వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
ఆమెను ఒంటరి చేశారంతా. తండ్రీ, అన్నా, బంధుగణం పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ప్రశ్నిస్తే పలకరింపులు బంద్. నిలదీస్తే సస్పెన్షన్ వేటు… తప్పులు జరిగాయి.. లోపాలు సరిదిద్దుకుందామంటే.. పార్టీ నుంచి గెటవుట్ అన్నారు. తనపై కుట్రలు జరుగుతున్నయన్న నాడే పిలిచి మాట్లాడి సరిదిద్ది.. తప్పులు దిద్దుకుని కలుపుకుపోవాల్సింది. కానీ అన్న అలా చేయలేదు. తండ్రీ కనీసం పట్టించుకోలేదు. ఇక ఆమె ఒంటరిపోరు చేయాల్సిన తరుణం వచ్చింది. అంతా కలిసి ఏకాకిని చేశామని అనుకుంటున్న తరుణంలో ఎంగిలిపూల జతుకమ్మ ఆమెకు స్వాగతం పలికింది.
నేనున్నానంటూ భరోసా నింపింది. ఆమె రాజకీయ అస్థిత్వం.. ఎదిగిందే బతుకమ్మ నుంచి. ఆ బతుకమ్మే ఇప్పుడు ఆమెకు అండగా నిలబడింది. తండ్రి పట్టించుకోకున్నా.. కేసీఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తుల మాత్రం ఆమెను ఒంటరిని చేయలేదు. భరోసాగా నిలిచారు. ఇంటి ఆడబిడ్డగానే చూశారు. అప్పటికి, ఇప్పటికీ ఏమాత్రం తారతమ్యం చూపలేదు. ఆప్యాయతలే తేడా లేదు. అందుకే అంతా వచ్చారు. ఊరంతా కదిలి ఆమె వద్దకు వచ్చింది. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చింతమడక గ్రామస్తులు తరలివచ్చారు. ఈనెల 21న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానం పలికారు. కష్టకాలంలో తనకు అదే ఆత్మీయతను పంచి తోడుగా నిలిచి ఆహ్వానం పలికినందుకు కవిత సంతోషించారు. ఏకాకి బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ ఆహ్వానం… పట్టలేని ఆనందాన్ని నింపింది.