(దండుగుల శ్రీనివాస్)
ఈ మధ్య రాష్ట్ర రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పదం కర్మఫలం. కర్మ సిద్దాంతం. ఎవరి నోట విన్నా ఇదే పదం పదే పదే వినిపిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి మొదలు.. కవిత వరకు … అంతా ఇదే అంటున్నారు. గతంలో ఇప్పుడు చేసిన పాపాలకు వచ్చే జన్మలో శిక్షలుంటాయని, దానికి ప్రతిఫలం అనుభవిస్తారని అనుకునేవాళ్లు. కానీ ఇప్పడలా కాదు. ఈ కలికాలంలో.. స్పీడ్ యుగంలో.. ఎంత స్పీడ్‌గా తప్పులు చేస్తూ పోతున్నారో అంతే తొందరగా ఆ పాపాలకు శిక్షలు కూడా ఇక్కడే అనుభవించి పోతున్నారట. పోతారట. ఇదే ఇప్పుడు నడుస్తున్న కర్మసిద్దాంతం. కర్మఫలం. ఇప్పుడితంతా ఎందుకంటే.. కేసీఆర్ యాగాల గురించి మళ్లీ టాపిక్ తెర మీదకు వచ్చింది. లేటెస్టుగా ఆయన గణపతి యాగమొకటి చేశాడు. ఇది మామూలే. అంతకు ముందూ చేశాడు. ఇదే కాదు … రాజ శ్యామల యాగమని, అయుత చండీ యాగమని, చండీయాగమని.. చాలానే చేశాడు. కర్మ సిద్దాంతాన్ని బలంగా నమ్మే వ్యక్తి. పూజలపై, యాగాలపై అపర విశ్వాసమున్న వ్యక్తి. సిద్దిపేట బాపనోళ్లు ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటించే వ్యక్తి.
కొత్త పలుకులో ఆర్కే ఓ మాటన్నాడు. జీవితంతో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, కష్టాలు చుట్టి ముట్టినప్పుడు.. దేవుడు, యాగం.. పూజలు బాగా గుర్తొస్తాయని. అవి చేస్తూ ఉంటారని. అధికారం కోసం కేసీఆర్ కూడా యాగాల వైపు మొగ్గు చూపాడని కూడా అన్నాడు. నిజమే. అధికారమే కేసీఆర్‌కు పరమావధి. కలకాలం తన చేతుల్లోనే.. లేదా చెప్పు చేతల్లోనే అధికారం ఉండాలని కోరుకున్నవాడు. తెలంగాణపై గుత్తాధిపత్యం తనదే, తన వాళ్లదే అని తీర్మానించుకుని కూర్చుకున్నవాడు. ఈ యాగాలు చేస్తే అధికారం రాదు కదా.. అలా వచ్చేదుంటే అందరూ అవే యాగాలు చేస్తరు కదా.. అందుకే తలరాతను నమ్ముకోవాలె.. అని కూడా అన్నాడు ఆర్కే. కానీ తలరాతను రాసుకున్నది మనమే. రాసుకుంటున్నది మనమే. మనం చేసే ప్రతీ చర్యకు బాధ్యలం మనమే. తెలిసీ తెలియక చేశాడంటారు. కానీ అది శుద్ద అబద్దం.. నూటికి తొంబై తొమ్మిది శాతం అంతా తెలిసే చేస్తారు. ఏది మంచి ఏదీ చెడు అని తెలుసు. కానీ స్వార్థం కోసం, లాభం కోసం… కామక్రోధ లోభమదమత్య్సార్యాలంటారు కదా.. అందులో భాగంగా చేసిన పాపాలు.. ఇవన్నీ మన గమనంలో ఉండి.. మనం సోయిలో ఉండి చేస్తున్నవే ఎక్కువగా ఉంటాయి. ఉన్నాయి. కేసీఆర్‌వి కూడా ఇలాంటివే.
ఇన్ని యాగాలు చేసిన కేసీఆర్‌కు యాగఫలాలు దక్కడమేమో గానీ ఈ కర్మఫలం మాత్రం వెంటాడుతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరమైన దినాలనే గడుపుతున్నాడు కేసీఆర్. కనీసం కలలో కూడా ఇలాంటి రోజులు వస్తాయని భావించి ఉండడు. మరీ ఇంతటి పాపాలు చేశాడా..? ఇంతటి ఘోరమైన నరకయాతన పడే రోజులు ఎందుకు వచ్చాయా.? అని అనుకుంటారు కొందరు. అధికారం దూరమై, కన్నబిడ్డ శాపనార్దాలు పెట్టి , దుమ్మెత్తిపోసి ఇంటికి, పార్టీకి దూరం కావడం.. అవినీతి కేసులు, సీబీఐ ఎంక్వైరీలు.. ఇలా పాపాలన్నీ ఒకేసారి చుట్టిముట్టి ఊరిపిసలపనివ్వడం లేదు అతనికి.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ రకమైన కేసీఆర్.. ఆ తరువాత మరో రకమైన కేసీఆర్. మొత్తానికి కేసీఆర్ ఒకడే. రూపాలు అనేకం. చర్యలు బహురూపం. లక్షణాలు విచిత్రం. చెప్పే మాటలకు , చేసే చేతలకు పొంతన లేని మనస్తత్వం.. ఇవన్నీ కేసీఆర్ పాపాలకు కేంద్ర బిందువులు. చాలా మంది ఉసురు పోసుకున్నాడంటారు కేసీఆర్‌ను. ఆయనకు దగ్గరగా ఉండి.. తనే దేవుడని నమ్మి, సర్వం త్యాగం చేసి వెంటనడిచి మోసపోయి.. చీత్కారాలకు, అవమానాలకు గురైన ఉద్యమకారులు, లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు.. ఇప్పుడవన్నీ వెంటాడుతున్నాయంటున్నారు వారే. పాపం చాలా విషయాలు తెలియకే చేసుంటాడు. కొందరు చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకుని ప్రవర్తించి ఉంటాడు… అని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే తను చేసే ప్రతీ చర్యా.. తన గమనంలో ఉండి.. తనకు తెలిసి.. తను కావాలనుకుని, తను కక్ష గట్టి.. తన అహంకారాన్ని ప్రదర్శించి చేసినవే. మందిని బలిపెట్టినవే.
వంద ఎలుకలను తిన్న పిల్ల హజ్ యాత్రకు బయలు దేరిందట. అట్లనే ఉంది కేసీఆర్ చేసే యాగాల తీరు. అతగాడు ఎన్ని యాగాలు చేసినా.. యాగఫలం ఎంత ప్రాప్తిస్తుందో గానీ… కర్మఫలం మాత్రం అంతకు మించి.. రెట్టించే ఉంది. అదే వేటాడుతూనే ఉంది.అదింకా పూర్తి కాలేదు. కాదు కూడా. అంతలా వెనుకేసుకున్నాడని అతగాని బాధితులే అంటున్నారు. పక్కా బట్టేబాజీ చేష్టలే కేసీఆర్‌వి అనేది బాధితుల అంతరంగాల నుంచి వచ్చే ఆవేదనభరిత నిశ్చితాభిప్రాయం.
ఏమాటకామాటే. కేసీఆర్‌కు పైసా పిచ్చి లేదు. ఓ కేటీఆర్, ఓ హరీశ్, ఓ కవిత… ఓసంతోష్.. ఇలా చాలా మందే ఉన్నారు ఆ కుటుంబంలో, ఆ కులంలో, ఆ బంధుగణంలో… అధికారంలో ఉన్న సమయంలో దొరికినోడకి దొరికినంత. కానీ కేసీఆర్‌కు ఆ పైసా పిచ్చిలేదు. అతడి చుట్టూ ఉన్న టీమ్ తెగ తింటున్నది.. దోచుకుంటున్నదని తెలుసు. కానీ వారించలేదు. కేసీఆర్‌కు కావాల్సింది అధికారం. అధికారం పోవద్దనుకున్నాడు. అహంకారాన్ని మాత్రం వీడలేదు. అధికారం పోయింది. అహంకారం ఇంకా మిగిలే ఉంది. అది పోదు. పుట్టుకతో వచ్చింది కట్టై కాలే వరకు పోదంటారు కదా. మరి యాగఫలాలు ఏమాత్రం పనిచేస్తాయి… ఈ కర్మఫలం ముందు!
Dandugula Srinivas
Senior Journalist
8096677451