌డిగా క‌దా. రాజ‌కీయాన్నే రాబ‌డిగా చేసుక‌నే క‌దా. అందుకే ఇందులో సంపాదించింది దీంట్లోనే ఖ‌ర్చు పెట్టేందుకు రెడీ అయ్యింది బీఆరెస్ ఫ్యామిలీ పార్టీ. అంత‌లా క‌రువుంటుంది. కానీ బీఆరెస్‌లో ఆర్థిక సంక్షోభం ఇంకా ప‌ది త‌రాలు గ‌డిచినా రాదు.

 

  • అక్ష‌రాలా బీఆర్ఎస్ పార్టీ ఏడాదికి సంపాదిస్తున్న‌ది 686 కోట్లు. ఇది భారతదేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలలో అత్యంత ఎక్కువ! డీఎంకే 180 కోట్లు, టీడీపీ 120 కోట్లు – ఇవి చాలా పాత పార్టీలు. బీఆరెస్‌ అధికారం కోల్పోయి రెండు సంవత్సరాలు అయినా, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది స్పష్టంగా కంపెనీలతో చేసిన మోసపూరిత ఒప్పందాల ఫలితమేనంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు లక్షల కోట్లు సంపాదించి, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ఆ డబ్బును తమ కోసం ఉపయోగిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ డబ్బుతో గ్రామాల్లో రైతులను ఆకర్షించి, ప్రభుత్వం మీద రైతు ఆందోళనలను ప్రేరేపిస్తున్నారంటున్నారు.
  • హైదరాబాద్‌లో యువతను రెచ్చగొట్టి, అల్లర్లకు పాల్పడుతున్నారనే విమ‌ర్శ‌ల‌నూ బీఆరెస్ ఎదుర్కొంటోంది. అధికారం కోల్పోవడం వారికి భరించలేని బాధ కాబట్టి, ఈ రకమైన అవాంఛనీయ చర్యలకు పూనుకుంటున్నారా..? అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తున్న‌ది. ఈ సంపాద‌నంతా మ‌ళ్లీ అధికారం ఎలా రాబ‌ట్టుకోవాల‌నేదానిపై ఖ‌ర్చు పెడుతున్నారు. అందులో భాగంగానే వంద‌లాది యూట్యూబ్ చానెళ్ల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నాడు కేటీఆర్‌. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. సోష‌ల్ మీడియా వేదిక‌గా వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెడుతూ.. అధికారం ఎప్పుడు మ‌ళ్లీ చేజిక్కుతుందా..? అని స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నారు త‌ప్పితే.. నిజంగా జ‌నంపై, రైతులు, యువ‌త‌పై బీఆరెస్ పార్టీకి ప్రేమ ఉందా..? అనేది గ‌త ప‌దేళ్ల పాల‌న చూస్తే అర్థ‌మైపోతుంది. ఓట‌మి పాలు చేసి ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం చేసిన సాక్షం క‌ళ్ల‌ముందు సాక్షాత్క‌రిస్తూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed