(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ అంటే అంతే. ఎవరికీ అంతు చిక్కడు. అర్థం కాడు. అసలు తనకు తానే అర్థం కాడు. కవిత పార్టీపై దుమ్మెత్తి పోసి, అవినీతి మరకలంటించి.. నడి బజారులో బరిబాతల నిలబెడితే .. కేసీఆర్ సైలెంట్. వ్యూహమే అంటారా దాన్ని. కావొచ్చు. కాళేశ్వరంలో అవినీతి నిజమే.. దీనికి వీరే కారకులని .. సీబీఐ ఎంక్వైరీ జరగబోతున్న సమయంలో ఆ ఇంటి నుంచే కవిత రూపంలో ఘనమైన సాక్షం బయటకు వచ్చినా.. ఆయన మౌనం. ఇదీ వ్యూహంలో భాగమేనా? కాదంటారా? ఓ వైపు కవిత ప్రెస్‌మీట్ పెడుతుందని.. ఏం చెబుతుందోనని అంతా ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారట. కానీ బాపు మాత్రం వ్యవసాయ క్షేత్రంలో ఎవుసం ఎట్లుందో చూద్దామని పోలోమని పది కార్లేసుకొని గిర్ర గిర్ర తిరిగొచ్చిండట. ఇగ అన్నా రామన్న కూడా టీవీల లైవ్ చూడలేక.. చెల్లె ఏం బాంబులేస్తదోనని టెన్షన్ పట్టలేక.. అక్కడ్నే మీటింగు పెట్టుకుని.. మనల్ని మన ఓవర్ కాన్ఫిడెన్సే కొంపముంచిందోయి..! అని పశ్చాత్తాపపడి చెంపలేసుకుని.. ముక్కు నేలకు రాసినంత పనిచేసిండట.
ఇగ, బాపు రానే వచ్చిండు. మీటింగు పెట్టిండు. మీటింగుల ఏం చెప్పిండు? కవిత గురించి కనీస్కం ఒక్క ముక్క కూడా చెప్పలేదంట. కానీ త్వరలో రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనమే గెలవాలన్నడంట. ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ విడిచి జంప్ అయ్యిండ్రు కదా.. ఆడ పుసుక్కున ఉప ఎన్నికలొస్తే.. మన గతేంది..? మన పార్టీ ఎట్లుంది..? బలం పెరగాలె. విజయం మనదే కావాలె.. అని ఆదేశాలిచ్చిండట. పనిలో పని లోకల్ బాడీ ఎన్నికల్లో మన గతేంది… జనాలేమనుకుంటున్నరు…! అని అడగంగానే.. ఒకడు లేచి.. అదే సార్ కవిత గురించి… ఏదో అనబోయిండంట… ఛల్ ఏమడుగుతున్న ఏం చెప్తున్నవ్ బేవకూఫ్ అనంగనే గజ్జున వొణికి అట్లనే కూలబడ్డడంట. ఇగ సార్ చెప్తుంటే పెన్నూ పేపర్ పట్టుకుని స్కూల్ పోరగాండ్ల లెక్క రాసుకోవాలె తప్ప.. నోరు తెరిచి… మాట్లాడితే మటాషే. అది తెల్వనట్టుంది. లేదా మరిచినట్టున్నాడు. సరే గానీ, ఎట్లైనా సరే మనం లోకల్ బాడీ ఎన్నికల్లో మన సత్తా చూపాలె. ఇగ పోండ్రీ…అని అక్కడే అజ్జాతవాసంలోకి పోయిండట మళ్లీ. అదీ కేసీఆర్ అంటే మరి. ఫక్తు రాజకీయం అదే మళ్లా. రాజకీయాన్ని తాగుతడు. తింటడు. పీలుస్తడన్నట్టు. అట్ల ఎవరికైనా సాధ్యమవునా..? కారణజన్ములకు తప్ప.
Dandugula Srinivas
Senior Journalist
8096677451