(దండుగుల శ్రీనివాస్)
బాపు, అన్న మంచోళ్లే.. మిగిలనయన్నీ దయ్యాలె. పాపం.. కవితక్క నీళ్లు నములుతూ, తడబడుతూ, తప్పటడుగులు వేస్తూ పార్టీకి గుడ్ బై చెప్పేసింది. కానీ అన్నను అనలేదు. తండ్రిని వీడలేదు. ఆ ఫోటోతోనే కార్యక్రమాలు చేసేలా ఉంది. జై కేసీఆర్ అనే నినాదమూ వీడేలా లేదు. కేసీఆర్‌ను కాదంటే రాజకీయంగా ఎవరూ పట్టించుకోరనే భయమూ ఆమెను వెంటాడుతోంది. కొడుకును అంతలా సపోర్టు చేస్తే.. బిడ్డెగా పార్టీలో స్థానం లేకపోయినా.. రేపు కొత్త పార్టీ పెడితే కూడా నాన్న సహకారం ప్రత్యక్షంగా, పరోక్షంగా తీసుకుని ఎదగాలె కదా. అందుకే ఆమె స్ట్రాటజీ అలా ఉంది. ఇప్పటి వరకు ఆమె తండ్రి చాటు బిడ్డె. రేపు సపరేట్ ప్లాట్ ఫాం పెట్టుకున్నా ఆ తండ్రే తోడు. ఆయన పేరే జీవం. అంతకు మించి సొంత క్రెడిబిలిటీ, చరిష్మా ఎక్కడిది ఆమెకు.
అందుకే ఇద్దరి విషయంలో అచీతూచి మాటలంటున్నది కవిత. కానీ కేటీఆర్ మాత్రం వదలడం లేదు. ఇక చెల్లె ఏందీ..? కవితేందీ..? జాన్తే నై అంటున్నడు. ఇలా పార్టీ వీడిందో లేదో.. అప్పుడే రాజీవ్ సాగర్ అనే తుస్సు పటాక్‌ను పేల్చి నవ్వులపాలయ్యాడు. అది లక్ష్మీబాంబే అనుకున్నాడు. కానీ ఉత్త కుక్క పటాకేనని తేలిపోయింది. అసలు ఎవరీ రాజీవ్ సాగర్..? కవితకు పీఏ. ఇప్పుడు ఏకంగా వేదికెక్కి.. జాగృతే నాది అంటున్నడు. మమ్మల్ని రోడ్డు పాలు చేసి కవిత ఇలాంటి డిసిషన్ ఎలా తీసుకుంటుంది? అని ప్రశ్నిస్తున్నాడు. పీఏగా ఆమె కోటరీలో ఉన్న వాళ్లలో నువ్వూ ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి, ఎవరినీ ఎదగనీయకుండా చేసిన వారిలో నువ్వూ ఓ మెంబరై ఉండి.. పదవులు పొంది.. తీరా కేటీఆర్ పంచన చేరి.. ఇప్పుడు ఆ కేటీఆర్ చెప్పగానే ఇలా కామెంట్లు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
దీనికి కౌంటర్‌గా జాగృతి మహిళలు తుక్కు తుక్కు తిడుతూ ప్రెస్‌మీట్ పెట్టారు. కాదు పెట్టించింది కవిత. కవితను కలవనీయలేదట రాజీవ్ సాగర్. నిజం చెప్పారు. రాజీవ్ సాగరే కాదు.. ఓ శరత్, ఓ పీఆర్‌వో, ఇంకో పీఏ, మరో పీఏ, ఇంటికాడ పీఏ, మెట్టింటి పీఏ, పుట్టింటి పీఏ.. ప్రధాన కార్యదర్శులు, దర్శులు, కులపోళ్లు.. వీళ్లంతా ఆమెకు కోటరీలే. ఆ కోటరీ గోడలు దాటి ఎవరూ ఆమెను కలవలేరు. అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సింది వీరే. ఆస్తులు సంపాదించుకునేది వీరే. పదవులు పొందేదీ వీరే. అక్క చెవిలో జోరిగీలా చాడీలు చెప్పేదీ వీరే. అక్కను అధఃపాతాళానికి తొక్కేసిందీ వీరే.
Dandugula Srinivas
Senior Journalist
8096677451